Thursday, June 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమూడు ముక్కలాటలో ముద్దాయిలెవరు?

మూడు ముక్కలాటలో ముద్దాయిలెవరు?

- Advertisement -

ప్రధాని మోడీ, హైదరాబాద్ పర్యటన సందర్భంగా, రేవంత్ నాయకత్వం తమతో సహకరించాలన్నారు. దీని అర్థం ఏమిటి? కేరళం మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఇంటి మీద ఈడీ దాడులను మన ముఖ్యమంత్రి ఖండించ లేదు. కారణం ఏమిటి? మేమే తెలంగాణ తెచ్చామని ఒకరు, మేమే ఇచ్చామని మరొకరు, చిన్నమ్మ లేకుండా సాధ్యమయ్యేదా అని ఇంకొకరు చెప్పుకుని అలిసిపోయారే కానీ, సమస్యలు మాత్రం తిష్టవేసుకుని కూర్చున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు నీటి మీద రాతలైనాయి. మౌలిక సమస్యల పరిష్కారానికీ, రాష్ట్రం ఏర్పాటుకు సంబంధమే లేదని చెప్పేవారు చెబుతూనే వచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని విస్మరించిన పాలకవర్గ పార్టీలు ఇప్ప్పుడు తెలంగాణ సమాజం ముందు ముద్దాయిలుగా నిలబడక తప్పదు. రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు, దేశాన్ని పాలిస్తున్న పార్టీ చేసిన బాసలన్నీ నీటిమూటలైనాయి. పైగా, కొత్త నాటకాలకు తెరలేపాయి.తెలంగాణ ప్రజలు ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ఈ మూడు ముక్కలాటలో ప్రతి ఒక్కరూ, మిగిలిన ఇద్దరు కుమ్మక్కయ్యార నటం అలవాటుగా మారింది. తాజాగా రేవంత్‌రెడ్డి తమతో సహకరించాలని ప్రధాని మోడీ నర్మగర్భంగా చెప్పిన మాటలు అనేక చర్చలకు తెరలేపాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యూనియన్ ప్రభుత్వంతో ఘర్షణ పడి నిధులు తేలేకపోయిం దనీ, తమ ప్రభుత్వం సహకార ధోరణితో నిధులు సాధిస్తు‌న్నదని ముఖ్యమంత్రి పదేపదే చెప్పారు. యూనియన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో బీఆర్‌ఎస్ నాయకత్వం కుమ్మక్కయ్యిందని కవిత ఆరోపించారు. టీఆ‌ర్‌ఎస్ పేరుతో పార్టీ కూడా నెలకొల్పారు. తెలంగాణ రాజకీయ చిత్రపటం నుంచి బీఆ‌ర్‌ఎస్ కనుమరుగయ్యేటట్టు చేసి, ఆ స్థానంలోకి బీజేపీ రావాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నది. ఇవన్నీ మారిన రాజకీయ పరిస్థితులలో నడుస్తున్న కొత్త నాటకాలు. అంతిమంగా తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటన్నది అసలు ప్రశ్న.

ప్రధాని మోడీ తెలంగాణ గడ్డ మీద నుంచి, దేశ ప్రజలకు ఉచిత సలహాలి చ్చారు. ప్రజలు పొదుపు చేయాలన్నారు. వాటికి ‘ఆర్థిక దేశభక్తి’ అని ‘భక్తి’ పేరు పెట్టారు. ప్రజల మీద భారాలు మోపటానికి మానసికంగా సిద్ధం చేయటం కోసమేనని వామపక్షాలు ఆ రోజు చెప్పాయి. అదే రుజువైంది. పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలు ఇప్పటికే నాలుగుసార్లు పెంచారు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రా యిల్ దాడి విషయంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల భారాలు ప్రజల మీద రుద్దుతున్నారు. అమెరికాలో అంబానీ, అదానీ పెట్టుబడులకోసం దేశ ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టారు. ప్రజలు విదేశీ మారక ద్రవ్యం పొదుపుకోసం పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్టు వాడాలనీ, దేశీయ ఉత్పత్తులే కొనుగోలు చేయాలనీ, బంగారం కొనవద్దని ప్రధాని సూచించారు. కట్టెలు, బొగ్గు వాడకం నుంచి ప్రజలు గ్యాసు వాడకం వైపు మరలారు. ఇప్పుడు గ్యాసు సరఫరా మీద పాలకులు ఆంక్షలు విధించారు. ఒక్కసారిగా మార్కెట్‌‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్టౌలన్నీ అమ్ముడైపోయాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కోసం అదనపు ఏర్పాట్లేమీ చేయకుండానే సొంత వాహనాలు బయటకు తీయొద్దన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా మార్కెట్ ఆర్థికవ్యవస్థ పేరుతో, దిగుమతి చేసుకున్న సరుకుల కొనుగోలుకు ప్రజలను అలవాటు చేసింది పాలకులే! ఉన్నట్టుండి దేశీయ వస్తువులే వాడాలంటున్నారు. పాలకుల ఆదేశాల ప్రకారం ప్రజల అలవాట్లు మారిపోతాయా? అంతేకాదు…ఇక్కడ ఉపాధి చూపలేక, విదేశీ ఉద్యోగాల వైపు యువతను ప్రోత్సహించారు.

