సర్ పేరుతో ఓట్ల తొలగింపుకు కుట్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
కేంద్రం విధానాలకు
అనుగుణంగానే రైతు డిస్కం
సబ్సిడీలు ఎత్తేసే యత్నం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్
సూర్యాపేటలో రాజకీయ శిక్షణాతరగతులు
నవతెలంగాణ-సూర్యాపేట
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు కాపాడుకోవాలని, దానిపై బీజేపీ దాడి చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక ధ్రువీకరణ) పేరుతో మైనారిటీలు, దళితులు, ఆదివాసీల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిం చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న సీపీఐ(ఎం) జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతు ల్లో బుధవారం ఆమె మాట్లాడారు. ధ్రువీక రణ పత్రాలలేమి కారణంగా పేద ప్రజలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిం చుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజాస్వామ్య విధానానికి బదులుగా.. ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేసే పరిస్థితికి దేశాన్ని నెట్టేస్తోందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ధరలు పెంచబోమని చెప్పి.. ఎన్నికల తర్వాత రోజు విడిచి రోజు ధరలు పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్ మాట్లాడుతూ.. రైతుల పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ రంగాన్ని ప్రయివేటీ కరించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కంను తీసుకొచ్చిందని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. రైతు డిస్కం ద్వారా రైతులు, పేద ప్రజలకు విద్యుత్ సబ్సిడీలను ఎత్తేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్ల సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ శిక్షణా తరగతుల ప్రారంభ సూచికంగా సీపీఐ(ఎం) పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ఈ తరగతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపెళ్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.



