Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవర్కింగ్‌ జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాల్సిందే

వర్కింగ్‌ జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాల్సిందే

- Advertisement -

జాతీయ సమ్మెలో ఫెడరేషన్‌ నేతలు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్‌ల పేర రద్దుచేసిన రెండు వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. మోడీ ప్రభుత్వం ఇష్టానుసారం తెచ్చిన లేబర్‌కోడ్‌లను వెంటనే ఉపసంహరించాలని కోరింది. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన జాతీయ సమ్మెలో టీడబ్ల్యూజేఎఫ్‌ పాల్గొంది. ఈ సమ్మెకు భారీ సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ర కన్వీనర్‌ పి.రాంచందర్‌, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలను అడిగే హక్కును లేబర్‌కోడ్‌లు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఉన్న రెండు చట్టాలను రద్దుచేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం సమాజం కోసం పనిచేస్తున్న పాత్రికేయులను లేబర్‌కోడ్‌ల పేర ఇబ్బందులు పెట్టడం సహించరాదని అభిప్రాయపడ్డారు.

కనీస వేతనం రూ. 26 వేలను అమలుచేయించాలని కోరారు. జస్టిస్‌ మతీజియా వేజ్‌బోర్డులు సిఫారసులను సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కనబెట్టాయని సూచించారు. తాజా కోడ్‌లతో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, జర్నలిస్టులు బేరసారాలు చేసే అవకాశాన్నీ, అధికారాన్నీ కోల్పోతారని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నదన్నారుదేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలు, జిల్లాల్లో సమ్మె సక్సెస్‌ అయిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఆందోళనలో ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి, హచ్‌యూజే అధ్యక్షులు బి. జగదీశ్వర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మాటలు, చేతలకు పొంతన లేకుండా పోయిందన్నారు. ధర్నాలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి. రాజశేఖర్‌, కార్యదర్శులు ఎస్‌.కె సలీమ, కొప్పు నిరంజన్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మణిమాల, నాయకులు అజయ్, మోహన్‌కృష్ణ, శశికల, రమాదేవి, మళ్లీశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -