Wednesday, June 3, 2026
E-PAPER
Homeఖమ్మంఆదివాసీల అస్తిత్వ పోరుకేక

ఆదివాసీల అస్తిత్వ పోరుకేక

- Advertisement -

పోలీస్ బందోబస్తు మధ్య సభ విజయవంతం
లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
నవతెలంగాణ – కొత్తగూడ: –
మండల కేంద్రంలో ఆదర్శ క్రీడా పాఠశాల శ్రీ గుంజేడు ముసలమ్మ ప్రాంగణంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ బహిరంగ సభ అత్యంత విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీ ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది.

సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ
బహిరంగ సభకు ముందుగా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగరావు అధ్యక్షతన జాతీయ, రాష్ట్ర స్థాయి ఆదివాసీ నాయకులు మండల కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు విగ్రహానికి, కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ నుండి ఆదివాసీ సాంప్రదాయ డోలు నృత్యాలు, వాయిద్యాలతో సభా ప్రాంగణం వరకు భారీ ప్రదర్శనగా తరలివెళ్లారు. ‘జై ఆదివాసీ’ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. అనంతరం వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.ఈ సభలో ఆదివాసీ తొమ్మిది తెగల జేఏసీ నాయకులు చుంచ రామకృష్ణ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆదివాసీలకు ఎస్టీ వర్గీకరణ ఎందుకు అవసరమో సుదీర్ఘంగా వివరించారు. లంబాడీ సామాజిక వర్గం వల్ల స్థానిక ఆదివాసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస వచ్చిన లంబాడీలను తక్షణమే ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, అప్పుడే నిజమైన ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని వారు డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ సభ రక్షణ చర్యల్లో జిల్లా ఎస్పీతో పాటు 6 గురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 39 మంది ఎస్ఐలు, 35 మంది ఏఎస్ఐలు, 560 మంది కానిస్టేబుళ్లు మరియు ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొని శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

ఈ భారీ బహిరంగ సభలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ నాయకులు దాట్ల నాగేశ్వరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దబోయిన లక్ష్మినారాయణ, ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కుర్సం రామారావు, ఆదివాసి ఉద్యోగ నాయకులు చుంచ సారయ్య, వట్టం సాయిలు జాతీయ నాయకులు కల్తీ వీరమళ్ళు, తురుసం సీతారాములుతో పాటు వివిధ ఆదివాసీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కొత్తగూడ మండల అధ్యక్షులు పూనెం సందీప్ తదితర స్థానిక ఆదివాసీ నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -