Sunday, February 8, 2026
E-PAPER
Homeజాతీయందాసోహం

దాసోహం

- Advertisement -

ట్రంప్‌నకు సాగిలపడిన మోడీ
భారత్‌- అమెరికా మధ్యంతర ట్రేడ్‌ డీల్‌
పశుగ్రాసం ఉత్పత్తులపై డ్యూటీ తగ్గింపు
సోయాబీన్‌, మొక్కజొన్న రైతులకు గడ్డుకాలమే..!

భారత్‌, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అసలు కీలక అంశాలను ఇరుదేశాలు వెల్లడించకుండా తమ రాజకీయ ఆసక్తులను కాపాడుకునే కుట్రకు తెరలేపాయి. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ వల్ల భారత రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి నష్టం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నప్పటికీ.. పూర్తి వివరాలను వెల్లడించకపోవడమే ఇందుకు నిదర్శనం.

కొన్ని రంగాల్లో సున్నాశాతం సుంకాలు పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. అమెరికాకు ఎగుమతయ్యే అనేక ఉత్పత్తులపై అసలు సుంకాలే ఉండవన్నారు. అయితే అవి ఏ రంగాలనేవి మంత్రి ప్రకటించలేదు. ఈ మధ్యంతర ఒప్పందంలో అనేక విషయాలను దాచి పెట్టారని కేంద్ర మంత్రులు పియూశ్‌ గోయల్‌, శివరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలు స్పష్టం చేస్తోన్నాయి. మరోవైపు అమెరికా కూడా కీలక అంశాలను బయటపెట్టకపోవడంతో ఇరుదేశాల నేతల తీరు దాగుడుమూతలను తలపిస్తున్నది.

న్యూఢిల్లీ : భారత్‌..యూఎస్‌ వాణిజ్యడీల్‌పై శనివారం మంత్రి పియూశ్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడుతూ.. సోయాబీన్‌ ఆయిల్‌, మొక్కజొన్న ఉప ఉత్పత్తులు, యాపిల్స్‌, లాంగ్‌ స్టేపుల్‌ కాటన్‌ వంటి ఆందోళనకరమైన అంశాలపై స్వల్ప ఆంక్షలతో దిగుమతికి అనుమతిస్తోన్నట్టు తెలిపారు. అమెరికాకు ఎగుమతయ్యే అనేక వస్తువులపై సుంకాలు ఉండవన్నారు. రత్నాలు, వజ్రాలు, దాదాపు 13 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు, స్మార్ట్‌ఫోన్‌లు సహా అనేక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైనా సుంకాలు ఉండవన్నారు. సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరి, జీడిపప్పు, కూరగాయలు, మామిడి, అరటి, జామ, బొప్పాయి, కివీ వంటి పండ్లు సున్నా టారిఫ్‌ల జాబితాలో ఉన్నాయన్నారు.

భారత్‌ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు 50శాతం నుంచి సున్నాకు తగ్గుతాయన్నారు. వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణ ఉంటుందన్నారు. కాగా.. ఈ ఒప్పందంలోని పారిశ్రామిక ఉత్పత్తుల దిగుమతుల టారిఫ్‌లు, పశుగ్రాసం, జిఎం విత్తనాలు తదితర అంశాలను గోప్యంగా ఉంచడం ఆందోళనకరం. తమ సోయాబీన్‌, పశుగ్రాసం ఉత్పత్తులకు భారత్‌ అనుమతించిందని యూఎస్‌ వర్గాలు వెల్లడించడం గమనార్హం. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు చాలా వరకు జన్యుమార్పిడి చేసిన (జిఎం) పంటల నుంచి తయారవుతాయి. ఇవి తక్కువ ధరకే అందుబాటులోకి రావడం వల్ల సహజ పద్ధతిలో సాగు చేసే భారతీయ రైతులు వీటితో పోటీ పడటం అసాధ్యంగా మారుతుంది.

సోయాబీన్‌ రైతుకు సెగ
భారత్‌-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో దేశీయ సోయాబీన్‌ రైతులకు నష్టం జరగనుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని సుమారు 1.3 కోట్ల హెక్టార్లలో సోయా సాగు చేస్తున్న రైతులకు భారీ నష్టం వాటిల్లనుంది. డ్రైడ్‌ డిస్టిల్లర్స్‌ విత్‌ సొలూబెల్స్‌ (డిడిజిఎస్‌) ఉత్పత్తులు అంటే మొక్కజొన్న లేదా ఇతర ధాన్యాల నుండి పిండి పదార్థాన్ని తీసివేసి పీచు పదార్థాలను ఎండబెట్టి భారత్‌కు యూఎస్‌ ఎగుమతి చేయడానికి ఒప్పందంలో అంగీకారం కుదిరింది. ఈ మొక్కజొన్న ఉప ఉత్పత్తిని ప్రధానంగా ఆవులు, కోళ్లు, పందులు, చేపల మేతకు ఉపయోగించనున్నారు. భారత మార్కెట్‌ ఏటా 7,00,000 టన్నుల కంటే ఎక్కువ అమెరికన్‌ డీడీజీఎస్‌ని దిగుమతి చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు.

అంటే ఆ మొత్తాన్ని భారత్‌లో డంప్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది. ఇది భారత మార్కెట్‌లో సోయా మీల్‌ కంటే దాదాపు 30-40 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. దీనివల్ల మార్కెట్‌లో సోయాబీన్‌ మీల్‌కు గిరాకీ తగ్గి, పరోక్షంగా సోయాబీన్‌ గింజల ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. ఇది అంతిమంగా భారత సోయా రైతులను గడ్డుకాలంలోకి నెట్టనుంది. అమెరికా నుండి వచ్చే సోయాబీన్‌ ఆయిల్‌పై భారత్‌ దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల దేశీయంగా నూనె గింజల ధరలు తగ్గిపోతాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్‌ దాదాపు 4.8 మిలియన్‌ టన్నుల సోయా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు అమెరికా నుంచి మరింత చౌకగా నూనె రావడం వల్ల స్థానిక ప్రాసెసింగ్‌ మిల్లులు రైతులకు చెల్లించే ధరలను కోత పెట్టనున్నాయి.

మొదటి దెబ్బ ప్రాసెసింగ్‌ పరిశ్రమకే..
సోయాబీన్‌ ఆయిల్‌ ప్రస్తుతం అన్ని ముడి రూపాలపై దాదాపు 27.5 శాతం డ్యూటీని, అన్ని రిఫైన్డ్‌ వేరియంట్‌లపై దాదాపు 36 శాతం డ్యూటీ అమలు చేస్తోంది. ఈ టారిఫ్‌లను తాజాగా భారత్‌ ఎత్తివేసింది. సోయాబీన్‌ గింజలను ప్రాసెస్‌ చేసినప్పుడు 18శాతం నూనె, 82 శాతం మీల్‌ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికీ అమెరికా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. అమెరికా నుంచి డ్యూటీ లేని లేదా తక్కువ సుంకంతో ఉత్పత్తులు రావడం వల్ల భారత రైతుల గిట్టుబాటు ధర దెబ్బతింటుందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాపిల్స్‌కు ప్రస్తుత దిగుమతి స్థాయిల ప్రకారం కోటా ఉంటుందని.. అయితే కిలోకు రూ.80 కనీస దిగుమతి ధర, 20 శాతం డ్యూటీ ఉంటుందని గోయల్‌ చెప్పారు. అమెరికాతో సహా వివిధ దేశాల నుంచి భారత్‌ ఇప్పటికే సుమారు 6,00,000 టన్నుల యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటుందని ఆయన చెప్పారు.

మంత్రుల విరుద్ధ ప్రకటనలు
”అమెరికా నుంచి మొక్కజొన్న, గోధుమలు, బియ్యం, సోయా, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాలు, చీజ్‌, ఇథనాల్‌ లేదా పొగాకు రావు,” అని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. కాగా.. సోయాబీన్‌, మొక్కజొన్న ఉత్పత్తుల దిగుమతులకు అనుమతించామని మంత్రి పియూశ్‌ గోయల్‌ పేర్కొనడం గమనార్హం.

కీలక వివరాలు దాచారు : కాంగ్రెస్‌
భారత్‌-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని మోడీ హగ్గులు, ఫొటో షూట్లు దేశానికి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదని.. చివరకు ‘దోస్త్‌ దోస్త్‌ నా రహా’ (మిత్రుడు మిత్రుడిగా మిగలలేదు) అన్న చందంగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేసింది. ‘ఇండియా-యూఎస్‌ సంయుక్త ప్రకటనలో అనేక కీలక వివరాలు దాచారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఇకపై రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోలేదు. ఒకవేళ ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో రష్యా చమురును కొనుగోలు చేస్తే అమెరికా 25 శాతం పెనాల్టీ విధిస్తుంది. ఇది భారత స్వయం ప్రతిపత్తిపై ప్రభావం చూపుతుంది” అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు.

అమెరికా రైతుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశీయ రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. అమెరికా నుండి దిగుమతులు మూడు రెట్లు పెరుగుతాయని దీనివల్ల ఇప్పటివరకు భారత్‌కు ఉన్న వాణిజ్య మిగులు తుడిచుకు పెట్టుకు పోతుందని ఆయన హెచ్చరించారు. భారత ఐటీ సేవల ఎగుమతులపై అనిశ్చితి కొనసాగుతుండగా, వస్తువుల ఎగుమతులపై అమెరికా గతంలో కంటే ఎక్కువ సుంకాలు విధించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. నమస్తే ట్రంప్‌ వ్యూహం హౌడీ మోడీపై పైచేయి సాధించిందంటూ ప్రధాని విదేశీ విధానాన్ని ఎండగట్టారు.

చారిత్రాత్మక అడుగు ప్రధాని మోడీ
భారత్‌, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదని ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తూ దేశీయ తయారీ రంగాన్ని మెరుగుపరిచే ఒక చారిత్రాత్మక అడుగు అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత చొరవను కొనియాడుతూ, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఒప్పందం ద్వారా మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం మరింత బలోపేతం అవుతుందని మోడీ పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని కష్టపడి పనిచేసే రైతులు, వ్యవస్థాపకులు, ఎంఎస్‌ఎంఇలు, స్టార్టప్‌ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త అవకాశాలు తలుపులు తడతాయన్నారు. దీంతో మహిళలు, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -