Sunday, June 7, 2026
E-PAPER
Homeసోపతిఎడిట్‌ పేజీ రాత్రులు

ఎడిట్‌ పేజీ రాత్రులు

- Advertisement -

రాత్రి పన్నెండు దాటిన తర్వాత న్యూస్‌రూమ్‌కు ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం వస్తుంది. పగలంతా అరుస్తున్న ఫోన్లు మౌనమవుతాయి. కీబోర్డ్‌ శబ్దాలు కూడా నెమ్మదిస్తాయి. మిగిలేది కేవలం వెలుతురు తగ్గిన కంప్యూటర్‌ స్క్రీన్లు.. చల్లారిపోయిన కాఫీ కప్పులు.. డెడ్‌లైన్‌లతో అలసిపోయిన మనుషుల శ్వాస. ఆ రోజుల్లో నా జీవితం రెండు ప్రపంచాల మధ్య సాగేది. పగలు ఉద్యమ సమావేశాలు, ప్రయాణాలు, సభలు… రాత్రి పత్రిక ఆఫీసు, ఎడిట్‌ పేజీలు, డెడ్‌లైన్లు. మొదట్లో రెండింటికీ సమానంగా సమయం దొరికేది. కానీ క్రమంగా పత్రికే నా రోజులను, రాత్రులను పూర్తిగా ఆక్రమించుకుంది. ప్రజల మధ్య గడిపే సమయం తగ్గిపోయింది. వారి కథల మధ్య గడిపే సమయం పెరిగిపోయింది. నాకు ఆ రాత్రులు ఎప్పటినుంచో ఇష్టం.

ఫస్ట్‌ ఎడిషన్‌ పని పూర్తయ్యాక ప్రతి పేజీని స్క్రోల్‌ చేస్తూ చూడటం.. ప్రతి హెడ్‌లైన్‌ తన స్థానంలో కూర్చున్నదో లేదో చూసుకోవడం.. వాక్యాల్లో మిగిలిపోయిన చిన్న చిన్న తప్పుల్ని వెతకడం.. అది ప్రతి రాత్రి ఒక ఆలోచనను పత్రికలో శాశ్వతం చేసే ప్రక్రియ. ఆమెకు ఆ ప్రపంచం మొదట్లో పెద్దగా అర్థం కాలేదు. ఒకసారి అర్ధరాత్రి ఫోన్‌ చేసి అడిగింది..
”ఇంకా ఆఫీసులోనే ఉన్నావా?”
”ఇంత రాత్రివరకూ ఏం చేస్తుంటారు మీరంతా?”

నేను నవ్వాను.
”రేపు ఉదయం ప్రజలు ఐదు నిమిషాల్లో చదివేసే పేజీ కోసం… మేం ఐదు గంటలు వాదిస్తుంటాం.”
ఆమె బిగ్గరగా నవ్వింది.
”పిచ్చివాళ్లు మీరు.”
”కొంచెం.”
ఆ తర్వాత నుంచి ఆమెకు నా రాత్రులు అలవాటయ్యాయి. మొదట్లో నా పని మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ క్రమంగా మారింది. దాదాపు ప్రతి రాత్రి పన్నెండు దాటాక ఆమె నుంచి ఒక మెసేజ్‌ వచ్చేది.
Still awake, కామ్రేడ్‌?”
నేను ఎంత అలసిపోయి ఉన్నా.. ఆ ఒక్క మెసేజ్‌ చూస్తే లోపల ఎక్కడో చిన్న వెలుగు వెలిగేది. ఆ రాత్రి కూడా అలానే. బయట భారీ వర్షం పడుతోంది. న్యూస్‌రూమ్‌లో సగం లైట్లు ఆఫ్‌ అయ్యాయి. డెస్క్‌ మీద చెల్లాచెదురుగా పేపర్లు. స్క్రీన్‌ మీద ఇంకా పూర్తి కాని ఆర్టికల్‌. మిగతావాళ్లు దాదాపు వెళ్లిపోయారు. నేను నా క్యాబిన్లో కూర్చుని ఒక వాక్యాన్ని మూడోసారి మార్చుతున్నాను. అప్పుడే ఫోన్‌ వైబ్రేట్‌ అయింది.

”కిందికి రా.”
”ఎక్కడీ”
”నీ ఆఫీస్‌ కిందే.”
నేను నిజంగానే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్లాను. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఆఫీస్‌ బిల్డింగ్‌ బయట వీధిదీపం కింద ఆమె నిలబడి ఉంది. బ్లాక్‌ దుపట్టా తడిసి భుజాలకు అతుక్కుంది. చేతిలో రెండు కాఫీ కప్పులు. వర్షంలో తడిసిన ఆ వీధిదీపం కింద, ఆ రాత్రి నా కోసం రాసుకున్న కవితలోని పంక్తిలా కనిపించింది.

”నువ్వు పిచ్చిదానివా?” అన్నాను.
”అవును. లేదంటే ఈ టైంలో జర్నలిస్టుల కోసం కాఫీలు మోసుకుంటూ తిరుగుతానా?” అంది.
”ఇంత వర్షంలో ఎందుకు వచ్చావు?”
ఆమె ప్రశాంతంగా కాఫీ కప్పు నా చేతిలో పెడుతూ..
”నువ్వు అలసిపోయి ఉంటావనిపించింది.” అంది.
ఆ మాట వినగానే, ఆ రోజు మొత్తం ఎవరికీ కనిపించని నా అలసటను ఆమె ఒక్కతే గుర్తించినట్టనిపించింది. కొన్ని ప్రేమలు పెద్ద మాటల్లో రావు. ఇలాగే.. అర్ధరాత్రి వర్షంలో ఒకరు మన కోసం కాఫీ తీసుకుని రావడంలో దాగి ఉంటాయి. మేం ఆఫీస్‌ ముందు షెడ్‌ కింద నిలబడ్డాం. వర్షం రోడ్డుమీద తెల్లటి గీతల్లా కురుస్తోంది. దూరంగా నగరం మొత్తం తడిసిపోయిన వెలుతురులా కనిపిస్తోంది.
ఆమె నన్ను చూస్తూ అడిగింది..
రాత్రులు ఇలా ఎందుకు మేల్కొని ఉంటావు?”
నేను నవ్వాను.
”ఎందుకంటే కొన్ని మాటలు రేపటి పేపర్‌లో ఉండాలి.”

”అంత ముఖ్యమా?”
”అవును.”
”ఎందుకు?”
”ఒక సరైన వాక్యం కూడా పోరాటమే.”
ఆమె కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత మెల్లగా అంది..
”నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి భయమేస్తుంది.”
”ఎందుకు?”
”నీకు మనుషుల మీద చాలా ప్రేమ ఉంది రామ్‌… అలాంటి వాళ్లు తమను తాము మర్చిపోతారేమో అనిపిస్తుంది.”
ఆ మాట తర్వాత కొద్దిసేపు వర్ష శబ్దమే వినిపించింది. నేను ఆమె తడిసిన జుట్టు చెవిపక్కకు జరిపాను.

”మరి నువ్వు?”
”నేనేం చేస్తున్నా..?”
”ఇంత రాత్రి.. ఇంత వర్షంలో.. నా కోసం వచ్చావు.”
ఆమె చిన్నగా నవ్వింది.
”నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు రామ్మ్‌.. కానీ, ఒక్కోసారి నీ గురించి నువ్వు మర్చిపోతావేమో అనిపిస్తుంది.”
ఆ ఒక్క వాక్యం.. ఇప్పటికీ నా గుండెలో అలాగే ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆమె నా భుజంపై తల వాల్చి అడిగింది…
”రామ్‌…”

”ఒకరోజు నీ గురించి ఎడిట్‌ రాయాల్సి వస్తే.. ఏమి రాస్తావు?”
నేను నవ్వేశాను.
”చాలా కష్టమైన మనిషి అని.”
ఆమె కూడా నవ్వింది.
”లేదు.. చాలా ప్రేమించగలిగిన మనిషి అని రాయాలి” అంది మెల్లగా.
ఆ రాత్రి.. న్యూస్‌రూమ్‌ వెలుతుర్లకంటే, వర్షం కంటే, నగరం కంటే.. ఆ ఒక్క వాక్యమే నాకు ఎక్కువసేపు వెలుగునిచ్చింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతోంది. ఎన్నో రాత్రులు గడిచిపోయాయి. ఎన్నో ఎడిషన్లు వెళ్లిపోయాయి. కానీ ఆ రాత్రి మాత్రం మిగిలిపోయింది. మన జీవితాల్లో కొన్ని రాత్రులు జరిగిన సంఘటనల వల్ల కాదు… మన కోసం ఒకరు నిలిచిన క్షణాల వల్ల మిగిలిపోతాయి. ఎందుకంటే ఆ రోజు ఆమె నాకు కాఫీ మాత్రమే తీసుకురాలేదు. నేను ఒంటరిగా మోస్తున్నాననుకున్న జీవితంలో తన వంతు తోడుగా నిలిచింది. ఇప్పుడు ఆ కాఫీ రుచి గుర్తులేదు. కానీ కప్పు నా చేతిలో పెడుతూ.. ”నువ్వు అలసిపోయి ఉంటావనిపించింది..” అని చెప్పిన ఆమె స్వరం మాత్రం ఇంకా నా రాత్రుల్లో అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.
– రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -