388.5 ఎకరాలకు హద్దులు గుర్తింపు
100 మంది రైతులకు నోటీసులు
రేపు ఆధారాలతో హాజరు కావాలని అధికారుల సూచన
150 ఎకరాలు మావే అంటున్న వెంకటాపూర్ గ్రామస్తులు
నవతెలంగాణ-మర్కుక్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో 325 సర్వే నంబర్ లోని 388.5 ఎకరాల భూములకు సర్వే పూర్తయిందని, హద్దులు గుర్తించినట్టు శనివారం రెవెన్యూ అధికారులు తెలిపారు. సర్వే పరిధిలో భూములు కలిగిన సుమారు 100 మంది రైతులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న రైతులు సోమవారం తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర భూ హక్కులకు సంబంధించిన ఆధారాలతో అధికారుల ఎదుట హాజరు కావాలని సూచించారు. క్షేత్రస్థాయి కొలతలతోపాటు అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూముల హక్కులు, హద్దుల వివరాలను నిర్ధారించనున్నట్టు అధికారులు తెలిపారు. సర్వే ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఐ, సర్వేయర్లు, తదితరులున్నారు.
150 ఎకరాల భూమిమాదే శివారు వెంకటపూర్ గ్రామస్తుల ఆరోపణ
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల సర్వే మరో మలుపు తిరిగింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని 325 సర్వే నెంబర్‌లోని 388 ఎకరాల భూముల్లో 150 ఎకరాలు మావే అంటూ శివారు వెంకటాపూర్ గ్రామస్తులు కొత్త వాదన చేస్తున్నారు. కేసీఆర్ వచ్చాకే మా భూములు మార్చారని ఆరోపించారు. శనివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ.. గ్రామంలోని ఆయా సర్వే నంబర్లకు సంబంధించిన నక్షాలను మార్చి 325 కిందకు కలిపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీడియా ముందు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్న సర్వేతో మాకు మేలు జరుగుతుందనే నమ్మకం ఉందని గ్రామస్తులు తెలిపారు. సర్వే నంబర్ 41లో 27 ఎకరాల 23 గుంటలు, సర్వే నంబర్ 85లో 73 ఎకరాల 12 గుంటలు, సర్వే నంబర్ 88లో 6 ఎకరాల 28 గుంటలు, సర్వే నంబర్ 89లో 9 ఎకరాలు, సర్వే నంబర్ 100లో రెండె కరాలు, సర్వే నంబర్ 101, 162లో కూడా ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. శివారు వెంకటపూర్ గ్రా మాన్ని మొత్తం కొల్లగొట్టి ఎర్ర వల్లి సర్వే నంబర్లలో జమ కట్టా రని ఆవేదన వ్యక్తం చేశారు. తాతల నాటి నుంచి ఉన్న నక్షలను సర్వే నంబర్లను మార్చి కేసీఆర్ ఇబ్బందులకుగురి చేశారంటూ వ్యాఖ్యా నించారు.



