– పాల్గొన్న రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని,నూతన విత్తన చట్టం,విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉపాధి హమిచట్టాన్ని పునరుద్దరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతం అయింది. నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోఅశ్వారావుపేట లో పలు సంఘాల కార్యకర్తలు, నాయకులు ప్రదర్శనలు చేపట్టారు.
ప్రదర్శన అనంతరం అంగన్వాడీ టీచర్లు సంఘం నాయకురాలు కట్టా రాధా అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కే.పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విత్తన చట్టం ప్రకారం ఇతర దేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకోవడం వల్ల వ్యవసాయం పెనుబారమై వినియోగదారులపై విపరీతమైన బారాలు పడతాయని,విద్యుత్ చట్టం ప్రకారం కరెంట్ బిల్లులు విపరీతంగా పెరుగుతాయని అన్నారు.సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ కార్మిక వర్గం నాడు ప్రాణ త్యాగాలు చేసి పోరాడి సాధించిన చట్టాలను మార్చివేసి పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరచడానికే కార్మికోడ్లు తెచ్చారని, కార్మిక కోడ్లు రద్దు అయ్యేంతవరకు అలుపెరగని పోరాటాలు నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ ,సీఐటీయూ మండల నాయకులు ఏసు,వినోద్,సుభాని సీత,కృష్ణవేణి,వెంకటరమణ,రాజేశ్వరి,నాగమణి,భారతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



