Tuesday, June 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంఎల్బి కప్ (అండర్-11) ఇండియా పోటీలకు తొర్లికొండ జట్టు

ఎంఎల్బి కప్ (అండర్-11) ఇండియా పోటీలకు తొర్లికొండ జట్టు

- Advertisement -

అభినందించిన గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజు, మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

ఏప్రిల్ 23 నుండి 26 వరకు ఆర్మూర్ మినీ స్టేడియం క్రీడా మైదానంలో జరిగిన ఎం ఎల్ బి తెలంగాణ రీజినల్ పోటీలలో జక్రం పెళ్లి మండలంలో తొర్లికొండ జట్టు పాల్గొని గ్రూప్-ఏలో ప్రథమ స్థానంలో నిలిచి, ఈ నెల 10 నుండి 14 వరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరగనున్న ఎం ఎల్ బి (మేజర్ లీగ్ బేస్‌బాల్) అండర్-11 ఇండియా కప్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. గత పది రోజులుగా పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులు ఈరోజు బెంగళూరుకు బయలుదేరుతున్న సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, “చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గొప్ప విషయం. క్రీడలు పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయి. తొర్లికొండ విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ శిక్షణలో ఎంతో పట్టుదలతో సాధన చేసి ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయం. బెంగళూరులో జరిగే ఇండియా కప్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు,  అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజు మాట్లాడుతూ, “మన గ్రామానికి చెందిన చిన్నారులు జాతీయ స్థాయి క్రీడా వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. క్రీడలు పిల్లలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆత్మవిశ్వాసాన్ని, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయి. తొర్లికొండ జట్టు బెంగళూరులో జరిగే ఇండియా కప్ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసి గ్రామానికి, మండలానికి, రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని కోరుకుంటున్నాను. క్రీడల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తాము” అని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు.

ప్రత్యేకత ఏమిటంటే బెంగళూరులో జరుగుతున్న ఈ పోటీలలో దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, పూణే, ముంబై తదితర నగరాల నుండి మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా, వాటిలో 11  ప్రైవేట్ పాఠశాలలకు చెందిన జట్లే కావడం విశేషం. నిజామాబాద్ జిల్లా నుండి ఎంపికైన రెండు జట్లలో తొర్లికొండ ప్రభుత్వ పాఠశాల జట్టు ఒకటిగా నిలవడం జిల్లా క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచింది. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గంగా జమున మనోహర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్, ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, డాక్టర్ నరసింహారావు, కృష్ణ, ఓఎస్ లలిత మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్, అసిస్టెంట్ కోచ్‌గా సీనియర్ క్రీడాకారుడు సాయికుమార్ వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -