నవతెలంగాణ – హైదరాబాద్: ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని తప్పకుండా తుది జట్టులోకి తీసుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు. అవసరమైతే రెగ్యులర్ ఓపెనర్లను పక్కనపెట్టి అయినా అతనికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలవడమే కాకుండా, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు కొట్టి వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకూ ఎంపికయ్యాడు. 15 ఏళ్ల 71 రోజుల వయసులో భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
“అధికారం నా చేతిలో ఉంటే, ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీని కచ్చితంగా ఆడిస్తాను. ఆ టీ20 మ్యాచ్‌లలో అతను ఆడటం నేను చూడాలనుకుంటున్నాను. తుది జట్టులో అతను ఉండాలి. అవసరమైతే, సంజూ శాంసన్‌ను ఒక మ్యాచ్‌లో, అభిషేక్ శర్మను మరో మ్యాచ్‌లో పక్కనపెట్టి అయినా సరే” అని గవాస్కర్ అన్నాడు.



