ఉపాధి కోల్పోతున్న సంప్రదాయ బ్యాండ్ కళాకారులు : చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ
వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు :
బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం
రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజ్ నాగరాజ్
ఎస్‌వీకేలో రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – ముషీరాబాద్
బ్యాండ్ వృత్తిలో సాంకేతికత పెరిగి ప్యాడ్ బ్యాండ్‌కు ప్రజాదరణ లభించినప్పటికీ, అదే ప్రస్తుతం సంప్రదాయ బ్యాండ్ కళాకారులకు శాపంగా మారిందని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ, బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజ్ నాగరాజ్ అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారంబ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అనంతరం రమణ మాట్లాడుతూ.. ఈ నెల 16న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో పెండ్లీలు, బరాత్‌లు, బోనాలు, వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపులు తదితర శుభకార్యాల్లో బ్యాండ్ కళాకారుల ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ బ్యాండ్ వాయిద్యాల ధ్వని, కర్రపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. అలాంటి కళాకారులు ప్రస్తుతం సాంకేతిక పరిణామాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
గుమ్మడి రాజ్ నాగరాజ్ మాట్లాడుతూ.. శుభకార్యాలు, ఉత్సవాల్లో బ్యాండ్ వాయిద్యాల ధ్వని ప్రజలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతుందని చెప్పారు. ప్యాడ్ బ్యాండ్‌లకు ప్రజాదరణ పెరిగినా, వాటి కారణంగా సంప్రదాయ కళాకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డీజేలపై విధించినట్టే ప్యాడ్ బ్యాండ్‌లపై కూడా ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వాహనాలు కనిపించిన వెంటనే స్వాధీనం చేసుకోవడం, కళాకారులపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. బరాత్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత సౌండ్ సిస్టమ్ ఉపయోగించకపోయినా, తిరుగు ప్రయాణంలో పోలీసులకు కనిపిస్తే వాహనాలను సీజ్ చేస్తున్నారని విమర్శించారు. సీజ్ చేసిన వాహనాలను నెలల తరబడి విడుదల చేయకపోవడంతో కళాకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌండ్ పొల్యూషన్ నియంత్రణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, ఆర్. శేఖర్, వి. శ్రీనివాస్, ప్రవీణ్, అనిల్, రాజు, జి. శ్రీనివాస్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
బ్యాండ్ వృత్తిలో పెరిగిన సాంకేతికత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



