పర్యావరణం దెబ్బతింటోందంటూ ఆందోళనలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తాజా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. దానిని ‘మధ్యధరా సముద్రం మధ్యలో నమ్మశక్యం కాని అందమైన 1,400 హెక్టార్ల ద్వీపం’గా ఆమె అభివర్ణించారు. రిసార్టులు, హోటళ్ల కోసం ఐదు మైళ్ల అల్బేనియన్ తీరాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. ఇవాంకా, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులో ద్వీపానికి ఎదురుగా తీరం వెంబడి ఉన్న సురక్షిత సహజ ప్రాంతం కూడా భాగంగా ఉంది. అయితే ఈ ప్రాంతం ఇప్పటికే పర్యావరణ పరంగా దెబ్బతిన్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాజధాని టినారాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన కూడా జరిగింది. తమ ఆవాసాలకు ముప్పు వాటిల్లుతోందని ఆరోపిస్తూ నిరసనకారులు ఫ్లెమింగో పక్షుల గులాబీ రంగు కార్డ్‌బోర్డ్ కటౌట్‌లను ప్రదర్శించారు. ఐరోపాలో అతి తక్కువ తలసరి జీడీపీ రేటును కలిగిన దేశాలలో ఒకటైన అల్బేనియాలో కూడా నిరసనలు మిన్నంటాయి. ఇవాంకా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టును చూసేందుకు కొందరు పర్యావరణవేత్తలు వెళ్లగా ఎక్సవేటర్లు బీచ్‌ని తవ్వేస్తున్నాయి. ట్రక్కులలో కంకర రవాణా జరుగుతోంది. ‘రోడ్డును తవ్వుతున్న ప్రదేశం వద్ద కానీ, యంత్రాలు పనిచేస్తున్న బీచ్ వద్ద కానీ లైసెన్సులు, అనుమతులు లేకుండా పనులు జరిగిపోతున్నాయి. అసలు ఆ పనులు ఎవరు చేస్తున్నారనే సమాచారం కూడా లేదు’ అని పర్యావరణవేత్తలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొదటి భాగమైన సజాన్ ద్వీపం ఒకప్పుడు కమ్యూనిస్టుల కాలం నాటి సైనిక స్థావరం. రెండో భాగమైన నార్టా అని పిలిచే పిషే పోరో సముద్ర తీరం. ఇది 200కు పైగా పక్షి జాతులు, తాబేళ్లు, ఫ్లెమింగోలు, పెనికాన్లకు నిలయం. ఇవాంకా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది బడాబాబులు, సంస్థలు ముందుకు వస్తున్నాయి. తన మామ అయిన దేశాధ్యక్షుడికి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కుష్నర్ తన వ్యక్తిగత లావాదేవీల ద్వారా పరస్పర విరుద్ధ ప్రయోజనాల సమస్యను సృష్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలకు చెందిన ప్రభుత్వ పెట్టుబడుల నిధుల నుంచి ఆయన పెద్ద ఎత్తున మద్దతు పొందారు. కాగా జపాన్, డెన్మార్క్, గ్రీస్, ఫ్రాన్స్‌కు చెందిన పెట్టుబడిదారులు ఈ ప్రాజె క్టులో భాగస్వాములు. ప్రాజెక్టును సమర్ధిస్తున్న వారు మాత్రం పర్యావరణ ప్రభావంపై ఇంకా పరిశీలన జరుగుతోందని చెబుతున్నారు. అయితే ప్రాజెక్టుపై మాత్రం అనేక వారాలుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుమతులు చూపించాలని, తీర ప్రాంత రక్షణకు సాయపడాలని ఆందోళనకారులు శాసనకర్తలను కోరుతున్నారు.



