డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రచనల్లో ఒక చోట ఇలా ఉంది- ఒకసారి మహారాష్ట్రలో కింది కులానికి చెందిన ఒక పెండ్లి భోజనంలో పాయసం వండుకున్నారు. అది తెలిసి, ఆ ఊరి అగ్రకులాల వారంతా ‘‘మీ మొహాలకు సీట్లు కావల్సి వచ్చాయా’’- అంటూ కర్రలతో, కత్తులతో దాడి చేసి, చివరకు ఆ పెండ్లి కొడుకుని చంపేశారు. వాళ్లు శ్రమించి, వాళ్ల చమట కష్టంతో వాళ్లు సంపాదించుకుని తినే తిండి మీద కూడా వాళ్లకు హక్కు లేదు. ఇదీ సనాతన ధర్మం – మనువాద సంస్కృతి’’ అని అంబేద్కర్ ఈ సంఘటన గురించి రాశారు. మూర్ఖత్యానికి పరాకాష్టనే వీళ్లు ప్రచారం చేస్తున్న సనాతన ధర్మమా? అని మనలాంటి వారికి అనుమానం వస్తుంది కదా? అంబేద్కర్ నాటి కాలాన్ని దాటేసి, ఇంకా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ కాలంలోకి మనం వచ్చేశాం. మరి మార్పు రావాలి కదా? సనాతన ధర్మ ప్రభోదాల్ని, మనువాద నిచ్చెనమెట్ల సిద్ధాంతాన్నీ పక్కన పెట్టి, జన్యుశాస్త్రం చెపుతున్న దాని ప్రకారం – ‘మనుషులంతా ఒక్కటి’ అని అందరూ ప్రవర్తిస్తూ ఉండాలి కదా? మరేమైందీ ? అగ్రవర్ణం అని అనుకునే వారి ఆగడాల కన్నా ఇప్పుడు శూద్రకులాల్లో ఆర్థిక ఆధిపత్యం సాధించిన వారి ఆగడాలు ఎక్కువయ్యాయి కదా? దీనికితోడు ప్రజలు ఎక్కడ చైతన్యవంతులవుతారోనని ప్రస్తుతం అధికారంలో ఉన్న మన ప్రభుత్వ పెద్దలు కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జనాన్ని విడగొడుతున్నారు. సయ్యద్ మహమ్మద్ అలీ అని హైదరాబాదులో ఒక యువ టి.వి జర్నలిస్ట్ ఉన్నాడు. అతని అనుభవాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి- ముస్లిం అవడం వల్ల చిననాటి నుంచీ అతనికి ఎదురౌతున్న అవమానాలు, చీత్కారాలు, తిరస్కారాలు ఎన్నో లెక్కలేదు. అవి అతనిలో ఎప్పటికప్పుడు విపరీతమైన మానసిక క్షోభను కలిగిస్తూ ఉండేవి. లోలోపలే ఆతణ్ణి దహించి వేస్తూ ఉండేవి. భరించలేని బలహీన క్షణాల్లో ఒకటి రెండుసార్లు అతన్ని అత్మహత్యకు ఉసిగొల్పాయి కూడా! అయితే, జీవితం విచిత్రమైంది. ఏ సమాజమైతే తిరసరిస్తుందో, మళ్లీ అదే సమాజం మరో చోట అక్కున చేర్చుకుంటుంది. ఈ మహమ్మద్ అలీ జీవితంలో కూడా అదే జరిగింది. తిరస్కరించిన సమాజమే జాలిని, కరుణనూ పంచింది. కుప్పగూలిన అతణ్ణి లేపి, నిలబెట్టింది! నిజానికి ఏ కొద్దిమందో చేసే దుర్మార్గాల వల్ల మొత్తం సమాజమే చెడ్డ పేరు మోస్తుంది.అతను చిన్నప్పుడు తోటిపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు కాపుల పిల్లలు కొందరు అతణ్ణి అవమానించే వారు. తురక తుత్తురు- అంటూ బూతులు తిట్టేవారు. మొండిగాడు అని హేళన చేసేవారు. వారి మాటలు ఆ పిల్లవాడి మనసును తీవ్రంగా గాయపరిచేవి. లోకం సరిగా తెలియని పసితనం వాడిది. అందుకేనేమో ఆడుకోవడానికి వెళ్లాలంటేనే భయపడి పోయేవాడు. తర్వాత, ఆ కుర్రవాడు ప్రభుత్వ హాస్టల్లో చేరినప్పుడు అక్కడి వార్డెన్ లింగా గౌడ్ ‘ఉల్లి గడ్డంత తుర్కోడు ఊరికి కీడు’ అని కోపంగా ఆ అబ్బాయి ఎటు వెళితే అటు చూస్తుండేవాడు.
ఆ అబ్బాయి భయంతో ముడుచుకుపోయేవాడు. అయినా, వార్డెన్ పదేపదే ఆమాటే అటుండేవాడు. తర్వాత ఆ అబ్బాయి ఆలోచించుకున్నాడు. అంత బాధ్యతాయుతమైన వ్యక్తి, పిల్లల్ని జాగ్రత్తగా మాసుకోవల్సినవాడు, హాస్టల్ పిల్లలందరినీ సమానంగా చూసుకోవల్సిన వాడు ఎందుకు అలా ద్వేషం చిమ్ముతున్నాడూ? ఆ పిల్లవాడికి మాత్రం అర్థం అయ్యేది కాదు. తను ముస్లిం కావడమే కారణమని ఆ పిల్లవాడు గ్రహించడానికి కొంత సమయం పట్టింది. వార్డెన్ అలా అంటున్నప్పుడల్లా ఆ కుర్రవాడికి దు:ఖం ఆగేది కాదు. భరించలేక ఒకసారి చచ్చిపోవడానికి ప్రయత్నించాడు. ప్రయత్నం విఫలమై బతికిపోయాడు. హాస్టల్‌కు తనకూ చెడ్డ పేరు తేవడానికే ఆ తురకవాడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని వార్డెన్ లింగాగౌడ్ కొత్త రాగం అందుకున్నాడు. కాలం కొంత గడిచింది. సయ్యద్ మహ్మద్ అలీ యువకుడయ్యాడు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజిలో చదవసాగాడు. ఒకసారి తెలుగు లెక్చరర్ రావు గారి దగ్గరికి వెళ్లి, నమస్కారం పెట్టి, వినయంగా పరిచయం చేసుకున్నాడు. ముస్లిం పేరు వినగానే ఆయన గారి ముఖం మారిపోయింది.‘‘ సార్! వ్యాసరచన పోటీకి నా పేరు ఇవ్వాలనుకుంటున్నాను” అని అన్నాడు అంతే! రావుగారు తనలోని దొరతనమంతా ముఖంలో ప్రదర్శించి ‘‘ఏం? వచ్చి మా మీద బాంబులు వేయాలనా?’’అంటూ మొహం తిప్పుకుని, మరోమాట లేకుండా కోపంగా వెళ్లిపోయారు. ఆ యువకుడు చెప్పిందేమిటి? లెక్చరర్ గారు మాట్లాడిందేమిటీ? మధ్యలో బాంబులెందుకు వచ్చాయీ? ఆయువకుడికి నోట మాట రాలేదు.
అప్పుడే కాదు, కాలేజి బయట, ఇతర సాహిత్య సమావేశాలలో కనిపించినా సరే, ‘‘నువ్వు జీవితంలో ఎదగవు’’ అని ఆయన దీవిస్తుండేవారు. ఎంత ఒదిగి, ఎంత వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తున్నా ఎందుకో కొందరు అంత దురుసుగా ఈసడించుకుంటున్నారు. ఉగ్రవాదినయినట్లు మాట్లాడుతున్నారు అని ఆ యువకుడు తల్లడిల్లిపొయేవాడు. డిగ్రీ తీసుకున్న తర్వాత చాలా రోజులకు ఒక పాత మిత్రుడు కనిపిస్తే పలకరిద్దామని ఎదురుగా వెళ్లాడు. అంతే- ఆతను చిత్తూరు ప్రాంతపు నాయుడు. ఒకప్పుడు ఎంతో స్నేహంగా ఉండేవాడు. ఇప్పుడు ఏమైందో ఏమో మరి-మొహం తప్పుకుని వెళ్లిపోయాడు. పోతే పోయాడు కానీ, పక్కనున్న ఓ వ్యక్తితో ‘తురక నా కొడుకులతో స్నేహం చెయొద్దు’- అని చెప్పుకుంటూ పోయాడు. ఆ మాట ఈ ముస్లిం యువకుడి చెవిలో పడింది. ‘‘ఛీ! బతుకు ఆత్మహత్య చేసుకుంటే పీడా వదులుతుంది’’ అని మరోసారి అనిపించింది అతనికి. మళ్లీ కొంత సేపటికి స్థిమితపడి, ధైర్యం పుంజుకున్నాక అనిపించింది – మనవాళ్లు అని అనుకున్న వాళ్లే మనల్ని ఇలా దూరం నెడితే ఎలా ఉంటుంది? ఆ బాధ చెప్పడానికి మాటలుండవు.అయితే ఆయువకుడి గుండె రోజు రోజుకూ గట్టి పడసాగింది. పత్రికా రంగంలో, సాహిత్య రంగంలో, సామాజిక రంగంలో అంతటా ఎవరో ఒకరు పేరుతో అతణ్ణి ముస్లింగా గుర్తించి, అతనొక ఉగ్రవాది వారసుడన్నట్లు ముద్రవేసి మాట్లాడుతుండే వారు.
ఎవరికని, ఎందరికని అతను సమాధానం చెప్పుకోగలడూ? అయినా, చేసిన తప్పేమీ లేకపోయినప్పుడు బాధపడాల్సిందేమీ లేదనుకున్నాడు. తనేమిటో తనకు తెలిసినప్పుడు, ఎవరికో భయపడాల్సిందేమీ లేదనుకున్నాడు. స్థిరంగా, దృఢంగా ఉండసాగాడు. కేరీర్ మీద దృష్టి పెట్టి పనిచేసుకోసాగాడు. అతనికి అతనై చొరవ తీసుకోవడం మానేశాడు. మాట్లాడిన వారితోనే మాట్లాడడం, అడిగిన వారికే జవాబు చెప్పడం చేస్తూ అతని చుట్టూ అతనే ఒక రక్షణ వలయం ఏర్పరుచుకుని ముందుకు సాగాడు. అందరిలాగా అతను ఈ దేశంలో పుట్టాడు. ఇక్కడి గాలి పీలుస్తున్నాడు. ‘‘తను ఈ దేశవాసి -అంతే’’ అనుకుని దృఢంగా నిలబడుతూ వచ్చాడు. అతని కథను అలా ఉండనిద్దాం .కర్నాటకలో ఒక లెక్చరర్ క్లాసురూంలో ఒక ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని సంభోదించి అందరిముందు అనవసరంగా అవమానపరిచాడు. ఆ వార్త చదివినప్పుడు మనుషుల్లో మార్పు రానంత కాలం, విద్యావంతుల్లో వివేచన పెరగనంత కాలం ఇలాంటి వారు ఇలా చిత్రహింసలకు గురి కావల్సిందేనా? అని అనిపించింది. పైగా రక్షణగా నిలవాల్సిన దేశ నేతలే విద్వేషం వెదజల్లుతూ ఉంటే, ఇక దేశం ఎలా ఉంటుందీ? ఈ దేశంలో చట్టాలు అందరికీ రక్షణ కల్పించలేక పోతున్నాయా? పౌరులందరూ సమానులే అయినప్పుడు చట్టాలు అందరికీ సమానంగా భద్రత కల్పించాలి కదా ? ఇంకా కొంచెం ఈ దేశ నేపథ్యంలోకి పోతే, ఇంతకన్నా ఘోరమైన విషయాలు బయటికొస్తాయి కదా ? ఈ దేశంలోని నిన్నువర్గాల్ని, వెనకబడిన జాతుల వారినీ మనువాదులు ఇలాగే అత్తంత దయనీయంగా, శతాబ్దాలుగా అణగదొక్కారు కదా?
అందుకే సమయం దొరికించుకుని ఈ దేశవాసులందరూ వాస్తవ చరిత్ర, ఆంత్రపాలజీ, సైన్సు తెలుసుకుంటూ ఉండాలి! నీతి, నిజాయితీ గల భారత పౌరులుగా ఉంటూ, సమాజానికి పనికొచ్చే ఏ చిన్న పనైనా చేస్తూ ఉండాలి! విద్వేషాలు రెచ్చగొట్టే పౌరులు కొందరు మన మధ్య ఉన్నది నిజమే అయినా, అసలు దేశాన్ని విద్వేషంతో నింపే శక్తులే అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నది గ్రహించాలి.ఇవేకాదు, అక్కడక్కడా మనకు ఈ దేశంలో కొన్ని మంచి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇవి సమైక్యతకూ, వివిధ మతస్తుల మధ్య ఉంటున్న ప్రేమ ఆప్యాయతలకూ, గౌరవ భావానికి గొప్ప ఉదాహరణలు! కర్నాటకలో జరిగిన ఒక సంఘటన చూద్దాం! ఒక ప్రమాదంలో సోమశేఖర్ అనే అబ్బాయి, ఆతని తమ్ముడు తల్లిదండ్రులను పొగొట్టుకుని అనాధలై పోయినప్పుడు- మహబూబ్-నూర్జహాన్ అనే ముస్లిం దంపతులు బాధ్యత తీసుకుని, వారిని పెంచి పోషించారు. తల్లి దండ్రులు లేరన్న కొరత రానీయలేదు. మానవత్వానికి ఉదాహరణగా నిలిచి న ఆ దంపతులు బలవంతంగా ఆ పిల్లల్ని తమ మతంలోకి, తమ ఆచారాల్లోకి మలుచుకునే అవకాశం ఉన్నా కూడా వారు ఆపని చేయలేదు. సోమశేఖర్ పెండ్లీడుకు రాగానే, వారి అసలు అమ్మానాన్నల సంప్రదాయం ప్రకారం లింగాయ తుల అమ్మాయితోనే, వారి ఆచారాల ప్రకారమే ఘనంగా పెండ్లి జరిపించారు. అధికారంలో కొనసాగడానికి కొందరు కావాలని విద్వేష ప్రచారాలు చేస్తున్నది మనం చూస్తున్నాం.
ఇలాంటి సమయంలో ఈ ముస్లిం దంపతుల విశాల హృదయం ప్రశంసనీయం కదా? ఇలాంటి సంఘటనలు దేశంలో అక్కడక్కడా కొన్నయినా జరుగుతున్నాయి. ఎన్నడైనా, ఎప్పుడైనా ‘మన్ కీ బాత్’లో ఇలాంటి విషయం ఒక్కటంటే ఒక్కటి ఈ దేశ ప్రజలు విన్నారా? మనుషులం కదా? మానవత్వం కదా కావల్సిందీ ? మానవ ద్వేషాన్ని వ్యాప్తి చేయడం అవసరమా? ‘మేరా భారత్ మహాన్’ అంటే అన్ని మతాల వారూ మన భరతమాత బిడ్డతే అని కదా అర్థం? భారతదేశం ఏ ఒక్కజాతి వారిదో, ఏ ఒక్క మతం వారిదో స్వంత ఆస్తి కాదు. మన జాతీయ పతాకంలో ధర్మచక్రాన్ని చేర్చి, జెండాకు గౌరవాన్ని పెంచింది సురయ్యా త్యాజ్జీ- ఒక ముస్లిం మహిళ! ఈ దేశానికి ‘జైహింద్’ అనే గొప్ప నినాదాన్ని అందించింది- ఆబిద్ హసన్ మన హైద్రాబాద్ ముస్లిం! సుభాష్ చంద్రబోస్ అనుచరుడు. ఆయన ఏర్పర్చిన ఆజాద్ హింద్ ఫాజ్‌లో మేజర్‌గా పని చేసినవాడు. హిందూముస్లిం ఏకతను చాటడానికి తన పేరు చివర ‘సఫ్రానీ’ అని చేర్చుకున్నాడు. సఫ్రాన్ అంటే కాషాయ రంగు. హిందువులు అతి పవిత్రంగా భావించుకునే ఆ సప్రానీని తన పేరులో కలుపుకుని, హిందువుల పట్ల గౌరవభావాన్ని ప్రకటించుకున్నాడు. మరోముఖ్య విషయమేమంటే మన జాతీయ గీతం ‘జనగణమన’ను హిందుస్తానీలోకి అనువదించి ప్రచారం చేశాడు. ఇలా అందరినీ కలుపుకుపోయే వారే మనకు ఆదర్శం! మనుషులు ఎవరికి వారు ఏకాకులుగా మిగిలిపోవడానికా శతాబ్దాలుగా మనం ఈ నాగరిక ప్రపంచాన్ని నిర్మించుకుంటూ వస్తున్నది? ఈ ప్రశ్న మన ప్రస్తుత దేశ నాయకులకే కాదు, ప్రపంచ ఉగ్రవాదులైన నెతన్యాహు, ట్రంప్‌లకు కూడా వేయాల్సి ఉంటుంది!- వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత, జీవశాస్త్రవేత్త.
ప్రొ. దేవరాజు మహారాజు



