Thursday, August 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘డబుల్‌ ఇంజన్‌’ రాష్ట్రాల్లో విద్యా సంక్షోభం

‘డబుల్‌ ఇంజన్‌’ రాష్ట్రాల్లో విద్యా సంక్షోభం

- Advertisement -

దేశ భవిష్యత్తుకు పునాది కావాల్సిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాఠశాలల మూసివేతలు, ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమిపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టడం విద్యా సంక్షోభాన్ని బయటపెడు తోంది. ‘ప్రాథమిక విద్యను కాపాడండి’ అనే నినాదంతో ‘స్కూల్‌ కాంప్లెక్స్‌ సిస్టమ్‌’ను రద్దు చేయాలని హిమాచల్‌ప్రదేశ్‌లో ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలకు కారణమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. గత పదేండ్లుగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలహీనపరిచే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉద్యమిస్తున్నారు.యుడైస్‌ తాజా నివేదిక ప్రకారం దేశంలో రోజుకు సగటున 13 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. పాఠశాలల్లో బెంచీలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై విద్యార్థులు అధికారులను నిల దీస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో విద్యార్థులు నిరసనలకు దిగడం గమనార్హం. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాష్ట్రాల్లో ఎక్కువ భాగం బీజేపీ పాలిత, డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలే కావడం. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పే డబుల్‌ ఇంజన్‌ నినాదానికి, ప్రభుత్వ విద్యారంగంలోని వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.

పాఠశాలల మూసివేతలు, ఉపాధ్యాయ ఖాళీలు, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు కొనసాగుతుండటం ఆ ప్రభుత్వాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.మౌలిక సదుపాయాల కోసం విద్యార్థుల పోరాటంఏకోపాధ్యాయ పాఠశాలల్లో తక్కువ మంది ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు పూర్తిస్థాయి బోధన అందడం లేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 1 నుంచి 5వ తరగతి వరకు కనీసం ఇద్దరు, 6 నుంచి 8వ తరగతి వరకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలని పిటిషన్‌లో కోరారు.16 వేలకు పైగా ఏకోపా ధ్యాయ పాఠశాలలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల పరిస్థితిపై వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రాజస్థాన్‌లోని జాలూరు జిల్లా మెంగల్వా గ్రామంలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థులు పాఠశాల బయట బైఠాయించారు. బీహార్‌లోని గయా జిల్లాలో పాఠశాల సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేసి జిల్లా మెజిస్ట్రేట్‌ వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని దహనులో తాగునీరు, వాష్‌రూమ్‌లు, భద్రతా సమస్యలపై విద్యార్థులు నిరసన తెలిపారు.దేశంలో ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక సమస్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,00,843గా ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 16,357 పాఠశాలలతో మొదటి స్థానంలో ఉంది.

ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో రోజుకు సగటున 13 ప్రభుత్వ పాఠశాలలు మూతపడినట్లు యుడైస్‌ నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 4,791 పాఠశాలలకు తాళాలు పడ్డాయి. మధ్యప్రదేశ్‌లో 2,426 ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా, తెలంగాణలో 1,392 పాఠశాలలు మూసివేయబడ్డాయి. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే పాఠశాలల మూసివేతలు, డ్రాప్‌అవుట్లు, విద్యార్థుల సంఖ్య తగ్గుదల వంటి సమస్యలు కనిపించడం ఆ ప్రభుత్వాల విద్యా విధానాలపై చర్చకు దారితీస్తోంది. ప్రచారంలో విద్యారంగ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ బడుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.డ్రాపౌట్ల పెరుగుదలపై ఆందోళనదేశంలో సెకండరీ స్కూల్‌ డ్రాపౌట్‌ రేటు 9.5 శాతంగా ఉంది. గుజరాత్‌లో ఇది 15.7 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంగా కొనసాగుతున్న గుజరాత్‌లో కూడా విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయడం విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సూచిస్తోంది. రాజస్థాన్‌లో గత రెండు విద్యా సంవత్సరాల్లో 8 లక్షలకు పైగా విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే 9.3 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గడం గమనార్హం. దీనికితోడు విలీన విధానం.. విద్య అందుబాటుపై ప్రభావం చూపుతోంది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 40 వేల పాఠశాలలు విలీనమయ్యాయి.

పాఠశాలల విలీన విధానం వల్ల పాఠశాల విద్యను సార్వత్రికం చేయాలనే లక్ష్యానికి ఆటంకం కలుగుతోందనే విమర్శలు ఉన్నాయి. 2030 నాటికి పాఠశాల విద్యను సార్వత్రికం చేయాలని భారత ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDG) కింద సంకల్పించింది. అయితే పాఠశాలల విలీనం వల్ల ముఖ్యంగా గ్రామీణ, మారు మూల ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. సమీపంలో ఉన్న పాఠశాల మూతపడితే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడం వల్ల పేద కుటుంబాల పిల్లలు చదువు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్య నాణ్యతను మెరుగుపరిచే పేరుతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి వాటి నిర్వహణ బాధ్యతను ప్రయివేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రయివేటీకరణ వైపు అడుగులు వేయడం పేద, సామాన్య విద్యార్థులపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి.విద్యా వ్యవస్థలోకి ప్రవేశించే ప్రతి పది మంది పిల్లల్లో నలుగురు ఉన్నత మాధ్యమిక విద్య పూర్తికాకముందే చదువు మానేస్తున్నారని గణాంకాలు సూచి స్తున్నాయి. దేశంలోని కేవలం 5.4 శాతం పాఠశాలలు మాత్రమే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నిరంతర విద్యా ప్రయాణాన్ని అందిస్తున్నాయి.పై తరగతులకు వెళ్లే ప్రతి దశలో పాఠశాలలు మారాల్సి రావడం, రవాణా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువు కొనసాగింపుపై ప్రభావం చూపుతున్నాయి.

విద్యా కేటాయింపులు తగ్గుతున్న వేళ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ మాత్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల సమస్యలు, మౌలిక సదుపాయాల లేమి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్‌ పరిమాణం పెరుగుతున్నప్పటికీ, విద్యకు కేటాయించే వాటా తగ్గు తోంది. 2013-14లో మొత్తం కేంద్ర బడ్జెట్‌లో విద్యకు 4.65 శాతం కేటాయించగా, 2025-26 నాటికి అది 2.5 శాతానికి పడిపోయింది.విద్యతో పాటు పరిశోధన రంగానికి కూడా తగిన ప్రాధాన్యం తగ్గుతోందనే విమర్శలు ఉన్నాయి. దేశ యువతను ప్రపంచ స్థాయిలో నిలబెడతామని చెప్పే ప్రభుత్వాలు, ప్రాథమిక విద్య బలపడేలా తగిన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు అభివృద్ధి, సుపరిపాలనకు ప్రతీకలని ప్రచారం చేస్తున్నప్పటికీ, విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యలు ఆ వాదనలను ప్రశ్నిస్తున్నాయి. పాఠశాలలు మూతపడటం, విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఉపాధ్యాయ ఖాళీలు పెరగడం వంటి అంశాలు ప్రభుత్వాలను నిలదీస్తున్నాయి.విద్య హక్కు నుంచి అవకాశంగా మారుతున్నదా?చదువుకోలేని పిల్లలకు విద్య అందించడం, బలహీన వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా యునెస్కో ‘అందరికీ విద్య’ కార్యక్రమాన్ని ప్రతిపాదించింది.

విద్యలో లింగ వివక్షను తొలగించడం, వంద శాతం అక్షరాస్యత సాధించడం దాని ప్రధాన లక్ష్యాలు.అయితే ఒకవైపు అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలని చెబుతూనే, మరోవైపు ప్రయివేటు విద్యాసంస్థలను ప్రోత్సహించే విధానాలు కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. 2010లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టం విద్యను హక్కుగా గుర్తించింది. కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడితే పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత, నాణ్యమైన విద్య అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. విద్య అనేది కేవలం మార్కులు, ఉద్యోగాల కోసం మాత్రమే కాదు.. సమాజ అభివృద్ధికి, ప్రజాస్వామ్య బలోపేతానికి పునాది. అందుకే ప్రభుత్వ పాఠశాలలను రక్షించడం, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడం, ఆధునిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.తరగతి గదులకు తాళాలు పడకుండా, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాల నిజమైన పనితీరు ప్రచారాల్లో కాదు.. పాఠశాలల తరగతి గదుల్లో, విద్యార్థుల భవిష్యత్తులో కనిపించాలి.

కె. వేణుగోపాల్, 9866514577

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -