Saturday, June 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌తో వాణిజ్య 
ఒప్పందం ఖాయం : ట్రంప్‌

భారత్‌తో వాణిజ్య 
ఒప్పందం ఖాయం : ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ తనకు మంచి మిత్రుడనీ, ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. భారత్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయనీ, త్వరలోనే ఇరు దేశాలూ ఒక కీలక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌… ”మీ ప్రధాని నాకు చాలా ఇష్టం. ఆయన నా మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి” అని అన్నారు. భారత్‌తో అమెరికా వాణిజ్య సంబంధాల పైనా ఆయన స్పందించారు. గతంలో భారత్‌.. అమెరికాపై అధిక సుంకాలు విధించేదనీ, అమెరికాకు నష్టం జరిగేదని ఆరోపించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందనీ, అమెరికా.. భారత్‌తో వ్యాపారంలో లాభపడుతోందని చెప్పారు. ”ఏండ్ల తరబడి భారత్‌ అమెరికాను వాణిజ్యపరంగా ఉపయోగించుకుంది. మాపై భారీ సుంకాలు విధించింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భారత్‌తో వ్యాపారంలో అమెరికా మంచి ఆదాయం పొందుతోంది” అని ట్రంప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఒప్పందంపై ఆశాభావం
భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. ”మేము తప్పకుండా ఒక ఒప్పందానికి వస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్‌, మోడీ మధ్య జరిగిన టెలిఫోన్‌ సంభాషణ అనంతరం ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశకు సంబంధించిన రూపురేఖలను ప్రకటించాయి. ప్రతిపాదిత అవగాహన ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించినట్టు సమాచారం.

న్యూఢిల్లీలో నాలుగు రోజుల కీలక చర్చలు
ఈనెల 1 నుంచి 4 వరకు న్యూఢిల్లీలో భారత్‌-అమెరికా ప్రతినిధుల మధ్య నాలుగు రోజుల పాటు విస్తృత స్థాయి వాణిజ్య చర్చలు జరిగాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం (యూఎస్‌టీఆర్‌) చీఫ్‌ నెగోషియేటర్‌లోని బృందం.. భారత అధికారులతో పలు అంశాలపై చర్చించింది. వీటిలో వస్తువుల వాణిజ్యం, కస్టమ్స్‌ విధానాలు, వాణిజ్య సులభతరం, టారిఫ్‌రహిత అడ్డంకులు, ఆర్థిక భద్రత సహకారం వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇరు పక్షాలు ఈ చర్చలను ఫలప్రదంగా అభివర్ణించాయి.

చివరి దశలో ఒప్పందం
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ ప్రకారం.. చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఒప్పందంలో స్వల్ప అంశాలు మాత్రమే ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని ఆయన తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ కూడా ఎక్కువ శాతం అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందనీ, తుది వివరాలపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

కొత్త సుంకాల ముప్పు
అయితే ఈ ఒప్పంద ప్రక్రియలో మరో సవాలు ఎదురవుతోంది. అమెరికా ప్రభుత్వం భారత్‌ సహా 60 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 12.5 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 301 కింద చేపట్టిన సమీక్షలో బలవంతపు కార్మిక వ్యవస్థతో సంబంధం ఉన్న దిగుమతులపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రతిపాదన ప్రకారం… తగిన నియంత్రణలు అమలు చేసిన దేశాలపై పది శాతం సుంకం, అలాంటి చర్యలు తీసుకోని దేశాలపై 12.5 శాతం వరకు సుంకం విధించే అవకాశం ఉంది.

ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రిటన్‌, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఒకవైపు మోడీని మంచి మిత్రుడని పలు సందర్భాల్లో ట్రంప్‌ పొగిడినప్పటికీ.. మరోవైపు భారత ఉత్పత్తులపై కొనసాగుతున్న సుంకాల హెచ్చరికలను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మోడీ-ట్రంప్‌ స్నేహంపై ప్రచారం ఎంతగా సాగినప్పటికీ.. భారత ఎగుమతులపై సుంకాల భయం ఇంకా తొలగిపోలేదని వారు అంటున్నారు.అంతర్జాతీయ సంబంధాల్లో చివరికి దేశ ప్రయోజనాలే నిర్ణయాత్మకమని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయని వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -