టీ, టిఫిన్, చుక్కాముక్క అదనం
రోజుకో పార్టీ తరఫున ప్రచారం
స్త్రీలపై ఇక్కడా వివక్ష్షే.. పురుషులకన్నా రూ.200 తక్కువ కూలి
కిరాయి ప్రచారకర్తల ఇండ్లలో ప్రధాన పార్టీల కండువాలు
ప్రింటింగ్ ప్రెస్‌లు, డ్రైవర్లు, కళాకారులకు ఉపాధి మార్గం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కిరాయి ప్రచారాలు అధికమయ్యాయి. పట్టణా లకు సమీపంలోని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి జనాన్ని కూలీకి ప్రచారం నిమిత్తం ఆయా పార్టీలు తీసుకొస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికలు తాత్కాలిక ఉపాధి మార్గంగా మారాయి. అభ్యర్థులు 2, 3 తేదీల నుంచి తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లే వారికి గిరాకీ పెరిగింది.
ఒక్కొక్కరికి రోజుకు రూ.700 వరకూ కూలి చెల్లిస్తున్నారు. మహిళలకు రూ.500 వరకు ఇస్తున్నారు. పైస్థాయి నాయకులు వచ్చినప్పుడు ఎక్కువ సమయం ప్రచారం చేయాల్సి వస్తే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రోజువారీ కూలీకి తోడు మద్యం, బిర్యానీ అదనం. ప్రతిరోజూ ఎన్నికల ప్రచారానికి బయలుదేరే ముందు టీ, టిఫిన్లు సమకూర్చుతున్నారు. ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చిన జనాలను వెంటేసుకొని వార్డులు, డివిజన్లలో తిరుగుతూ సాగిస్తున్న ప్రచారంతో ఎప్పుడూ చూడని ముఖాలను చూసి ఆ వార్డు ఓటర్లే ఆశ్చర్యచకితులవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో చాలా చోట్ల ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయి.
నామినేషన్ల నుంచి మొదలు..
మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల నుంచి మొదలు ప్రచారం వరకూ పార్టీల నేతలు, అభ్యర్థులు కూలీల పైనే ఆధారపడుతున్నారు. ప్రచారానికి మహిళలు, పురు షులను పిలిపించుకుంటున్నారు. ఏ పార్టీ ప్రచారానికి వెళ్తే ఆ పార్టీ కండువా మెడలో వేసుకొని, జెండా చేతులో పట్టుకొని జై అంటూ నినాదాలు ఇస్తున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి రోజు ‘కూలి’ ఇస్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచారం అంటే ఆయా పార్టీ ల కార్యకర్తలే ప్రచారంలో పాల్గొనేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎన్నికలు అంటేనే డబ్బుల వ్యవహారమే కన్పిస్తోంది. డబ్బు ఖర్చు పెట్టే వారే ఎన్నికల్లో పోటీ చేస్తు న్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి అయినా అంగ.. అర్థబలం ఉంటేనే ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పైసలు సరిగా ఇవ్వకపోతే వాగ్వాదం
పట్టణాల్లోని అడ్డా కూలీలు అనేకమంది సాధారణ రోజుల్లో భవన నిర్మాణాలు, పారిశుధ్యం పనులకు ఎక్కువగా వెళుతుండేవారు. ఇప్పుడు వీరంతా ఎన్నికల ప్రచార కూలీలుగా మారారు. ఏ రోజు పేమెంట్ ఆరోజు చేయకపోయినా.. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోయినా పలు మున్సిపాలిటీల్లో గొడవలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఒక పార్టీ నిర్వహించిన ప్రచారానికి వంద మందికి పైగా మహిళలు వచ్చారు. ప్రచారం ముగిసిన అనంతరం రూ.500కు బదులు రూ.300 ఇవ్వడంతో తమను తీసుకొచ్చిన వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. కొందరికి రూ.500 ఇచ్చి మాకు.. రూ.300 ఇస్తావా..? అంటూ గొడవ చేశారు.
ప్రచార సామగ్రికి పెరిగిన డిమాండ్
ప్రచార సామగ్రి జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాల ముద్రణ వంటి రంగాల్లో పని చేసే వారికి పని పెరిగింది. ప్రచార నిమిత్తం వాయిస్ ఓవర్ ఇస్తే రూ.20వేల వరకూ తీసుకుంటున్నారు. నృత్యాలు, డప్పుల దరువులు వేసే కళాకారులకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.వెయ్యి వరకు కూలి చెల్లిస్తున్నారు. ఇవే కాకుండా బాణసంచా, టపాసులకూ డిమాండ్ ఏర్పడింది. థజెన్డ్ వాలా ఒక్కో కట్టకు రూ.1000కి పైనే తీసుకుంటున్నారు. పెద్ద నాయకులు వచ్చినప్పుడు వీటిని పేల్చేందుకు సైతం కూలీలను నియమిస్తుండటం గమనార్హం. ఎన్నికల విధులు, అభ్యర్థుల ప్రచారానికి వాహనాల వినియోగం పెరగడం వల్ల ఆటో, కారు డ్రైవర్లకూ డిమాండ్ ఏర్పడింది. మొత్తం మీద ఎన్నికల ప్రచారం చాలా కాస్ట్లీగా మారింది. కనీసం రూ.30 లక్షలకు పైగా డబ్బులు చేతిలో ఉంటేనే పోటీ చేయాల్సిన స్థితి ఏర్పడిందని పలువురు నాయకులు అంటున్నారు.
తక్కువలో తక్కువ రోజుకు రూ.లక్ష ఖర్చు
ఏ మున్సిపాలిటీలోనైనా ఒక్కో వార్డు అభ్యర్థికి రోజుకు రూ.లక్ష వరకు ఖర్చు వస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థి మొత్తం ఖర్చే రూ.లక్షకు మించి ఉండరాదని ఎన్నికల సంఘం నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకునే స్థితి లేదు. కొందరు అభ్యర్థులు రోజుకు రూ.2 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటీ పడి ఖర్చు పెడుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థుల్లో కొందరు మినహా చాలా మంది పరిమితంగా ఖర్చు చేస్తున్నారు. ప్రచారానికి వస్తున్న వారి పేర్లు ముందుగా రాసుకొని, ప్రచారం ముగియగానే పేమెంట్ చెల్లిస్తున్నారు. ప్రచారానికి వచ్చే వారితోపాటు ఆయా వార్డుల ఇన్చార్జీలు, ముఖ్య నాయకులకు సైతం అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తోంది.



