Monday, August 3, 2026
E-PAPER
Homeఖమ్మంనెలాఖరు లోనే పామాయిల్ గెలలు అధిక సేకరణ

నెలాఖరు లోనే పామాయిల్ గెలలు అధిక సేకరణ

- Advertisement -

– ధరలపై రైతుల ఆందోళనతో చివరి వారంలో భారీగా కోత
– పరిశ్రమపై అదనపు భారం
– నూనె దిగుబడి పై ప్రభావం
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ పరిశ్రమకు జూన్, జులై నెలల్లో రైతులు సరఫరా చేసిన పామాయిల్ తాజా గెలలు (ఎఫ్‌ఎఫ్‌బీ) గణాంకాలు ఆసక్తికర అంశాన్ని వెల్లడిస్తున్నాయి.  రెండు నెలల్లోనూ చివరి వారంలోనే అత్యధిక గెలలు పరిశ్రమకు చేరాయి. జూన్‌లో మొత్తం 11,224.165 టన్నుల గెలలు సేకరణ జరగగా, అందులో ఒక్క చివరి వారంలోనే 5,119.525 టన్నులు (45.61 శాతం) వచ్చాయి. అలాగే జులైలో మొత్తం 14,471.980 టన్నుల గెలల్లో 5,511.610 టన్నులు (38.08 శాతం) చివరి వారంలోనే సేకరించారు.

ఈ గణాంకాలు రైతుల్లో నెలవారీ ధరలపై నెలకొన్న అనిశ్చితిని ప్రతిబింబిస్తున్నాయని ఆయిల్ ఫెడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ రెండు నెలలే కాదు ప్రతీ నెలా మొదటి వారాలు కంటే చివరి వారంలోనే పరిశ్రమ కు అధిక మొత్తంలో గెలలు పరిశ్రమ కు చేరుతుంటాయి.

ధరల విధానమే కారణమా..?
ఆయిల్ ఫెడ్ ప్రతి నెల ఒకటో తేదీన తాజా ఎఫ్‌ఎఫ్‌బీ కొనుగోలు ధరను ప్రకటిస్తుంది. అయితే ఆ ధర ఆ నెలలో కోసిన గెలలు కు వర్తించదు. గడిచిన నెలలో పరిశ్రమకు సరఫరా చేసిన గెలలు కు మాత్రమే కొత్త ధర ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.

ఉదాహరణకు, జూన్ నెలలో రైతులు సరఫరా చేసిన గెలలు కు జులై 1న టన్నుకు రూ.23,783 ధర ప్రకటించారు. కానీ జులైలో కోసిన గెలలు కు ఈ ధర వర్తించదు. వాటికి ఆగస్టు 1న ప్రకటించిన ధర మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల ఆగస్టులో ధర పెరిగితే జులైలో గెలలు కోసిన రైతులకు లాభం, తగ్గితే నష్టం చవిచూడాల్సి వస్తుంది.

దీంతో వచ్చే నెల ధర పెరిగే అవకాశముందన్న అంచనాతో రైతులు గెలల కోతను నెలాఖరు వరకు వాయిదా వేస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

ధరల నిర్ణయం అధికారుల చేతుల్లో ఉందా అంటే అదీ లేదు.ఎఫ్‌ఎఫ్‌బీ ధరలను ఆయిల్ ఫెడ్ అధికారులు స్వేచ్ఛగా నిర్ణయించలేరు. ఆ నెలలో పరిశ్రమ ఉత్పత్తి చేసిన క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ తదితర ఉప ఉత్పత్తుల విక్రయాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం, అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరల ధోరణి ఆధారంగానే రైతులకు చెల్లించే ధర నిర్ణయించబడుతుంది. అందువల్ల ప్రపంచ మార్కెట్‌లో జరిగే మార్పుల ప్రభావం నేరుగా రైతు ధరపై పడుతోంది.

చివరి వారంలో కోతతో ప్రతికూల ప్రభావాలు…

నెలాఖరులో ఒక్కసారిగా భారీగా గెలలు సేకరించడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశముంది.పూర్తిగా పరిపక్వం చెందని ఎచ్చిపచ్చి గెలలు కూడా కోసి పరిశ్రమకు తరలించే అవకాశం ఉంటుంది. దీంతో ఆయిల్ రికవరీ శాతం తగ్గే ప్రమాదం ఉంది.

అలాగే ఒక్కసారిగా వేల టన్నుల గెలలు పరిశ్రమకు చేరడంతో ప్రాసెసింగ్ సామర్థ్యంపై ఒత్తిడి పెరుగుతుంది. రవాణాలో జాప్యం, గెలల నాణ్యత క్షీణించడం, కార్మికులపై అదనపు పనిభారం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

పరిష్కారంపై దృష్టి అవసరం..

రైతులు ధరల భయంతో నెలాఖరులోనే గెలలు కోయాల్సిన పరిస్థితి ఏర్పడకుండా అవగాహన కల్పించడం, ధరల నిర్ణయ విధానంపై స్పష్టత ఇవ్వడం అవసరం. అదే సమయంలో గెలలు దశలవారీగా పరిశ్రమకు చేరేలా ప్రోత్సహిస్తే ఆయిల్ రికవరీ మెరుగుపడటంతో పాటు పరిశ్రమ పనితీరు కూడా సమర్థవంతంగా సాగుతుందని వ్యవసాయ, పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -