– పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు
– వారి అంకిత భావం, వెబ్‌కాస్టింగ్ చాలా తోడ్పడింది : డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్ ఎం. భగవత్‌తో కలిసి ఆయన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్ ద్వారా నేరుగా వీక్షిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు.వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోలింగ్ స్టేషన్ల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలిగిందనీ, ఈ కెమెరాల నిఘా కారణంగానూ, పోలీస్ సిబ్బంది బందోబస్తు వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అదుపులో ఉన్నాయన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంలో పోలీసు సిబ్బంది అంకిత భావంతో పాటు ఈ ఆధునిక వెబ్‌కాస్టింగ్ సాంకేతికత ఎంతగానో తోడ్పడిందని ఆయన ప్రశంసించారు. ఈ ఎన్నికల కోసం తెలంగాణ పోలీసులు అత్యంత పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని డీజీపీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8203 పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తూ భారీ ఎత్తున భద్రతను కల్పించామన్నారు. వీటిలో 1302 అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్), 1926 సమస్యాత్మక (సెన్సిటివ్), 4975 సాధారణ కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్టు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాల నుంచి సుమారు 3000 మంది అదనపు బలగాలను రప్పించామనీ, ఇందులో టీజీఎస్పీ, ఫారెస్ట్, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ విభాగాలు ఉన్నాయని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వెలుపల వంద శాతం వెబ్‌కాస్టింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నామనీ, దీనితో ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
వృద్ధులు ఓట్లు వేసేలా పోలీసుల సహాయం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీసు సిబ్బంది సహాయం చేశారు. నిజామాబాద్‌లో సీపీ పి. సాయిచైతన్య, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, వనపర్తి జిల్లా ఎస్పీ సునీతరెడ్డి, పెద్దపల్లి డీసీపీ బి రామ్‌రెడ్డి వృద్ధ ఓటర్లను, వికలాంగులను వీల్‌చైర్‌లో పంపించారు. ములుగు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న నాలుగో బెటాలియన్ సిబ్బంది మూర్చ వచ్చి పడిపోయిన ఓటరుకు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న వృద్ధ ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓట్లు వేసేలా సహాయ పడ్డారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండల పరిధికి చెందిన రాలకత్వలో వృద్ధులను ఆటోలు తీసుకెళ్లి ఓట్లు వేసేలా తోడ్పాటు అందించారు. మహబూ బాబాద్ జిల్లాలో ఓటర్ల పసిపిల్లలను వారు ఓటేసి వచ్చే వరకు శ్రద్ధగా పోలీస్ సిబ్బంది చూశారు.
మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