ఇప్పుడు పిల్లలు ఒక దేశంలో, తల్లిదండ్రులు మరో దేశంలో ఉంటూ, విదేశీ పర్యటనలు చేయొద్దంటే వచ్చేది సామాజిక సమస్య కదా! ఖర్చులను ప్రోత్సహించారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అలవాటు చేసి వినిమయదారీ మనస్తత్వం రంగరించి పోసారు. ఉన్నట్టుండి పొదుపు సుభాషితాలు వల్లిస్తున్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. షేర్ మార్కెట్ ఊగిసలాడుతున్నది. బంగారం రూపంలో పొదుపు చేద్దామనుకునే మధ్యతరగతికి, ఆ తలుపులు కూడా మోడీ ‌మూసివేశారు. దేశప్రజలు శుభకార్యాలకు బహుమానంగా పెట్టేదీ బంగారమే! ధనికుల విషయం పక్కనబెడితే, చాలామందికి, అవసరానికి అప్పులు చేసేందుకు ఈ బంగారం ఉపయోగపడుతున్నది. దేశంలో ప్రజలు బంగారం కుదువబెట్టి తెచ్చిన అప్పులు రూ.పదిహేడు లక్షల కోట్లు. ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయాలన్నారు. తాత్కాలి కంగా ఉద్యోగులకు ఇది సౌకర్యం అనిపించవచ్చు. కానీ, కరోనా అనుభవాలున్నాయి. అనేక మానసిక, సామాజిక సమస్యలు తలెత్తిన విషయం విస్మరించలేము. ఇవన్నీ ఒక భాగం.

వంట నూనెలు కూడా పొదుపు చేయటమంటే ఏమిటి? తిండి తగ్గించాలా? ఎరువులు వాడకం తగ్గిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి సమస్యకు పరిష్కారం చూపాలి కదా! రైతులు రోడ్డున పడటం తప్ప మరొకటి కాదు. వీటికి తోడు బీజేపీ నడుపుతున్న యూనియన్ ప్రభుత్వం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ, డీలిమిటేషన్, ఒకే దేశం-ఒకే ప్రజ-ఒకే ఎన్నిక, స్వతంత్ర సంస్థలైన ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్లను గుప్పిట పెట్టుకోవటం తదితర చర్యలతో నియంతృత్వ విధానాల పట్టుబిగిస్తున్నది. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నది. న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు తమ కనుసన్నలలో నడవాలని ప్రయత్నిస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెసు ప్రభుత్వంగానీ, గతంలో రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్ గానీ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం చేయవల్సిన ప్రయత్నాలను మాత్రం పక్కనబెట్టింది. తన పర్యటన సందర్భంగా “ మాతో సహకరించండి’’ అని బహిరంగ సభావేదిక మీదనే ప్రధాని గాలం విసిరారు. దానికి తగిన సమాధానం ఇవ్వకుండా “అందులో రాజకీయాలేమీ లేవు’’ అని ముఖ్యమంత్రీ దాటవేశారు. ఆర్థిక విధానాల విషయంలో తమ జాతీయ నాయ కత్వంతో సహా రాష్ట్రంలో కాంగ్రెసు పాలకులు బీజేపీ విధానాలను సమర్థిస్తున్నారు.

విద్యుత్తు రంగంలో ప్రయివేటీకరణకు మోడీ ప్రభుత్వం ప్రతిపాదనలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంగీకరించింది. రైతు డిస్కం ఏర్పాటు, స్మార్ట్ మీటర్లు బిగించటం ఇందులో భాగమే. సింగరేణి బొగ్గు బ్లాకులు వేలం వేసే ప్రక్రియలో బొగ్గు శాఖామంత్రి కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. లేబర్ కోడ్స్ పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెసు, బీఆర్‌ఎస్ లు సమర్థించాయి. ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. మోడీ ప్రభుత్వం నిర్ణయించిన నూతన విద్యావిధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకున్నది. స్కిల్ ‌యూనివర్సిటీ, ఆకునూరి మురళి కమిషన్ సిఫారసులలోని అనేక అంశాలు పేద ప్రజలను విద్యకు దూరం చేస్తాయి. మోడీ ప్రభుత్వం చేసిన ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టాన్నీ వీరు సమర్దించారు. ఇప్పుడు ఆర్టీసీ ముసుగులో, విద్యుత్తు బస్సులు, అద్దె బస్సుల పేరుతో, ప్రయివేటు బస్సులు పెంచుతున్నారు. సహకార శాఖను అక్కడ అమిత్ షా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఎన్నికలు లేకుండా పాలక మండళ్లను రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్లు చేస్తున్నది. ఇట్లా చెప్పుకుం టూపోతే అనేకం. రేవంత్ నాయకత్వం నుంచి మోడీజీ అదనంగా ఆశిస్తున్న సహకారం ఏమిటన్నదే తేలవల్సిన సమస్య.

కేరళం ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజయన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు విజయన్ ఇంటి మీద ఈడీ దాడులను ఖండించలేదు. ఈ రెండున్నరేండ్లలో సుమారు పదికి పైగా సందర్భాలలో బీజేపీ, ఆరెస్సెస్‌లు భావోద్వేగాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని శాంతి భద్రతల సమస్యలుగానే పరిగణించింది. రాజకీయంగా ఎండగట్టేందుకు ప్రయత్నించ లేదు. ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ నాయకత్వం ఎత్తులన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. రాష్ట్రాన్ని తొమ్మిదిన్నరేండ్లు పాలించిన కేసీఆర్ సర్కారు కూడా మోడీ ప్రభుత్వంతో లాలూచీ, కుస్తీ నడిపింది. ఆర్థిక విధానాలను సమర్ధించింది. అంతిమంగా అంబానీలు, అదానీలు, బడా బాబుల ప్రయోజనాలను దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తున్నాయి. సహజంగానే ప్రజా ప్రయోజనాలు కాపాడవ ల్సిందెవరన్న ప్రశ్న ముందుకొస్తుంది. ప్రజలు పోరాటాలలోకి వస్తారా లేదా అని సందేహాలు వ్యక్తం చేసే వారు కూడా లేకపోలేదు. గత ఆరు మాసాలలో కార్మికవర్గం, యువత స్పందిస్తున్న తీరే వీటికి సమాధానం.

రాష్ట్రంలో షాహీ ఎక్స్‌పోర్టు, హెచ్‌బిఎల్ కార్మికులు యూనియన్ లేకపోయినా పోరుబాట పట్టారు. ఉత్తర భారతంలో యాభై వేల కాంట్రాక్టు, వలస కార్మికులు పోరాడారు. ఈ పరిస్థితులు గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు నామమాత్రంగా పెంచింది. మన రాష్ట్రంలో ఇరవై వేల మంది విద్యుత్తురంగంలోని ఆర్టిజాన్లు, 38 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెచేశారు. మరోవైపు సమ్మె విరమణ తర్వాత విద్యుత్తు శాఖ అధికారులు మళ్లీ బెదిరిస్తున్నారు.సంఘటిత కార్మికోద్యమం, వామపక్ష రాజకీయాలతో మాత్రమే ఉద్యమాన్ని సరైన బాటలో నడపగలం. ఫలితం సాధించగలం. ఆధునిక యువత స్పందన ఇందుకు తార్కాణం. కాక్రోచ్ జనతాపార్టీ పేరుతో వ్యంగ్యాస్త్రాలు సంధించిన యువత ఎలుగెత్తి చాటిన విషయాలు గమనార్హం. ప్రధాన న్యాయమూర్తులు రిటైరైన తర్వాత రాజ్యసభలో అవకాశం ఇవ్వవద్దన్నారు. ఎలాంటి పదవులు కట్టబెట్టొద్దన్నారు. పౌరుల ఓటు హక్కు హరించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఉపా చట్టం కింద విచారణ చేయాలన్నారు. మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలనీ, పార్టీ ఫిరాయించిన వారికి ఇరవై ఏండ్లు పోటీ చేసే అర్హత లేకుండా చేయాలనీ చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఆలోచిస్తున్న యువత మనోభావాలను ఇవి వ్యక్తం చేస్తున్నాయి. ఈ యువతే కదా భవిష్యత్తు. రానున్నది పోరాటాల కాలం. ఆ పోరాటాలు ఎర్రజెండా నాయకత్వంలో జరగటం ఈనాటి అవసరం.

ఎస్.వీరయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -