Saturday, September 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాపై కఠిన ఆంక్షల బిల్లుపై ట్రంప్‌ సంతకం

రష్యాపై కఠిన ఆంక్షల బిల్లుపై ట్రంప్‌ సంతకం

- Advertisement -

భారత్‌కు 100 శాతం టారిఫ్ ముప్పు..!
వాషింగ్టన్‌ : రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలపై అత్యధికంగా 100 శాతం వరకు సుంకాలు విధించే నూతన ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు. ఈ చట్టాన్ని అమలు చేసే విషయంలో ట్రంప్ యంత్రాంగానికి విస్తృతమైన అధికారాలు లభించాయి. దీంతో భారత్, చైనా దేశాలు తీవ్రమైన అమెరికా సుంకాల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నూతన చట్టం ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా ముడిచమురు లేదా గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై 30 రోజుల్లోపు 100 శాతం వరకు టారిఫ్‌లు విధించడానికి వీలుంటుంది. అదే విధంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలు లేదా రష్యా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి సహకరిస్తున్న టాప్-5 దేశాలను కూడా ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. భారత్, చైనా దేశాలు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న ప్రధాన దేశాల జాబితాలో ఉన్నప్పటికీ ఈ బిల్లులో నిర్దిష్ట దేశాల పేర్లను స్పష్టంగా పేర్కొనలేదు. అలాగే టాప్-5 జాబితాను ఏ ప్రాతిపదికన లెక్కిస్తారనే దానిపై కూడా స్పష్టత లేదు. దీనివల్ల ఏ దేశాలపై సుంకాలు విధించాలనే అంశంపై ట్రంప్ యంత్రాంగానికి పూర్తి విచక్షణాధికారం లభించింది.

నవంబర్‌లో మధ్యకాలిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వినియోగదారులపై భారం పడకుండా, ఇంధన ధరలు పెరగకుండా ట్రంప్ ఈ నిర్ణయం అమలులో కొంత సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత 40 ఏళ్లలో కార్యనిర్వాహక శాఖకు కాంగ్రెస్ కొత్త టారిఫ్ అధికారులను కట్టబెట్టడం ఇదే మొదటిసారని వైట్‌హౌస్ లెజిస్లేటివ్ డైరెక్టర్ జేమ్స్ బ్రైడ్ తెలిపారు. కాగా ఏ దేశాలను లక్ష్యంగా చేసుకుంటారనే దానిపై స్పష్టత లేకపోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్, బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు నేషనల్ ఫారిన్ ట్రేడ్ కౌన్సిల్ ఉపాధ్యక్షురాలు జెనెట్ చు తెలిపారు. కొత్త టారిఫ్‌లు తమ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయని భారత్ ఇప్పటికే హెచ్చరించగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లులోని నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, అధ్యక్షుడు తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కొందరు న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -