Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీవన్‌రెడ్డి వెళ్లినా మేము పార్టీతోనే

జీవన్‌రెడ్డి వెళ్లినా మేము పార్టీతోనే

- Advertisement -

సీఎంతో జగిత్యాల కాంగ్రెస్‌ నేతలు
మొండి పట్టుదలతో ఆయన పార్టీని వీడారు : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడినా మేము పార్టీతోనే ఉంటామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళతామన్న తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా పని చేస్తామని భరోసా ఇచ్చారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో వారు తెలిపారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ జీవన్‌రెడ్డిని తక్కువ చేసి చూడలేదని చెప్పారు. మొండి పట్టుదలతో జీవన్‌ రెడ్డి పార్టీని వీడారని తెలిపారు. 40 ఏండ్లు ఆయన కోసం పని చేసిన కార్యకర్తలను మోసం చేసి..దుర్మార్గుడైన కెేసీఆర్‌తో ఆయన జత కట్టారని విమర్శించారు. ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన్ను కరీంనగర్‌ నుంచి పోటీ చేయాలని కోరితే, ఆయన నిజామాబాద్‌ను ఎంపిక చేసుకున్నా…పార్టీ ఆయనకు టికెట్‌ ఇచ్చిందని చెప్పారు. అక్కడి నుంచి ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా జీవన్‌రెడ్డి సూచించిన వారికే టికెట్లు ఇచ్చామన్నారు. భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా వినలేదని తెలిపారు. జీవన్‌రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్‌ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరమని చెప్పారు. జగిత్యాల కాంగ్రెస్‌ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్‌రెడ్డి కేసీఆర్‌ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆయన వయసుకు, అనుభవానికి ఇది తగదని హితవు పలికారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజరుకుమార్‌, జగిత్యాల డీసీసీ అధ్యక్షులు నందయ్య, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -