నవతెలంగాణ-విలేకరులు
మున్సిపల్ ఎన్నికల వేళ పలు జిల్లాల్లో వింతలు విశేషాలు చోటుచేసుకున్నాయి. నడవలేని స్థితిలోనూ వృద్ధులు ఎన్నికల్లో తమ ఓటు ను వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు.
కన్నీటిలోనూ కర్తవ్యం
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 18వ వార్డుకు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి తన తల్లి రాజ్ బీ మరణించినా పుట్టెడు ద్ణుఖాన్ని దిగమింగి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తల్లి అంత్యక్రియల కంటే ముందే తన పౌర బాధ్యతను నెరవేర్చిన ఇస్మాయిల్‌ను స్థానికులు అభినందించారు.
మా ఓటు ఎవరు వేశారో..
మొదటిసారి వచ్చిన ఓటును వినియోగించుకుందామని ఎంతో సంతోషంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన యువతులకు వారు ఓటు వేరే వాళ్లు వేశారన్న సమాచారంతో కంగుతిన్నారు. వికారాబాద్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన చందన అనే యువతి ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా.. అక్కడ ఉన్న అధికారులు అప్పటికే మీ ఓటు వేసినట్టు ఉందని చెప్పడంతో ఆమె అధికారులను నిలదీసింది. సరైన పత్రాలు చూడకుండా ఓటు ఎలా వేయనిస్తారని ప్రశ్నించింది.
మొదటిసారి ఓటు వేద్దామని ఎంతో ఆశతో వచ్చానని, కానీ తన ఓటు లేకపోవడం చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యానని అన్నారు. యువతి తండ్రి సత్యనారాయణ పోలీసు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలోని 15 వార్డులో ఓటు వేసేందకు వెళ్లిన క్యామ పారిజాతకు అప్పటికే తన ఓటు పోల్ అయినట్టు అధికారులు చెప్పడంతో షాకయింది. తన ఓటు ఎవరు వేశారనేది అధికారులు తేల్చాలని డిమాండ్ చేసింది.
అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేసిన వృద్ధులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన అయిత యశోద (80)కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన ఓటును వదులుకోవడం ఇష్టం లేక ఆమె పట్టుబట్టారు. దాంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్ సాయం తో ఆమెను హుజూరాబాద్‌లోని 41వ పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ముక్కుకు ప్రాణవాయువు గొట్టాలు ఉన్నప్పటికీ, ఏమాత్రమూ తడబడకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఆమె తన ఓటు వేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ప్రమీలమ్మ (80), అదే కాలనీకి చెందిన మస్తాన్ సాబ్ (79) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 23వ వార్డులోని 75వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి అంబులెన్స్‌లో వచ్చిన ప్రమీలమ్మ తీవ్ర అనారోగ్యంతో పోలింగ్ కేంద్రంలోకి రాలేని పరిస్థితిని నెలకొంది. అలాగే, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న మస్తాన్ సాబ్‌ను వారి కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు తీసుకువచ్చారు. గమనించిన ఎన్నికల అధికారులు అంబులెన్స్‌లోనే పోలింగ్ అధికారి సమక్షంలో వారితో ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు.
యూరప్ నుంచి వచ్చి ఓటు వేసిన యువతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాల్టీలోని 2వ వార్డుకు చెందిన మానుకోట మాధురి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు యూరప్ ఖండంలోని మాల్టా దేశం నుంచి సత్తుపల్లికి చేరుకొని ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈమె తల్లి మానుకోట మంగతాయారు 2వ వార్డు జనరల్ మహిళ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు.




