హెచ్ పీ పెట్రోల్ పంపులో నీళ్లతో కూడిన పెట్రోల్..
ఆందోళన చేపట్టిన ద్విచక్ర వాహనదారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్లలోని ‘ప్రశాంతి ప్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్’ హెచ్చీ పెట్రోల్ బంక్ లో నీళ్లతో కూడిన పెట్రోల్ వస్తోందని ద్విచక్ర వాహనదారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. బంక్ నిర్వాహకుల కల్తీమయం చేస్తూ పెట్రోల్లో నీళ్లు కలిపి విక్రయిస్తూ వాహనదారులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. తాడిచర్ల గ్రామానికి చెందిన ఇరాతి నరేష్ అనే యువకుడు గురువారం ఉదయం తన గ్లామర్ బైక్లో ఈ బంకు వద్ద రూ. 110 ల పెట్రోల్ కొట్టించుకున్నాడు. బంకు నుండి బయటకు రాగానే, అంతవరకు బాగానే ఉన్న బైక్ ఒక్కసారిగా ఆగిపోయి మొరాయించింది. ఎంతకీ స్టాట్ కాకపోవడంతో నరేష్ తీవ్ర ఆందోళనకు గురై బైక్ను నెట్టుకుంటూ మెకానిక్ షాప్కు తీసుకెళ్లాడు. బైక్ ట్యాంక్ విప్పి చూసిన మెకానిక్.. అందులో ఉన్నది పెట్రోల్ కాదు, అంతా నీళ్లేనని తేల్చి చెప్పాడు.
అంతేకాదు.. ఇంజన్ దెబ్బతిందని, రిపేర్ చేయడానికి రూ. 3,500 వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో బాదితుడు లబోదిబోమంటూ బంకు యజమాని వద్దకు చేరుకున్నాడు. బాటిల్లో పట్టి చూపిస్తే ఇథనాల్ అంటూ మాయమాటలు మెకానిక్ మాటలతో అవాక్కైన నరేష్, వెంటనే ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని మళ్లీ అదే బంకుకు వెళ్లాడు. అక్కడ బాటిల్లో పెట్రోల్ కొట్టించగా, కింద నీళ్లు, పైన పెట్రోల్ స్పష్టంగా వేరుపడి కనిపించాయి ఇదేమిటని బంక్ సిబ్బందిని నిలదీయగా.. వారు ఏమాత్రం తప్పు ఒప్పుకోకుండా, ‘అది నీళ్లు కాదు.. ఇదనాల్ అంటూ మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
‘ఇథనాల్ అయితే నా బైక్ ఎందుకు పాడైంది?’ అని బాదితుడు గట్టిగా ప్రశ్నించడంతో, సిబ్బంది తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ‘ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బాధితుడిపై మొండిగా దౌర్జన్యానికి దిగడంతో మరి కొందరు బాధితులు నరేశ్ కు అండగా నిలిసి బంక్ ముందు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ కల్తీమయం చేస్తున్న పెట్రోల్ బంకుపై సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.



