వానాకాలం-2026 సీజన్ ఈనెల ఎనిమిదో తేదీ మృగశిర కార్తెతో ప్రారంభ మవుతుంది. దుక్కులు దున్నే వేళ. అడపాదడపా చినుకులు రాలినా వానాకాలాన్ని తలపించలేదు. వానలకోసం ఆకాశానికేసి చూస్తున్న సందర్భం. సర్కారు గత మార్చి 31 నాటికే వ్యవసాయ ప్రణాళికను ప్రకటించి ఉండాలి. పాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండో టర్మ్ చివర నుంచి వ్యవసాయ ప్రణాళికను నిర్లక్ష్యం చేసింది. ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్లుగా దాని జోలికే పోలేదు. ప్రణాళిక అంటే భూములు, వాటి పరిస్థితులు, సాగు, విత్తనాలు, ఎరువులు, రుణాలు, రైతులకు అవగాహనా కార్యక్రమాలతో కూడిన దీర్ఘకాలిక కార్యక్రమం. అదే ఈ సీజన్‌కు వ్యవసాయ దిక్చూచి. వాతావరణానికి అనుగుణంగా రైతులను సమా యత్తం చేయాల్సిన బాధ్యత వ్యవ సాయ శాఖది. దాన్ని పర్యవేక్షిం చాల్సింది సర్కారుది. దాన్ని ఏలే పెద్దలది. అయితే అరకొర రైతు భరోసాతో చేతులు దులిపేసింది ప్రభుత్వం.
గత యాసంగి సీజన్‌లో రైతుభరోసా అందరి ఖాతాల్లో పడనేలేదు. వానాకాలంలో సాధారణంతోపాటు వాణిజ్య పంటలను సాగుచేస్తుంటారు. ప్రణాళికలో వానాకాలం సాగు అంచనాలు ఉండాలి. అలాగే రైతుకు కావాల్సిన ప్రొత్సాహాకాలు, ఇతర అంశాలూ పొందుపరిచి ప్రచారంలో పెట్టాలి. అవసరమైతే క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యం చేయాలి. నిజానికి యాసంగిలో పండిన పంటలనే ఇంకా కొనలేదు. కళ్లాల వద్దే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మక్కిపోతుండటం గమనార్హం. దీంతో రైతుల ఆరుగాలం కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతున్నది. ఒకవైపు కొనుగోళ్లులేక , మరోవైపు గోనె సంచులు అందుబాటులో ఉండక రైతుల అరిగోస అంతాఇంతా కాదు.
ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఏదైనా పథకం ప్రారంభమైనా, లేక మరేదైనా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేక్రమంలో బాలారిష్టాలు సహజమే. కాగా రైతుల విషయంలో అవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుండటం ఆశ్చర్య కరం, ఆందోళనకరం కూడా. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణల పుణ్యమా అని విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టే కుట్రకు తెరతీశారు. రైతు డిస్కం పేరుతో బాధ్యతల నుంచి సర్కారు వెనక్కితగ్గే ప్రయత్నం చేస్తున్నది. విద్యుత్ కనెక్షన్లకు మీటర్లతో ఉచిత కరెంటు పథకానికి ఎగనామం పెట్టే అవకాశం తీసుకుంటున్నదని సర్కారుపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు గుర్రుమం టున్నాయి. ఇప్పటికే సాగుభారంతో సతమతమవుతున్న రైతులకు ఇది అమలైతే వారి పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టే.వానాకాలానికి ఎరువులు, విత్తనాలు, రుణాలు సరిపడినంతగా రైతులకు అందుబాటులోకి తేవాలి. దాదాపు 1.40 కోట్ల ఎకరాల భూమి సాగయ్యేపక్షంలో 20 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలి. బ్యాంకు డిపాజిట్లల్లో 18 శాతం మేర రైతులకు పంట రుణాలుగా ఇవ్వాలనేది నిబంధన. అసలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఇటు బ్యాంకర్లు గానీ, అటు సర్కారు గాని పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు.
అయితే ఆ దిశగా ఇటు వ్యవసాయ శాఖ గానీ, అటు సర్కారు గానీ ముందడుగేయలేదు. అసలే ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్‌తో వర్షాల రాక ఆలస్యమవుతున్న క్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సలహాలు, సూచనల రూపంలో రైతులకు చెబుతున్నది శూన్యమే. వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే అవగాహనా కార్యక్రమాలే లేనేలేవు. కాగా సాగు వ్యయం ప్రతియేటా భారీగా పెరుగుతున్నది. అది ఎకరానికి రూ. 30 వేల నుంచి 40 వేలు అయింది. సర్కారిచ్చే రుణాలు సరిపోక మళ్లీ ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరనే మూడేసి రూపాయల మిత్తితో రైతులు బీళ్లల్లోకి అడుగెడుతున్నారు. వడ్డీతో కలిపి ఎకరానికి ఖర్చు కాస్త రూ.50 వేలకు చేరుతోంది. మార్కెట్లో అమ్మే వ్యాపారస్తులే ఎరువులు, విత్తనాలు ఎలా వాడాలో రైతులకు చెబుతుండటం విచారకరం. వ్యవసాయ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలు తరచుగా లేకపోవడంతో ‘ఎక్కడి గొంగలి అక్కడే’ అన్నట్టు రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇదే అదనుగా నకిలీ విత్తనాలతో మార్కెట్లను నింపేందుకు దళారులు సిద్ధంగా ఉంటారు. వారి పీచమణచాలి, అలాంటి వారిని గుర్తించి కఠిన చట్టాలు ప్రయోగించాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా వానాకాలం సాగుకు రైతులను సన్నద్ధం చేయాలనే రైతుసంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలి. లేదంటే పాలకులు నిత్యం చెప్పే వ్యవసాయం పండగ కాదు, దండగే అవుతుంది.



