అధికారాంతంబునందు చూడవలె నయ్యం గారి సౌభాగ్యముల్.. అని పాతకాలపు పద్యం. దీన్నే మామూలుగా అధికారంతమునందు చూడవలె నా యమ్మ సౌభాగ్యముల అంటుంటారు. పశ్చిమబెంగాల్‌లో ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్, మూడుసార్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిస్థితి చూస్తే అదే గుర్తుకు వస్తుంది. నిజానికి ఇందిరాగాంధీ వంటివారు కూడా 1977లో ఎమర్జన్సీ పెట్టి ఓడిపోయాక స్వంతపార్టీవారే దూరం పెట్టారు. ఆమె నియమించిన ముఖ్యమంత్రి జలగం వెంగళరావే గెస్ట్‌హౌస్ కూడా ఇయ్యకుండా చేశారని ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటుం టారు. అంతదాకా ఎందుకు రిటైరైన అధికారులు, ఓడిపోయిన ప్రజాప్రతినిధులు చాలామంది బాధ చెప్పడానికి లేనిదే. ఆ కథలన్ని వేరేగానీ ఉక్కు వనిత, అగ్గి బరాటా వంటి బిరుదులతో అరాచక రాణిగా వెలుగొందిన మమతా దీదీ కూడానా? అంటే పాలకపార్టీలే అంత మరి, వారు వారిని ఆడించే, నడిపించే కార్పొరేట్ శక్తులకూ స్వార్థ రాజకీయ నేతలకు అధికారమే కొలబద్ద. ఓడిపోయిన దీదీ పార్టీకి ఎనభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వచ్చారు గాని ఇందులో రెండొంతులు ఇప్పటికే చెక్కేశారు.ఆమె అల్లుడు అభిషేక్ భెనర్జీతో సహా నిర్ణయించి నియమించిన ప్రతిపక్ష నాయకుడు శోభన్ దేవ్‌ను పక్కన పెట్టి రితివ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటిం చుకున్నారు. ఆయన్ను మేము తొలగించామని దీదీ పరివారం గింజుకున్నా ససేమిరా పట్టించుకోలేదు. ఏమంటే ఇప్పుడు ముఖ్య మంత్రిగా వచ్చిన సువేందు అధికారి కూడా ఒకప్పుడు ఆమె అనుచరుడే మరి! తల్లిపుట్టిల్లు మేనమామకు తెలుసని దీదీ రాజకీయ రహస్యాలన్నీ సువేందుకు కరతలా మలకం. ఇకపోతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైన రితివ్రతుడు కూడా ఒకప్పుడు సీపీఐ(ఎం) నుంచి బహిష్కరణకు గురైనవాడేనన్నది మరో విశేషం. సీపీఐ(ఎం) నాయకత్వం,నాటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఎంతో ప్రోత్సహించి రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తే పద్ధతులు పాటించలేక పార్టీ వేటుకు గురయ్యాడు. రాజ్యసభ పదవీకాలం ముగియగానే తృణమూల్‌లో దూకాడు.
బెంగాల్‌లో కుట్రల చరిత్ర
వాస్తవానికి మమతా బెనర్జీ స్వయంగా 1998లో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి స్వంత పార్టీ పెట్టుకున్నారనేది చెప్పనవసరం లేని విషయం. ఆ తర్వాత బీజేపీతో కలిసి వామపక్ష ప్రభుత్వంపై విషం కక్కుతూ విద్వేషంతో సంఘ వ్యతిరేక ముఠాలను కూడగట్టి తమ స్వంత సేనను ఏర్పాటు చేసుకున్నారు. సీపీఐ(ఎం)ను దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో తొలి దశ, మలిదశలో కాంగ్రెస్, బీజేపీ ఆమెతో దోస్తీచేశారు. కుటల్రూ కుహకాలతో కూలదోశారు. 34 ఏళ్ల వామపక్ష పాలనను ఓడించినందుకు కీర్తనలాలాపించారు. ఇప్పుడు ఆమెను ఓడించి సువేందు వచ్చాక మళ్లీ తొలిసారి బీజేపీ విజేత అని ఆకాశానికెత్తుతున్నారు. వామపక్ష పాలనతో పోలిస్తే వీరంతా కలిసినా సగం కాలం కూడా పూర్తి కాలేదు. మమతకు బడా పార్టీలూ, కమ్యూనిస్టు వ్యతిరేకులు, మావోయిస్టులు సహా ఎవరు ఎలా సహకరిం చారనేది అలా వుంచితే ఆమె పదిహేనేళ్లకే దిగిపోక తప్పలేదు. రాష్ట్ర సారథ్యం అటుంచి స్వంత పార్టీపైన కూడా పట్టు కోల్పోయిన దుస్థితి. మూడుసార్లు ఓడిపోయిన సీపీఐ(ఎం) ఓటమికి కారణాలేమిటనేది ఒకటైతే ఇప్పటికీ ఆ పార్టీ నిర్మాణ బలంతో యువతతో కలిసి పోరాడుతున్నదే గాని దిగాలు పడింది లేదే? కేరళలోనూ గెలిచిన కాంగ్రెస్ సీఎంను ఎంచుకోవడానికి పదిహేను రోజులు కావలసి వస్తే సీపీఐ(ఎం), ఎల్‌డిఎఫ్‌లు నేరుగా ప్రజల్లోకి వెళ్లి పనిచేసుకు పోతున్నాయి. స్వంత ఎజెండాలతో నడిచే స్వార్థపూరిత పాలక పార్టీలకూ ప్రజల కోసం నిలిచే ఆశయనిబద్దమైన పార్టీలకూ తేడా అదే! ఇప్పుడు బెంగాల్‌లో జరుగుతున్నది గతంలో చాలాచోట్ల చూసిందే, మహారాష్ట్రలో బాల్‌థాకరే అనంతరం ఉద్ధవ్, రాజ్‌థాకరేలు చీలిపోయారు. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే ఆ పార్టీ నుంచి చీలిపోయి మొదట ముఖ్యమంత్రిగా వెలిగినా ఇప్పుడు ఉపముఖ్యమంత్రితో సరిపెట్టుకుంటున్నారు. చిన్నదిగా మారిన ఎన్‌సిపిలోనూ శరద్‌పవార్ తర్వాత అజిత్ పవార్, సుప్రియా సూలేల మధ్య రెండు చీలికలు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ వుండగానే అఖిలేశ్ యాదవ్, శివలాల్ యాదవ్‌ల మధ్యన తగాదాలు ఓటమి పాలుచేశాయి. బీహార్‌లోనూ తేజస్వియాదవ్‌కూ ఆయన సోదురుడైన తేజ్‌ప్రతాప్ యాదవ్‌కూ మధ్య తగాదాకు ఆర్జేడి మూల్యం చెల్లించింది.అస్సాంలో కూడా నాటి కాంగ్రెస్ నాయకుడైన హిమంత బిశ్వశర్మను కాదని ముఖ్యమంత్రి తరుణ్‌గోగోయ్ తన కుమారుడు గౌరవ్‌ను పైకి తేవాలనుకోవడమే ఆ పార్టీ దెబ్బతినడానికి ఒక కారణ మంటారు. దక్షిణాన తమిళనాడులోనూ రెండు డిఎంకెలపై ఈ విధమైన వారసత్వ తగాదాల ప్రభావం చూశాం. ఉమ్మడి ఏపీలోనూ విడిపోయాక తెలంగాణ, ఏపీల లోనూ కూడా కుటుంబాల కలహాలు పార్టీలను ఎలా దెబ్బతీశాయో చూశాం. ఆ పరస్పర కలహాలలో ప్రజలకు కలిగే నష్టం ఏమిటన్నది మరింత పెద్ద ప్రశ్న.
అన్నిచోట్ల అదే తంతు
బెంగాల్‌లో పరిస్థితి వాటికంటే భిన్నంగా కనిపించవచ్చు గాని మౌలికంగా ఒకటే. మమత తన మేనల్లుడు అభిషేక్‌కే పట్టం కట్టాలనుకోవడం ఇతరులను మింగుడు పడలేదు. అంతకంతకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతుంటే ఆమె ఆయనపై ఇంకా ఎక్కువగా ఆధారపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక దశలో ఆమెకు కుడిభుజంగా మెలిగిన సువేందు దూరమైనారు. మొన్న ఓటమి దెబ్బతిన్నాక కూడా దీదీ అభిషేక్ చెప్పినట్టే నడుస్తున్నారనేది ఆ పార్టీలో చీలికకు దారితీసింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైన రితివ్రత కూడా బీజేపీ తరపునే ఆమె వెనక పనిచేశారన్నది తాజాగా పరిశీలకులు చెబుతున్నమాట. దీదీని సలహా దారుగా మాత్రమే వారు పేర్కొనడం విధేయులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఆమె గతంలోలాగే ఏవో వీధిపోరాటాలతో ఊగిపోయినా, అప్పుడు పైకి లేపిన కార్పొరేట్లు బడా మీడియా ఇప్పుడు అందుకు సిద్ధంగా వుండవు కదా! ఈ విధంగా ఒకటిన్నర దశాబ్దం పాటు వామపక్ష వ్యతిరేకతకు కేంద్రబిందువుగా నిరంకు శత్వం వెలగబెట్టిన దీదీ కూలిపోయారు. ఆమె నీడలో పెరిగిన సువేందు కూడా చిరకాలం వుంటారని చెప్పడం నిరాధారమే. ఇక ఆ పార్టీని చీల్చి ప్రతిపక్ష హోదా పొందిన రితివ్రతను విధేయ ప్రతిపక్ష నాయకుడిగా అభివర్ణిస్తున్నారు. ఒక విధంగా ఇదంతా బీజేపీ మాయాజాలమే. పూర్వాపరాలు, ప్రతిబంధకాలు, కుట్రలూ గమనించకుండా వామపక్షాల లోపం వల్లనే అంతా జరిగిపోయిందని శాపనార్థాలు పెట్టేవారు ఈ పరిణామక్రమాన్ని గమనించవలసి వుంటుంది. ఇప్పుడు తాము వచ్చాకనే కమ్యూనిస్టులు కార్యాలయాలు తెరచుకుంటున్నారని గొప్పలు పోతున్న బీజేపీ, ఒకప్పుడు తామే ఈ దీదీకి సోపానాలు వేశామని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఎదురీత ఈదుతున్నారే గాని బీజేపీ వచ్చిందని సంతోషించే ప్రసక్తి వుండదు. సర్ వంటి విషయాల్లో రాజీ పడే అవకాశమూ వుండదు. కాకపోతే ఆశయనిబద్దతతో, ప్రజాస్వామ్య లౌకిక విలువలతో నిలబడే పార్టీలకూ అవకాశవాదంతో అధికారమే పరమావధిగా పాకులాడే వారికి తేడా మాత్రం చూడవలసి వుంటుంది.
ఒక విధంగా ఇది బీజేపీకి కూడా వర్తిస్తుంది. మోడీ మూడుసార్లు గెలిచారు గనక ఇక తిరుగులేదని బడా మీడియా భజనలు అర్థరహితం. ఆఖరుకు 1952 -1964 మధ్యకాలం తీసుకుని తొలి ప్రధాని నెహ్రూ కన్నా ఆయనే ఎక్కువ కాలం పాలించారని ఒక లెక్క చెప్పి సంతోషిస్తున్నారు. 1947 ముందున్న అయిదేళ్లు కాకి ఎత్తుకుపోతుందా? నెహ్రూ మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పాలన సాగలేదా? గతంలో ఒకసారి ముఖ్యమంత్రిగా మోడీ పదవీకాలం కూడా కలిపి ఒక లెక్కవేసి దేశంలోనే అత్యధిక కాలం పాలించిన నేత అని పొగిడారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన జీడీపీ లెక్కలు ఇస్టానుసారం మార్చినట్టే ఇదీ చేస్తున్నారన్నమాట. కానీ దాంతోనే వాస్తవాలు మారిపోతాయా?1947కు ముందు స్వాతంత్ర్య పోరాటంతో బీజేపీ-ఆరెస్సెస్‌కు సంబంధమే లేదు గనక 1962నే తీసుకుం దామంటే కుదురుతుందా? నిజానికి మరో ఏడాదిలో మోడీని పదవి నుంచి దించేస్తారని నెహ్రూ మునిమనవడైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ జోస్యాలు చెబుతున్నారు. తనకు వివిధ అధికార వ్యవస్థలనుంచి సమాచారం అందిందని ఆయన చెబుతుంటే లోలోపల కుట్రలు చేస్తున్నారని బీజేపీ ప్రతినిధి అమిత మాలవీయ ఆరోపిస్తున్నారు.
వీళ్లకు తెలియడం లేదా?
‘విశ్వగురు’ కావడంలో ఇండియా ఎందుకు వెనకబడిందో స్వయంగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన కూడా ప్రస్తుత పరిస్థితి పట్ల పెదవి విరుస్తున్నట్టు అర్థమవుతుంది. తమిళనాడులో అన్నామలై వంటి తీవ్ర మతవాద నేత కూడా బీజేపీ గెలిచే అవకాశంలేదని బయటకు రావడం యాదచ్ఛికం కాదు. కేరళంలో కూడా వారి ఆశలు వమ్మయిపోయాయి కాబట్టే గతంలో కావాలని తీసుకున్న మంత్రి కురియన్‌ను రాజ్యసభకు పంపించకుండా ఉద్వాసన చెబుతున్నారు. ఈ పరిస్థితులలో ఏపీ, తెలంగాణలలో నాయకులు మాత్రం బీజేపీతో స్నేహమే గొప్ప వరప్రసాదమని పరవశించిపోవడం హాస్యాస్పదం. ఈ మధ్య హైదరాబాదు నుంచి అమరావతి వరకూ చేసిన భాషణలన్నిటిలో అమిత్ షాను విమర్శించడమేంటని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ ఆగ్రహహోద్రోగులవడం చూశాం. అమిత్ షా స్వయంగా పిలిచి చెప్పినా అన్నామలై ఒప్పుకోలేదే మరి? అన్నామలై వంటి వారు బయటకు పోయినా బీజేపీ ఏం కాదని పవన్ అన్న మరుసటి రోజునే అమిత్ షా పిలిచి మాట్లాడారే? రాజ్యసభ స్థానం కూడా ఇస్తామన్నారే? నిజానికి మోడీ హైదరాబాద్‌లో పవన్‌ను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కలుసుకున్న రోజునే కొత్త రాజకీయానికి అంకురార్పణ, కథారచన జరిగిందనే అభిప్రాయం బలంగా వుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆ మరుసటి రోజునే మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజులలో పొత్తుపై అధిష్టానం నిర్ణయిస్తుందని సంకేతాలు వదిలారు. పవన్ కల్యాణ్ బీజేపీ, బీఆర్‌ఎస్ లను ఏమీ అనకుండా వదిలేశారని ‘హిందూ’ వార్తా కథనం. పవన్ 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినంత బలంగా జీఎహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి చెప్పకపోవడం గమనించదగింది. బీఆర్‌ఎస్ సంగతి అటుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ నాయకులతో టచ్‌లో వుండవచ్చునని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ, టీడీపీలలో ఎవరు వారికి తాత్కాలిక,శాశ్వత మిత్రులనే వ్యాఖ్యలు, వివాదాలు మరోవైపున నడుస్తున్నాయి. బీజేపీకి తన హిందూత్వ రాజకీయాలు కార్పొరేట్ ప్రయోజన కేంద్రీకత ఆధిపత్యం తప్ప ఎవరిపైనా ఆసక్తి వుండదు. అందుకోసం రాజ్యంగ బద్దమైన లౌకిక ప్రజాస్వామ్యాన్ని సమాఖ్య తత్వాన్ని దెబ్బ తీసేందుకు కూడా వారు సిద్ధమవుతారు. కులమత ప్రాంతీయ తత్వాలన్నిటినీ ప్రయోగిస్తారు. వేర్వేరు పార్టీలు లౌకిక విలువలకు కట్టుబడకుండా బీజేపీతో కలిసి ఊరేగడం వల్ల చివరకు వారికే చేటు అని బెంగాల్ నుంచి తెలుగు రాష్ట్రాల వరకూ తాజా అనుభవాలు చెబుతున్న సత్యం.
తెలకపల్లి రవి
దీదీ నుంచి దక్షిణాదిదాకా అదేపాఠం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



