Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ- బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు

బీజేపీ- బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు

- Advertisement -

ఓటమి భయంతోనే పోలీసులపై దాడులు, ఘర్షణలు
మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం


నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్‌ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విపక్షాల వైఖరిని ఎండగట్టారు. రెండు పార్టీలు లోపాయికారీగా ఒక్కటయ్యాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటై ఎన్నికల వాతావరణాన్ని అపహాస్యం చేశాయి. ఎక్కడికక్కడ ఘర్షణలు సృష్టించడం, భౌతిక దాడులకు దిగడం చూస్తుంటే వారి ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. నిజామాబాద్‌ ఎంపీ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత దారుణం. పోలీసులపై దాడులు చేస్తూ, వారిని బెదిరిస్తూ అరాచకం సృష్టించారు’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

12 ఏండ్లలో ఏం చేశారు..?
బీజేపీ విడుదల చేసిన ఎన్నికల ప్రకటనలపై స్పందిస్తూ.. ’12 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మున్సిపాలిటీలను ఇప్పుడే అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇన్ని రోజులు ఎందుకు నిధులు ఇవ్వలేదు? పట్టణ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? తెలంగాణ అంటేనే వివక్ష చూపే ప్రధాని మోడీకి, రాష్ట్రానికి పైసా విదిల్చని కేంద్ర మంత్రులకు ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మంత్రి అన్నారు. అధికారం కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతూ లబ్ది పొందాలని చూడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.

ఇదే సమయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ వైఖరిపై పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఐదేండ్లు మంత్రిగా ఉండి స్మార్ట్‌ సిటీ పేరుతో భూకబ్జాలు చేశారే తప్ప, నగరాన్ని అభివృద్ధి చేయలేదు. ఓ మాజీ మంత్రి పోలీస్‌ జీపులో నుండి ఒకరిని గుంజి లాగడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్‌ వైపే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 80 శాతానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురబోతోంది’ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహా జిల్లా కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -