ఆయిల్ పామ్, ఉద్యాన పంటలే రైతుల భవిష్యత్‌కు భరోసా
పంట అవశేషాలకు నిప్పు పెడితే కేసులు
ప్రత్యామ్నాయ పంటల సాగు, నానో యూరియాపై అవగాహన
ఖరీఫ్ సాగు ప్రణాళికపై.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కాబట్టి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్ పామ్, ఉద్యాన పంటలే రైతుల భవిష్యత్‌కు భరోసా అని తెలిపారు. పంట అవశేషాలకు నిప్పు పెడితే కేసులు పెడతామని హెచ్చరిం చారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయా నంద్‌తో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. దేశీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలఫై దృష్టి సారించాలన్నారు. తదనుగుణంగా ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. జలాశయాల్లో డెడ్ స్టోరేజ్ నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందు బాటులో ఉంచామని, పచ్చి రొట్ట విత్తనాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసర మైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్టు తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటల కొనుగోళ్లపై దృష్టి
ప్రపంచ మార్కెట్ స్థితిగతులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి తెలిపారు. దేశం ఇప్పటికీ వంటనూనెలు, పప్పుధాన్యాలు, కూరగాయల కోసం విదేశాలపై ఆధారపడుతోందని, ఈ పరిస్థితిని మార్చేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల కొనుగోళ్లను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, మార్కెటింగ్ పరంగా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరగడానికి డీజిల్ కొరత, బంగ్లాదేశ్ పరిస్థితుల కారణంగా గన్నీ బ్యాగుల సరఫరాలో అంతరాయం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత, లోడింగ్-అన్ లోడింగ్ సమస్యలు కారణాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గిడ్డంగుల సామర్థ్యాలను పెంచకపోవడం, పాత నిల్వల సమస్యలు కూడా ప్రభావం చూపాయని అన్నారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు కొనసాగుతున్నా యని, కల్లూరు ఫ్యాక్టరీ ఈ ఏడాదిలోనే ప్రారంభమ వుతుందని చెప్పారు. రైతులు పురుగుమందుల వినియో గాన్ని తగ్గించి సహజ వ్యవసాయపద్ధతులు, నానో యూరి యా వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు.
వరి కొయ్యలు తగలబెడితే చర్యలు
అవగాహన కల్పించినా ఇప్పటికీ కొంతమంది వరి కొయ్యలు, పంట అవశేషాలను కాల్చుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పక్కనే ఉన్న పంటలు, తోటలకు నష్టం వాటిల్లడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా సంభవిస్తుందన్నారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫఓ అనూజ్ అగర్వాల్, సుడా చైర్మెన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మహమ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ హన్మంత రావు తదితరులు పాల్గొన్నారు.



