రాష్ట్ర ప్రభుత్వం 2026 మే 21న కనీస వేతనాలు సవరించి, ప్రకటించింది. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్స్‌లో మూడు జోన్లు, నాలుగు కేటగిరీలుగా విభజించింది. గత పదేండ్లల భారీగా పెరిగిన ధరలను, సగటు కార్మిక కుటుంబాల ఖర్చును పరిగణలోకి తీసుకోకుండా కోటి పది లక్షల మందికి వేతనాలు పెంచాల ్సింది పోయి తగ్గించడం అన్యాయం. డా॥ ఆక్ట్రాయిడ్ ఫార్ములా, 1992 నాటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, 2021 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సిఫారసులను, దాని ప్రాతిపదికన జారీచేసిన ఐదు జీఓలను, నిర్ణయించిన కరువుభత్యాన్ని పరిగణ లోకి తీసుకోలేదు. పారిశ్రామిక వేత్తలను సంతృప్తిపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కడుపుకొట్టింది. కార్మిక సంఘాల డిమాండ్ కనీస వేతనం రూ.26 వేల గురించి పట్టించుకోలేదు. 2026 మే 30న తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలను సవరిస్తూ జీఓ ఎంఎస్ నెం.6ను నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రెండు రోజుల్లోనే అధికారికంగా గెజిట్‌ను ప్రకటించింది. ఈ పెరిగిన వేతనాలను 2026 జూన్ ఒకటి నుంచి రాష్ట్రమంతా అమల్లోకి వస్తున్నట్లు జీఓలో పేర్కొంది.
గతంలో రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్స్ ఉండేవి. ఒక్కొక్క షెడ్యూల్డ్ లో ఒక్కొక్క రకంగా వేతనాలు, విడిఎ ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రకటించింది. విడిఎను 1982 సిరీస్ కాకుండా 2001-100 సిరీస్ ప్రకారం 443 పాయింట్స్ దగ్గర న్యూటలైజేషన్ చేసి పెరిగే ప్రతి పాయిం ట్‌కు రూ.33.86పై.లుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వేతనాలు గతంలో ఉన్న షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో ఉన్న పద్ధతికి పూర్తి భిన్నమైన పద్ధతి. ప్రస్తుతం మూడు జోన్స్‌లో కార్మికులను నాలుగు కేటగిరీలుగా విభజించి అందరికీ ఒకే విడిఎ ఇవ్వడం వల్ల స్కిల్డ్, హైస్కిల్డ్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కొన్ని షెడ్యూల్డ్స్‌లో కొంత న్యాయం జరిగినప్పటికీ అత్యధిక కార్మికులు నష్టపోతు న్నారు. కనీస వేతనాల జీవోల సవరణ అంటే వేతనాలు పెంచడమే కాదు, తగ్గించడం కూడా అని పెట్టుబడిదారులు, పాలకవర్గాలు కొత్త భాష్యం చెబుతున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలు పెంచలేదు. గతంలో ఉన్న వేతనాల కంటే తగ్గిస్తూనే పెంచామని చెప్పడం అర్ధరహితం. వేతనాల పెంపులో ప్రభుత్వం శాస్త్రీయ తను పాటించలేదు. ముఖ్య మంత్రి ప్రకటన 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఉంది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ కాలంలో కార్మికులకు నిజ వేతనాలు లేకున్నా కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించి కరువుభత్యం (విడిఎ) పాయింట్‌కు రూ.12.50 పై.లకు తగ్గకుండా చూడాలి. ఈ పరిస్థితుల్లో ఫైనల్ నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడుదల మే 21న ప్రకటించిన వేతనాలపై జీఓలు విడుదల కాని స్థితిలో పై సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. గతంలో కనీస వేతనాల సలహా మండలి బోర్డు అన్‌స్కిల్డ్ కార్మికుడికి కనీస వేతనం రూ.18,019, హైస్కిల్డ్ రూ.39,830, కరువుభత్యం (విడిఎ) ఒక్కొక్క పాయింట్‌కి రూ.12 సిఫార్సులు చేసింది. దీని ఆధారంగా 2021 జూన్ నెలలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదు జీవో (21, 22, 23, 24, 25)లను జారీ చేసింది. ఈ జీఓలను గెజిట్ చేసి అమలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆ జీఓలకు నేటి వరకు గెజిట్ విడుదల చేయలేదు. ఈ జీవోలను ప్రాతిపదికగా తీసుకొని నేడు కనీస వేతనాలను సవరిస్తే వేతనాలు మరింత పెరిగేవి. అలా చేయకపోవడం వల్ల ప్రస్తుతం కొన్ని రంగాలకు మాత్రమే వేతనాలు నామ మాత్రంగా పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. దీంతో అత్యధిక రంగాల్లో వేతనాలు తగ్గాయి.
ముఖ్యమంత్రి ప్రకటించిన పెరిగిన వేతనాలు కూడా నాలుగు కేటగిరీలలో అన్‌స్కిల్డ్ వర్కర్‌కు రూ.14వేలు, సెమీస్కిల్డ్ వర్కర్‌కు రూ.15వేలు, స్కిల్డ్ వర్కర్‌కు రూ.16,500, హైస్కిల్డ్ వర్కర్‌కు రూ.18వేలు పెంచినట్లుగా ప్రకటించారు. ఇందులో అన్‌స్కిల్డ్ వర్కర్‌కు తప్ప మిగతావారికి బేసిక్ కరువుభత్యం కలుపుకొని ప్రస్తుతం పొందుతున్న జీతానికి పెరిగిన జీతానికి పెద్ద తేడా ఏమీలేదు. మూడు జోన్స్‌గా వేతనాలు ప్రకటించడం వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వేతనాలు ఇంకా తగ్గి ఈ కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతింటాయి. ప్రస్తుతం అమలులో ఉన్న కాంట్రాక్ట్ లేబర్ జీవో నెం:11 ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో రూ.13,098ల నుంచి రూ.23,683ల వరకు వేతనం పొందుతున్నారు. జీఓ నెం.11లోని పాత వేతనాలతో పోల్చితే ఇప్ప్పుడు ప్రభుత్వం పెద్దగా పెంచింది ఏమీలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న జీవో నెం:4తో పోలిస్తే కూడా కొన్ని కేటగిరీలలో వేతనం స్వల్పంగా పెరుగుదల ఉన్నప్పటికీ అనేక కేటగిరీలో పొందుతున్న వేతనం కంటే తగ్గుతుంది. ఉదా: జీవో నెం:4లో స్కిల్డ్ వర్కర్‌కి రూ.19,572 వేతనంగా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన వేతనం రూ.18,500 మాత్రమే. గతంలో పోలిస్తే రూ.1,072 తగ్గింది. ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో భాగమైన సఫాయి కర్మచారులకు వర్తించే జీఓలో జోన్-1లో పాత వేతనం రూ.17,332, కొత్త వేతనం రూ.16వేలు, ఈ జోన్‌లోని కార్మికులకు రూ.1,332తగ్గింది. జోన్-2లో పాత వేతనం రూ.17,072, కొత్త వేతనం రూ.15వేల వేతనం.
ఈ జోన్‌లోని కార్మికులకు రూ.2,072 తగ్గింది. జోన్-3 పాత వేతనం రూ.16వేలు, కొత్త వేతనం రూ.14వేలు, ఈ జోన్‌లోని కార్మికులకు రూ.రెండు వేలు వేతనం తగ్గింది. 1948 కనీస వేతనాల చట్టం, పెరిగిన ధరలు, డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా శాస్త్రీయంగా వేతనాలను లెక్కిస్తే కనీస వేతనం రూ.32వేలు ఉండాలి. కర్నాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కార్మికులకు అరవై శాతం వేతనాలను పెంచింది. మన రాష్ట్రంలో కొన్ని రంగాల్లో ఉన్న కార్మికులకు మాత్రమే వేతనాలు పెరిగాయి. ఈ పెంపుదలలో కార్మికుల వేతనాలు తగ్గిపోయాయి. కార్మికులు, కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను సవరించి కనీసం రూ.26వేల వేతనం నిర్ణయిం చాలి. కరువుభత్యం ఒక్కొక్క పాయింట్‌కి రూ.12ఉండాలి. మూడు (3) జోన్‌ల విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల సవరణను పున:పరిశీలించాలి.
విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల ప్రయోజ నాలు, సులభతర వ్యాపారం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చి కార్మికవర్గానికి తీవ్ర ద్రోహం చేసింది. మన రాష్ట్రంలో లేబర్ కోడ్స్‌కి ఇంకా రూల్స్ రూపొదించకుండానే వాటిని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లలో కేటగిరీల వారీగా వేతనాలు పెంచడం కుదరదని, నైపుణ్యం, భౌగోళిక ప్రాంతాల ఆధారంగా మాత్రమే వేతనాలు నిర్ణయించబడతాయని, కనీస వేతనాల చట్టం-1948 పూర్తిగా రద్దయిందని తెలంగాణ కార్మిక శాఖ ప్రకటించడం మరీ అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేబర్ కోడ్‌ల అమలు విషయంలో బీజేపీ బాటలోనే పయనిస్తుంది. ఈ పూర్వ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది.
పాలడుగు భాస్కర్, 9490098033



