వాషింగ్టన్ : వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ జర్నలిస్టుల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా వేసి ఉంచాలని అమెరికా విదేశాంగ శాఖ యోచిస్తోంది. ఇమ్మిగ్రేషన్, వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇది కూడా ఓ భాగమే. దేశంలో ప్రవేశించాలని కోరుకునే అంతర్జాతీయ పాత్రికేయులకు ఇది మరో అడ్డంకి కాబోతోంది. పలు వీసా కేటగిరీల కింద దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించేందుకు ఇప్పటికే ఓ కార్యక్రమం అమలులో ఉంది. విదేశీ మీడియా ప్రతినిధులను కూడా చేర్చి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలియజేసింది. కెనడా, మెక్సికో ఉద్యోగులు ఉపయోగిస్తున్న మరో వీసా కేటగిరీ దరఖాస్తుదారులకు కూడా ఈ కార్యక్రమం వర్తిస్తుంది. ఈ ప్రక్రియను విదేశాంగ శాఖ ‘ఆన్‌లైన్ ఉనికి పరిశీలన’గా చెబుతోంది. ప్రవేశం కోరుతున్న విదేశీయులు అమెరికా వీసా అవసరాలను నెరవేరుస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించడమే దీని ఉద్దేశమని వాదించింది. ప్రవేశాలకు సంబంధించిన అమెరికా చట్టాలు, షరతులకు దరఖాస్తుదారులు కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు సాధ్యమైనంత గరిష్ట స్థాయిలో విదేశీయులను అధికారులు తనిఖీ చేస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. అమెరికా భద్రత, ప్రజల రక్షణ, దేశ ప్రయోజనాలకు ముప్పు కలిగించే వారిని గుర్తించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని విదేశాంగ శాఖ తెలిపింది.
విదేశీ జర్నలిస్టుల సోషల్ మీడియాపై అమెరికా నిఘా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



