తెలుగు సినిమా మలిదశకంలో సినీ రంగ ప్రవేశం చేసిన కనకం సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ వేషాలే కాకుండా కామెడీ వేషాలు వేసి ప్రేక్షకులను మెప్పించింది. నాటక, సినీ రంగాలలో కనకంగా పేరుపొందిన ఈమె అసలు పేరు కనకదుర్గ. 1930 నవంబర్ 12న షోలాపూరమ్మ, అప్పలస్వామి దంపతులకు ఒరిస్సాలోని ఖరగ్‌పూర్‌లో జన్మించింది. ఐతే పెరిగింది, చదివింది విజయవాడలో. బాల్యంలో మంచి కంఠం ఉండటంవల్ల వినికిడి జ్ఞానంతోనే సంగీతం నేర్చుకున్నది. ఆ సంగీత ప్రతిభ ఆధారంగానే ఆమె బాల్యంలోనే లోహితుడు, బాలకృష్ణుడు, ప్రహ్లాదుడు వంటి పాత్రలు పోషించి నాటక రంగానికి పరిచయమైంది.
1944లో నాట్యసమితి (గుంటూరు) వ్యవస్ధాపకులు కూర్మావేణుగోపాలస్వామి రాసిన ‘ప్రతిమాసుందరి’ నాటకంలో తన 12వ ఏట కథానాయకిగా కనకం తొలిసారి నటించింది. అనంతరం వావిలాల సోమయాజులు ‘నాయకురాలు’ నాటకంలో ఎన్.టి.రామారావు (బాలచంద్రుడిగా), యం.మల్లికార్జునరావు (గూఢాచారి 116 చిత్ర దర్మకుడు), ఆవేటి పూర్ణిమ, కనకం (మాంచాలగా) నటించగా ఆంధ్రదేశం అంతటా ప్రదర్మించారు. నిజానికి కనకం బాగా చదువుకుని తెలుగు పండిట్‌గా టీచర్ ఉద్యోగం చేయాలన్నది ఆమె కోరిక. ఐతే ఇంట్లో వాళ్ళు మహారాష్ట్రకు చెందిన ఒక డాక్టర్‌తో ఆమె పెళ్లి నిశ్చయించారు. కానీ కనకం అతనికి ఇది రెండో పెళ్లి అని తెలుసుకుని ఎలాగైనా ఆ పెళ్లిని రద్దు చేసుకోవాలని ఇంట్లోని తన దుస్తులు, ఏదో కొంత డబ్బు తీసుకుని మద్రాసు రైలెక్కింది. అంత ధైర్యంగా మద్రాసు వెళ్లడానికి ఆమెకున్న ధైర్యం.. అంతకుముందే విజయవాడలో తాపీ ధర్మారావుతో ఆమెకు మంచి పరిచయం వుండింది.
ఆయన చాలాసార్లు సినిమా అవకాశాల కోసం మద్రాస్ రమ్మన్నాడు. ఇప్పుడు మద్రాస్‌లో తాపీ వారి ద్వారా సినిమాల్లో చేరవచ్చని భావించి మద్రాసు వెళ్లిపోయింది. అక్కడ గంగారత్నంగారి ఇంట్లో ఉంటూ రేడియోలో జానపదగీతాలు పాడింది. రేడియోలో పాడుతున్న సమయంలోనే త్రిపురనేని గోపిచంద్, బి.యన్. రెడ్డిగార్ల పరిచయం ఏర్పడింది. అప్పుడే సారధి వారు యల్ .వి.ప్రసాద్ దర్శకత్వంలో తీసిన ‘గహప్రవేశం’ (1946)చిత్రంలో కనకం తొలి సారిగా బాల వితంతువు వేషం వేసింది. ఆ తరువాత ‘కీలుగుర్రం’ (1949) చిత్రంలో అంజలీదేవితో పాటు కనకం తల్లీ కూతుళ్ళైన రాక్షస స్త్రీల వేషం వేసారు. ఆ తర్వాత వాహిని వారి కె.వి.రెడ్డి ”గుణసుందరి కథ” లో మకర కన్య వేషం వేసింది. ఈ వేషంలో ఆమె కాస్త శృంగారం
పాలు ఎక్కువగా ప్రదర్శించింది. దాంతో ఆమె శృంగారం తారగానే పనికి వస్తుందని పరిశ్రమలో అనుకున్నారు. పత్రికలు కూడా అలాగే రాశాయి. ఆ తర్వాత నటించిన ”రక్షరేఖ” లో కూడా అలాంటి వేషమే వచ్చింది. ఈ సినిమాలో కస్తూరి శివరావుతో ఆమె జోడి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఆ తర్వాత కాలంలో ఆమె సీతారాం – నల్ల రామూర్తిల జంటతో కూడా పేరు వచ్చిన పాత్రలో నటించింది. సౌదామిని, సతీ సక్కుబాయి చిత్రాలలో రేలంగితో జంటగా నటించింది.
ఈ విధంగా ‘పల్లెటూరిపిల్ల’, శివరావు తీసిన ‘పరమానందయ్య శిష్యుల కథ, ‘చంద్రవంక (1951), అగ్నిపరీక్ష, ఆకాశరాజు, తిలోత్తమ, సౌదామిని, మానవతి, మాయ పిల్ల, (1951) దాసి, ఆడిబతుకు, టింగురంగా, మానవతి (1952), ప్రపంచం (1953) సతీ సక్కుబాయి(1954), భలే అమ్మాయిలు (1956), లదమయంతిహొ(1957), బాలనాగమ్మ(1959), లేతమనసులు (1966), అవేకళ్ళు, భక్త ప్రహ్లాద (1967), లక్ష్మీనివాసం (1968), భాగ్యచక్రం (1969) వంటి చిత్రాల్లో నటించింది. ఆమె చివరి చిత్రం ‘ద్రోహి’ (1970). ఆమె సుమారు 50 సినిమాల్లో నటించింది.
కనకం ధరించిన పాత్రలలో విజయవారి తొలి సినిమా ‘షావుకారు’లోని ‘చాకలి రామి’ పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోదగింది. అంతకు ముందు వాహిని వారి గుణసుందరిలో పాత్రను చూసి ఎల్వి ప్రసాద్, నాగిరెడ్డి ఆమెను షావుకారులోని చాకలి రామి పాత్రకు ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఆమెది కీలకమైన పాత్ర. ఆ తర్వాత గోపీచంద్ ప్రియురాలులో వేశ్యమాతగా లక్ష్మీకాంత తల్లివేషం వేసింది. అంతకుముందు వచ్చిన సౌదామినిలో హీరోయిన్ ఎస్. వరలక్ష్మికి ఇష్టసఖిగా నటించింది. దాసిలో రామారావు రెండో భార్యగా గయ్యాళి వేషం వేసింది. తెలుగులో తొలి డబ్బింగ్ సినిమా ఆహుతిలో శ్రీశ్రీ ఆమెతో ఒక పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పించాడు. ఎన్టీఆర్ బాలనాగమ్మలో చాకలి లచ్చి పాత్రలో మరొకరిని ఊహించలేము. అంత గొప్పగా నటించిందామె. ఐతే కనకం హీరోయిన్‌గా నటించాలని చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దాంతో అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకుని కొద్దికాలం సెక్సీ స్టార్‌గా, ఆ తర్వాత కామెడీ నటిగా స్థిరపడిపోయింది. అయితే ఆమె సంపాదన మాత్రం ఆనాటి ఏ హీరోయిన్‌కీ తక్కువ లేదు.
రెండు కార్లు, మిద్దెలు, మేడలు సంపాదించింది. కారులో మౌంట్‌రోడ్డుకు వెళ్లి పిస్తాపప్పు, తిను బండారులు కొనుక్కొచ్చి సినిమా షఉటింగుల్లో తోటి వారందరికీ పంచేది. ఆమె విలాస వంతమైన జీవితం ఏ స్థాయిలో ఉండేదంటే ఆ రోజుల్లో ఆమెకి ఇష్టమైన కూల్‌డ్రింక్ మద్రాసులో దొరికేదికాదు. దానికోసం ఉదయం విమానంలో బెంగళూరుకు వెళ్లి ఆ కూల్‌డ్రింక్ తాగి తిరిగి సాయంత్రానికి మద్రాసుకు తిరిగి వచ్చేది. ఇలా నెలకు ఇరవై రోజులపాటు బెంగళూరు వెళ్లి వచ్చేదామె. మద్రాసులోని సాదుల్లా స్ట్రీట్‌లో ఉన్న మేడ, సొంత కారు అన్నిటిని ఆ తర్వాత ఆమె అమ్ముకోవలసి వచ్చింది. ఇందుకు బలమైన కారణమే ఉంది.
ఏ చీకు చింతా లేకుండా ప్రశాంతంగా ఉన్న ఆమె జీవితం సినిమా నిర్మాణం అనే ఒక తప్పటడుగుతో తలకిందులైపోయింది. 1956లో తన భర్త సూరి దర్శకత్వంలో పద్మిని, మంత్రవాది శ్రీరామమూర్తి నాయకీ నాయకులుగా ‘దేశదిమ్మరి’అనే సొంత చిత్ర నిర్మాణానికి పూనుకున్నది. ఆరుద్ర, శ్రీశ్రీ, పెండ్యాల, జిక్కి, రావు బాలసరస్వతి, ఘంటసాల వంటి వార్లతో తన చిత్రం ప్రారంభించారు. ఐతే ఆర్దిక పరిస్ధితులతో ఆ చిత్రం ఆగిపోయింది. అప్పటికే ఆ సినిమా కోసం తన ఆస్తులు కూడా అమ్ముకొని ఖర్చు పెట్టింది. సినిమా నిర్మాణం చేపట్టడంతో నటించే అవకాశాలూ క్రమంగా తగ్గిపోయాయి. ఇది ఆమెను మరింత గడ్డు పరిస్థితుల్లోకి నెట్టివేసింది. అప్పటిదాకా సంపాదించుకున్న డబ్బు, బంగారం అన్నీ కరిగిపొయ్యాయి.
ఈ పరిస్థితులలో కనకం నటుడు నల్లరామూర్తిగారితో కలసి కొన్ని హాస్య గీతాలు గ్రాంఫోన్ రికార్డులుగా వెలువడ్డాయి. సినీ పరిశ్రమలో ఆదరణ తగ్గడంతో, ఆమె మద్రాసులో నాటక సమాజం స్ధాపించి, కె.రఘురామయ్య, మాధవపెద్ది, నల్లరామూర్తి, రేలంగి, రక్తకన్నీరు సీత వంటివారితో కలసి ‘చింతామణి’ నాటకాన్ని దేశం అంతటా ప్రదర్మించారు. అనంతరం తెనాలి దావినేడి పున్నయ్య, నీలం రాఘవయ్యలు ఈమెకు శ్రీకృష్ణుడిగా శిక్షణ ఇప్పించి, ‘శ్రీకృష్ణరాయభారం’ నాటకంలో ‘పీసపాటి, రఘరామయ్య, షణ్ముఖి ఆంజనేయ శాస్త్రి, ధూళిపాళ’ వంటివారితో కలసి వందల ప్రదర్మనలు ఇచ్చింది. కమలా నాట్యమండలి విజయవాడ అబ్బూరి కమలాదేవితో కలసి ‘శ్రీకృష్ణతులాభారం’లో నారదుడిగా నటించి కనకం ఎనలేని ఖ్యాతి పొందింది. విజయవాడకు నివాసం మార్చిన తర్వాత ఆమె రంగస్థలంపై కురుక్షేత్రం నాటకంలో శ్రీకృష్ణుడిగా ఒక కొత్త ఒరవడిని సష్టించింది. స్త్రీ అయి ఉండి పురుష పాత్రలు పోషించి మెప్పు పొందడం ఆమె ప్రత్యేకతగా నిలిచిపోయింది. కురుక్షేత్రం, శ్రీకృష్ణ రాయభారం నాటకాలలో పీసపాటి, ధూళిపాళ మొదలైన వారితో ఒకటవ కష్టుడు రెండో కృష్ణుడు ఇలా వేషాలు వేస్తూ వందల ప్రదర్శనలు ఇచ్చిందామె. శ్రీకృష్ణ రాయభారంలో తిరుపతి వెంకట కవుల పద్యాలను ఆరున్నర శతిలో ఆమె పాడితేనే వినాలి. ఆ కాలంలో ఆమె 1972 నుండి పదేళ్లపాటు పౌరాణిక రంగస్థలంపై తనదైన ఒక జైత్రయాత్ర చేసింది.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండలేదు. ఆమెకు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి. ఇంతలో ఆమె సోదరుడు మరణించాడు. ఒకనాడు హఠాత్తుగా ఆమె మేడ మీద నుండి కింద పడి ప్రాణాలతో బయటపడింది. దీంతో కొంత కాలం మంచానికే పరిమితం కావలసి వచ్చింది. జీవిక కోసం ఇతరులపై ఆధారపడక తప్పలేదు. దాతలు ఇచ్చే సాయంపై ఆమె జీవితం గడిచేది. ఎఫ్ డి సి వారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధ కళాకారుల పెన్షన్లు ఆమెకు ఏ మూలరై సరిపోయేవి కావు. 2000 తర్వాత ఆమె ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోవడంతో పలు పత్రికలలో ఆమె దీనస్థితిని గురించి ఈ వ్యాసకర్తతో పాటు, కంపెల్ల రవిచంద్రన్ వంటి సినీ పరిశోధకులు వ్యాసాలు రాయగా ఆమెకు కొందరు వధాన్యుల నుండి సాయం అంది కొంత ఊపిరి పీల్చుకున్నది. ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే ఎన్టీఆర్ రంగస్థలం పురస్కారాన్ని ఆమెకు ప్రకటించి ఒకరకంగా ఆదుకున్నదని చెప్పాలి. కనకం సినీ రంగస్థలం నటిగా చేసిన సేవలకు అజో విభో పురస్కారం, గుప్తా ఫౌండేషన్ అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాలు అందుకున్నది. 1991 త్యాగరాయగానసభలో, 1992 నెల్లారులో లిమ్కా స్టేజి అవార్డు, స్ధానం వారి అవార్డు పొందింది. జీవితమంతా నాటక, సినీ రంగాలకు అంకితమైన కనకం తన 88వ ఏట విజయవాడలో కన్ను మూసింది. ఆరోజు 2015 జూలై 21.
2012 సెప్టెంబర్ 26.. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్. సుప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి జన్మ శతాబ్ది సంచిక ఆవిష్కరణ సభ. కె.వి.రెడ్డితో కలిసి పని చేసిన నటీనటులను, టెక్నీషియన్లను ఆ సభకు ఆహ్వానించారు. కె.విశ్వనాథ్, సింగీతం, జమున, జయంతి తదితరులతో బాటు ఆయన సినిమాల్లో నటించిన నటి తెలుగు కనకం కూడా ఆ సభకు ఆహ్వానించి ప్రత్యేకంగా ఆమెను సన్మానించారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కె.వి.రెడ్డి సినిమా డైరెక్షన్ గురించి ఆ తరం విలువల గురించి మాట్లాడింది. కానీ అప్పటికి తాను ఎంత పేద పరిస్థితిలో ఉన్నదో మాట మాత్రంగా కూడా చెప్పలేదు. ఆమె తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత కె.వి.రెడ్డి సంచికను రూపొందించిన ఈ కాలమిస్టు కనకం ఉంటున్న అత్యంత దీనమైన పరిస్థితిని సభలో వివరించి ఆమెకు తోచినంత సహాయం చేయమని చేసిన ఒక్క విజ్ఞప్తికి అప్పటికప్పుడు సుమారు లక్ష రూపాయలు విరాళాలు పోగైనవి. తెలుగు సినీ రంగంలో లక్ష్మీరాజ్యం, ఎస్ వరలక్ష్మి, అంజలి వంటి నాయికలతో సమానమైన వేషాలు వేసిన కనకం జీవితం చివరి దశలో కన్నీటితో గడిపింది.
హెచ్ రమేష్ బాబు,
7780736386



