Saturday, September 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎల్ నినో రాష్ట్రంలోనే ఉందా!

ఎల్ నినో రాష్ట్రంలోనే ఉందా!

- Advertisement -

ఆంధ్రా, కర్నాటకలో లేదా.?
ప్రకృతిది కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువు
రేవంత్ రెడ్డిది అసమర్థ పాలన..ఎకరం ఎండినా సీఎందే బాధ్యత
పార్టీ ఫిరాయింపులో హైకోర్టు తీర్పు చెంపపెట్టు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వనపర్తి జిల్లాలో జూరాల కాలువ, సబ్ స్టేషన్ల పరిశీలన

నవతెలంగాణ- పెబ్బేరు
​‘ఎల్ నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా! ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాలలో లేదా.? రైతులకు నీళ్లు ఇవ్వలేని రేవంత్ రెడ్డిది.. అసమర్థ పాలన. ఎకరం పొలం ఎండినా సీఎందే బాధ్యత. ఇది ప్రకృతి తెచ్చినది కాదు.. కాంగ్రెస్‌ ‌తెచ్చిన కరువు’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. శనివారం కొల్లాపూర్ పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో పర్యటించిన కేటీఆర్‌ ‌జూరాల కాల్వలల్లోని నీటిని పరిశీలించారు. ఈ సందర్బంగా మాజీ మున్సిపల్ చైర్మెన్‌ కరుణశ్రీ సాయి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఎల్ నినో పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, పంటలకు సాగునీరు ఇవ్వకపోవడమే కాకుండా విద్యుత్ కోతలతోనూ పంటలు ఎండిపోతున్నాయన్నారు. జూరాల డ్యామ్ లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ కు ఎగువ ఉన్న పోతిరెడ్డిపాడు వెలిగొండ ప్రాజెక్టులకు 100 టీఎంసీల నీరు విడుదల చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సాగుకు కృష్ణా జలాలను పాలమూరు రైతులకు ఇవ్వలేకపోతుందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి నీటిని జూరాలకు తరలించవచ్చు కదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల వద్ద ఐదు మీటర్ల ఎత్తు పెంచడానికి కర్నాటక ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనేక రిజర్వాయర్లకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ను రూ.84 వేల కోట్లతో 40 టీఎంసీల నీటి కోసం కేసీఆర్ నిర్మిస్తే దానికి రేవంత్‌‌రెడ్డి కాకిగోల చేస్తున్నారని విమర్శించారు.

కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీరు పోతుంది, కానీ పైన ఉన్న తెలంగాణకు నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఇది కేవలం గురువు మీద ఉన్న ప్రేమతోనే రేవంత్ రెడ్డి ప్రశ్నించడం లేదని విమర్శించారు. అత్యల్పంగా కృష్ణా నీటిని వినియోగించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే అని అన్నారు. కల్వకుర్తి లిప్టులను కొనసాగించకుండా రైతులకు సాగునీరు అందించకుండా ప్రభుత్వమే ఇబ్బందులు పెడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 6 గంటలు కూడా సరఫరా చేయడం లేదన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు. తొలి వికెట్ దానం నాగేందర్ అని, మిగతా వారిని కూడా తొందర్లోనే పడగొడతామన్నారు. పార్టీ ఫిరాయించిన వారందరూ రాజీనామా చేసి గెలవాలన్నారు. మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, ప్రజల కష్టాలన్నీ తీరుస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు గట్టు యాదవ్, పెబ్బేరు మండల పట్టణ పార్టీ అధ్యక్షులు వనం రాములు, దిలీప్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు కరుణశ్రీ, హరి శంకర్ నాయుడు, సౌజన్య, మన్యం, పార్టీ నాయకులు కర్రే స్వామి, పెద్దింటి వెంకటేష్, సాయి, విశ్వరూపం తదితరులు పాల్గొన్నారు.

ఎకరం ఎండినా సీఎందే బాధ్యత
రైతాంగం సాగు చేసిన పంటలకు నీళ్లు ఇవ్వడం లేదనీ, ఎకరం ఎండినా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని కేటీఆర్‌ హెచ్చరించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం, పెబ్బేరు సబ్ స్టేషన్లు పరిశీలించారు. పెబ్బేరు సబ్ స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున రైతులతో ర్యాలీగా వచ్చారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ పర్యటన కొనసాగింది. పెబ్బేరులో పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం ఆరు గంటలు మాత్రమే ఇచ్చి దగా చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోని రైతులే ఆందోళన చేస్తున్నారని దానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎల్‌నినో ప్రభావం అని చెప్పడం సిగ్గుచేటన్నారు. పాలమూరు ముఖ్యమంత్రిని ప్రజలు తీసుకొస్తే ఆయన పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టారని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నాయకులు గట్టు యాదవ్, మండల, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -