Thursday, June 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపారిశ్రామిక అభివృద్ధికి మరో మైలురాయి

పారిశ్రామిక అభివృద్ధికి మరో మైలురాయి

- Advertisement -


తెలంగాణ బయోఫార్మా రంగంలో మరో కీలకమలుపు
పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల ఉత్సాహం
మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ


నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి, హత్నూర

నూతనంగా ఏర్పాటు చేసిన తెరానిమ్ బయోలాజికల్ యూనిట్ ప్రారంభించడం తెలంగాణలోని పారిశ్రామిక అభివృద్దికి మరో మైలు రాయి అని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరపట్ల శివారులో ఏర్పాటు చేసిన తెరానిమ్ బయోలాజికల్ యూనిట్‌ను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెరానిమ్ బయోలాజికల్ యూనిట్ ప్రారంభంతో తెలంగాణ బయోఫార్మా రంగంలో మరో కీలక ముందడుగు పడిందని, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఇది నూతన ఊతాన్ని అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. బయోటెక్నాలజీ, ఔషధ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలో అగ్రగామిగా నిలిచిందని, ఔషధ రంగంలో ఆధునిక సాంకేతికతతో కూడిన తెరానిమ్ బయోలాజికల్ వంటి సంస్థల రాకతో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని తెలిపారు.

ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. అత్యాధునిక బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషించనున్నదని చెప్పారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఇలాంటి సంస్థలు బలాన్ని చేకూరుస్తాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా ఔషధ, బయోటెక్నాలజీ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, పరిశ్రమల విస్తరణతోపాటు స్థానిక ప్రజల జీవనోపాధికి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు. పరిశ్రమలు అభివృద్ధి చెందడంతోపాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని సంస్థలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ కలెక్టర్ పాండు, సంస్థ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -