కేంద్రాన్ని నిలదీసిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
ఆందోళనను
భగ్నం చేసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నం
అంబేద్కర్
భగత్ సింగ్ సావిత్రిబాయి పూలే ఫొటోలతో నినాదాల హోరు
ఒక చేతిలో రాజ్యాంగం, మరో చేతిలో జాతీయ జెండా
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకూ నిరసనలు కొనసాగుతాయని వెల్లడి
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన
దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ‘బొద్దింకలు’ ముసురుకున్నాయి. ఆ ప్రదేశం నినాదాలతో నిండిపోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ నిర్వహించిన ఈ ఆందోళనలో, మోడీ ప్రభుత్వంపై దేశ యువత ఆగ్రహం వెల్లువెత్తింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా, సీజేపీ పిలుపునిచ్చిన ఈ నిరసనలో పాల్గొనేందుకు వేలాది మంది జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, సీబీఎస్ఈ అవకతవకలు, సీయూఈటీ, ఎస్ఎస్‌సీ, జేఈఈ డేటా లీక్ వంటి అంశాలను లేవనెత్తుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఇంకెంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకూ అధికారులు వేచిచూస్తారని కాంక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్రాన్ని నిలదీశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ నిర్వహణలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శనివారం ఇక్కడ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)) ఆధ్వర్యంలో నిరసన జరిగింది.
‘కాక్రోచ్ (బొద్దింకల) జనతా పార్టీ (సీజేపీ))’ నిర్వహించిన ఈ ఆందోళనలో, మోడీ ప్రభుత్వంపై దేశ యువత ఆగ్రహం వెల్లువెత్తింది. సీజేపీ) పిలుపునిచ్చిన ఈ నిరసనలో పాల్గొనేందుకు మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సీబీఎస్ఈ అవకతవకలు, సీయూఈటీ, ఎస్ఎస్‌సీ, జేఈఈ డేటా లీక్ వంటి అంశాలను లేవనెత్తుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ) డిమాండ్ చేసింది.
భారీ సంఖ్యలో ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రధానంగా యువత ఎక్కువగా పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. చాలామంది బొద్దింక మాస్క్‌లను ధరించి, పువ్వులు చేతబట్టుకుని పాల్గొన్నారు. స్కూలు విద్యార్ధులు కూడా తమ తల్లిదండ్రులతో ఈ ఆందోళనలో పాల్గొనడం కనిపించింది. శాంతియుత నిరసన అని రాసిన పెద్ద బ్యానర్‌ను అక్కడ ఆందోళనకారులు ప్రదర్శించారు. దానిపై విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా వుంది.
ఉదయం నుంచే నిరసనలతో అట్టుడికిన రాజధాని
ఈ ఆందోళన జంతర్ మంతర్ వద్ద జరిగినప్పటికీ, ఉదయం నుంచే ఢిల్లీ మొత్తం నిరసనలతో అట్టుడికింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఉదయం 7.35 గంటలకు ఢిల్లీలో దిగారు. వెంటనే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిరసన ప్రదర్శనకు అనుమతి కోరాలని దీప్కే నిర్ణయించుకున్నారు. కానీ విమానం దిగిన వెంటనే, భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వారిని చుట్టుముట్టాయి. అనంతరం నిరసన ప్రదర్శనకు అనుమతి లభించింది.
ఆందోళనలో పాల్గొనడానికి ప్రజలు ఉదయం 9 గంటలకే జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. యువతతో పాటు, వృద్ధులు కూడా ఈ నిరసనలో భాగస్వామ్యం అయ్యారు. కొందరు తమ కుటుంబాలతో కలిసి జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. తెలుగువారు, మలయాళీలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు అభిజిత్ కూడా జంతర్ మంతర్‌కు చేరుకోవడంతో నిరసనకారుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. ఆందోళనలో పాల్గొనేందుకు ఉదయం నుంచే వస్తుండడంతో మధ్యాహ్నం నాటికి ఆ ప్రాంతమంతా జన సముద్రంలా మారింది. ఈ నిరసన సాయంత్రం వరకు కొనసాగింది.
ఒక చేతిలో రాజ్యాంగం, మరో చేతిలో జాతీయ జెండా
సీజేపీ పిలుపు మేరకు యువత పుస్తకాలు, జాతీయ జెండాలు, పూలతో వచ్చారు. కరుణ, కృతజ్ఞతకు చిహ్నంగా పోలీసులకు పూలను అందజేసి తమ శాంతి వ్యూహాన్ని తెలిపారు. ఈ ఉద్యమాన్ని ప్రేమ, శాంతితో నడపాలని సీజేపీ పిలుపు ఇవ్వడంతో ఆ రీతిలోనే ముందుకు సాగారు. నిరసనలో అంబేద్కర్, భగత్ సింగ్, సావిత్రి బాయి పూలే ఫోటోలు, పేర్లను ప్రదర్శించారు. యువకులు చే గువేరా టీ-షర్టులు, బొద్దింకల ముసుగులు ధరించి నిరసన ప్రదర్శనకు వచ్చారు. వారు ఒక చేతిలో రాజ్యాంగాన్ని, మరో చేతిలో జాతీయ జెండాను పైకెత్తి నినాదాలు చేశారు. అభిజీత్ దీప్కే భారత క్రికెట్ జట్టు జెర్సీని ధరించాడు. జంతర్ మంతర్‌కు చేరుకున్న విద్యార్థులు రోడ్డుపై సుద్దతో ధర్మేంద్ర ప్రధాన్ చిత్రాన్ని గీసి, మంత్రి వెంటనే రాజీనామా చేయాలని రాశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ తరువాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు వారు సంతాపం తెలుపుతూ, తమ ఫోన్ ఫ్లాష్‌లైట్లను వెలిగించారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సీజేపీ నిరసనను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జంతర్ మంతర్ వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించింది. 1,500 మంది ఢిల్లీ పోలీసులు, ర్యా పిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్), 40 కంపెనీల పారామిలిటరీ బలగాలు వంటి కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. నిరసన ప్రదేశానికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీ, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, మెట్రో స్టేషన్లు, ఢిల్లీ నగరాన్ని పొరుగు రాష్ట్రాలతో కలిపే సరిహద్దు ప్రవేశ మార్గాల వద్ద సహా ఢిల్లీలోని అనేక ప్రదేశాలలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి ఆంక్షలు విధించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద కూడా భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అదనపు డిసిపిలు, ఎసిపిలతో సహా సీనియర్ అధికారులకు విధులను కేటాయించారు.
సంఘ పరివార్ యత్నాలు
నిరసనను భగ్నం చేయడానికి సంఘ్ పరివార్ అన్ని విధాలా ప్రయత్నించింది. సంఘ్ పరివార్ కార్యకర్తలు నిరసనకారుల వైపు దూసుకెళ్లారు. కానీ బొద్దింకలు వీటన్నింటినీ అడ్డుకుని ఆందోళనను విజయవంతం చేశాయి. ఆందోళన ప్రాంతం సమీపంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు.
ఇంకా ఎన్నాళ్ళీ భయం ?
ఆందోళనకారులను ఉద్దేశించి అభిజిత్ దీప్కే మాట్లాడుతూ, ‘తమ పిల్లలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే ఏమవుతుందోనన్న భయం ఈ దేశంలోని ప్రతి తల్లికి ఉంది. ఈ ప్రభుత్వానికి భయపడి ఎంతకాలం బతకాలి?’ అని ఆయన ప్రశ్నించారు. నిరసనలకు దిగితే జైలులో పెడతారేమోనని తన తల్లి కూడా భయపడినట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు.
“హిందూ-ముస్లిం రాజకీయాల వల్ల దేశంలో ఎవరికైనా ఏమైనా ప్రయోజనం కలిగిందా? గత 10-12 ఏండ్లుగా వాళ్లు మనల్ని హిందూ-ముస్లిం రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఈ రాజకీయాల వల్ల ఇక్కడ ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా?” అని ప్రశ్నించారు. “ఇది ఒక సుదీర్ఘ పోరాటం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో చాలా రోజులుగా డిమాండ్ వస్తోంది. దాదాపు నెలరోజులు కావస్తుంది. కానీ చర్యలు తీసుకోవడానికి బదులుగా, ఈ సిగ్గులేని వాళ్లు సిజెపి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం, మా పోస్టులను తొలగించడంపై దృష్టి పెట్టారు. మీరు మా పోస్టులను తొలగించగలిగి ఉండవచ్చు. కానీ మమ్మల్ని తొలగించలేరు” స్పష్టం చేశారు. “నిరసనల వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు అడుగుతారు. మేము బతికే ఉన్నామనడానికి ఈ నిరసనలే నిదర్శనం. ప్రభుత్వానికి మనం కేవలం పురుగులమే. కానీ మన హక్కుల కోసం పోరాడే సత్తా మనకుంది. జైలు శిక్ష భయంతో చాలా మంది తమను తాము (బీజేపీలో చేరిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు) రాజీపడి అమ్ముకున్నారు. కానీ లేకిన్ ఇస్ దేశ్ కా చాత్రా, యువా నహీ బికా హై (ఈ దేశ యువత, విద్యార్థులు తమను తాము అమ్ముకోలేదు)” అని పేర్కొన్నారు. నేను ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీలో దిగడానికి కొద్ది క్షణాల ముందు “స్వేచ్ఛతో నా జీవితంలోని చివరి క్షణాలు ఇవేనని అనుకున్నాను. ఈ ఆశయం కోసం నా స్వేచ్ఛను పూర్తిగా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ దేశ యువత ఇకపై భయపడదు. వారు పోరాడతారు. బొద్దింకలు భయపడవు. అవి ఎప్పటికీ చావవు” అని అభిజిత్ స్పష్టం చేశారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థలలో మార్పులు అవసరం:
సోనమ్ వాంగ్‌చుక్
ప్రస్తుత విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని పరార్యవరణ, విద్యా వేత్త సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. సిజెపి ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ఆయన మాట్లాడారు. ‘‘ప్రస్తుత విద్యా వ్యవస్థలలో మార్పులు అవసరం. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి. దీనివల్ల అర్థవంతమైన సంస్కరణలు వస్తాయన్నారు. అభిజీత్ దీప్కేను అరెస్టు చేస్తే తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్ష చేస్తానన్ని ప్రకటించారు. న్యాయం కోసం మనం ఇది చేయాలి’’ అని సోనమ్ అన్నారు.
నిరసనలో వామపక్ష నేతలు, సోనమ్ వాంగ్‌చుక్ సహా పలువురు నేతలు
ఈ ఆందోళనలో పర్యావరణ, విద్యా కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అనీ రాజా, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెహినా ఫాతిమా, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షు రాలు అదితి మిశ్రా, సహాయ కార్యదర్శి కె. గోపిక బాబు ప్రభృతులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థ నిర్వీర్యం : ఐషీఘోష్
ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ మాట్లాడుతూ మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజలను విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘‘ఈ ఆందోళనకు వచ్చిన జనాన్ని చూస్తే, ఈ ప్రభుత్వం వల్ల దేశంలోని యువత, విద్యార్థులు ఎంత బాధపడుతున్నా రనేది స్పష్టమవుతోంది. మోడీ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. గత ఏడేళ్లలో 70కి పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయినా ఇంతవరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఈ ఏడాది ఇంత తీవ్రమైన సమస్య ఉన్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారని ఐషే ఘోష్ విమర్శించారు.



