Tuesday, August 4, 2026
E-PAPER
Homeఖమ్మంకక్ష కట్టారు.. పొట్టమీద కొట్టారు

కక్ష కట్టారు.. పొట్టమీద కొట్టారు

- Advertisement -

– ​సత్తుపల్లిలో చిరు వ్యాపారుల బతుకులు రోడ్డున పడేశారు
– పట్టణంలో 4 కి.మీ. మేర రోడ్డుకు ఇరువైపులా వందలాది చిరు వ్యాపారులు ఉన్నా
– ట్రాఫిక్‌కు అంతరాయం లేని ఆ 7 బడ్డీ కొట్లు కొందరికి అడ్డు వచ్చాయా..?
– ​కోర్టులో కేసు వేసి చిరు వ్యాపారుల ఉసురు పోసుకున్నారు..!
నవతెలంగాణ – సత్తుపల్లి

సత్తుపల్లిలోని కరెంట్ ఆఫీస్ గోడను ఆనుకుని, మూడేళ్లు కాదు… దాదాపు 30 ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఆ పేదల బతుకులు నేడు ఛిద్రమయ్యాయి. పట్టణ పరిధిలోని 4 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వందలాది బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు ఉన్నప్పటికీ… కేవలం ఆ 7 బడ్డీ కొట్లపైనే కొందరు కక్ష పూనడం దారుణం. మానవతా దృక్పథంతో చూడాల్సిన పేదల పొట్టకూటి తిప్పలను తమ స్వార్థం కోసం రోడ్డు పాలు చేయడం పట్ల పట్టణ ప్రజలు నోచ్చుకుంటున్నారు.

​అరువు డబ్బులు అడిగినందుకేనా ఈ కక్ష?
సత్తుపల్లిలోని ఆర్టీసీ ఇన్ గేట్ ఎదురుగా, కరెంటు ఆఫీసు గోడను ఆనుకుని ఉన్న 7గురి చిరు వ్యాపారుల పొట్టను కొట్టిన ఉదంతమిది. ఏ రకంగా చూసినా కరెంట్ ఆఫీస్ గోడ పక్కన ఉన్న ఆ బడ్డీ కొట్ల వల్ల ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదనేది పచ్చి నిజం. రోడ్డు మార్జిన్‌కు అవతల, కరెంటు స్తంభం, మున్సిపల్ వాటర్ గేట్ వాల్ కు లోపల వైపు,  గోడను ఆనుకుని ఉంటూ… ఇంతవరకు ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం కాకుండా ఆ పేదలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ విషాదం వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. ఆ షాపుల దగ్గర కూరగాయలు, పండ్లు, కిళ్లీలు అప్పుగా తీసుకెళ్లిన కొందరు బడాబాబులు… తిరిగి డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అరువు పెట్టిన డబ్బులు అడగటం ఆ చిరు వ్యాపారులు చేసిన పాపమా..? డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాం, మాటిమాటికి అడుగుతారా? మీ సంగతి చూస్తాం… మీ షాపులు లేకుండా చేస్తాం” అంటూ బెదిరింపులకు కూడా దిగారట. తమ అహంకారాన్ని తీర్చుకోవడానికి ఆ బడా బాబులు కొందరిని ఊసి గొల్పారు. ఏళ్ల తరబడి కష్టపడి బతుకు బండిని ఈడ్చుకొస్తున్న ఆ పేదలపై ఏకంగా ఉన్నత న్యాయస్థానంలో కేసు వేయించి, షాపులు తొలగించేలా కుట్ర పన్నారు.

​బాధితుల ఆవేదన – అధికారుల పరిశీలన ఏదీ?
సత్తుపల్లిలోని అధికారులు ఒక్కసారి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే, ఆ బడ్డీల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేవనేది స్పష్టంగా అవగతమవుతుంది. కేవలం అప్పు తిరిగి అడిగిన పాపానికి… ఆ పేద కుటుంబాల నోటికాడి కూడును లాగేసి కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయం? 30 ఏళ్లుగా ఆప్యాయంగా పలకరిస్తూ వ్యాపారం చేసుకున్న ఆ బడ్డీ కొట్లు నేడు ఖాళీగా మారి, వారి కన్నీళ్లకు సాక్ష్యంగా నిలిచాయి. పిల్లల చదువులు, ఇంట్లో ముసలివారి వైద్య ఖర్చులు, కుటుంబాన్ని గడిపే ఆధారం ఒక్కసారిగా కోల్పోవడంతో ఆ బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కక్షపూరిత రాజకీయాలు, కొందరి స్వార్థపు ఆలోచనల వల్ల ఈరోజు ఆ చిరు వ్యాపారుల ఇళ్లలో పొయ్యి వెలగని పరిస్థితి ఏర్పడింది. రోడ్డు పక్కన కష్టపడి బతికే పేదల ఉసురు పోసుకుంటే ఆ దేవుడైనా క్షమించడు అని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​రాచరికపు ధోరణి…
విశేషమేమిటంటే, ఆ చిరు వ్యాపారుల బడ్డీ కొట్లకు సమీపంలో ఉన్న ఓ పెద్దాయన, ఆయన కుమారుడు కారు కానీ, ద్విచక్ర వాహనం కానీ వస్తున్న క్రమంలో ఆ వాహనాలకు ఎవరూ అడ్డు రాకూడదనే ఉద్దేశంతో రాచరికాన్ని వలకబోస్తున్నట్లు సమాచారం.

​మానవతా దృక్పథంతో న్యాయం చేయాలి
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆ పేద వ్యాపారుల పరిస్థితిని మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, నిజంగానే ఆ చిరు వ్యాపారుల బడ్డీ కొట్లు ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానానికి తెలియజేయాలని ఆ చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు. న్యాయం వైపు నిలబడి, అన్యాయంగా బతుకులు కోల్పోయిన ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి తమ జీవన మనుగడకు ఆసరా ఇవ్వాలని వారు కోటి దండాలతో ప్రాధేయపడుతున్నారు. పేదల కన్నీళ్లు తుడిచి, వారికి మళ్లీ నిలదొక్కుకునే ఆశను అందించడమే నిజమైన ప్రజాపాలన అని అధికారులు గుర్తించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -