– మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలి
– సీపీఐ(ఎం ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, పోతినేని సుదర్శన్ పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే పాలకులు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, మతోన్మాద – కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను విస్తృతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. స్థానిక శ్రీశ్రీ ఫంక్షన్ హాల్‌లో మూడు రోజులపాటు జరుగుతున్న రాజకీయ శిక్షణా తరగతులలో భాగంగా “మతోన్మాద – కార్పొరేట్ రాజకీయాలు” అంశంపై వారు బోధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత విభజన రాజకీయాలు పెరిగి ప్రజలను ఉన్మాదం వైపు నడిపిస్తున్నాయని విమర్శించారు. ప్రజల రోజువారీ సమస్యలను పక్కనబెట్టి మతాన్ని సెంటిమెంట్‌గా ఉపయోగించి విద్వేష రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్న పాలకులు, దేశం కోసం భరించాలని నీతిసూక్తులు చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవచనాలు చెప్పడం సరైన విధానం కాదని విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధాల ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ, అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం యుద్ధం ఆపాలని కూడా కోరలేదని అన్నారు. అమెరికా ప్రయోజనాల కోసం భారత సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందాల ద్వారా అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మొక్కజొన్న, చికెన్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు మార్గం సుగమం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల భారత రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం వంటి విలువలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని కాపాడేందుకు ప్రజలు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని, లౌకిక విలువలను, మత సామరస్యాన్ని పరిరక్షించడంలో కమ్యూనిస్టులు మరింత చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల ఆధారంగా ఉద్యమాలను నిర్మించి, ప్రజలను పోరాటాలకు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజా పోరాటాల ద్వారానే మత విభజన రాజకీయాలకు చెక్ పెట్టగలమని పేర్కొన్నారు.
ముందుగా శిక్షణా తరగతుల ప్రారంభ సూచికగా పార్టీ పతాకాన్ని అశ్వారావుపేట ప్రాంత సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, ఎం.బి. నర్సారెడ్డి, కే. బ్రహ్మచారి, కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ, దొడ్డ రవి, ఎస్.ఏ. నబి, చిరంజీవి నాయుడు, పిట్టల అర్జున్, మోరంపూడి శ్రీనివాస్, ముదిగొండ రాంబాబు, కొండబోయిన వెంకటేశ్వర్లు, వీర్ల రమేష్, గడ్డం స్వామి, యాసా నరేష్, భూక్య రమేష్, వాంకుడోత్ కోబాల్, సోడే ప్రసాద్, గద్దల శ్రీను, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




