- జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్
నవతెలంగాణ-పెద్దవంగర: గంజాయి రహీత సమాజ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ఉప్పెరగూడెం గ్రామంలో సర్పంచ్ దుంపల శ్రీదేవి కుమారస్వామి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగం వల్ల యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. వ్యవసాయ సాగు లో రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. పంట అవశేషాలకు నిప్పు పెట్టకూడదన్నారు. పంటల మార్పిడితోనే అధిక దిగుబడి సాధ్యం అన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరిస్తూ నానో యూరియా, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు.
ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలు వాటిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, గ్రామ, వార్డు, మండల, జిల్లా స్థాయిలో సభలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించామని తెలిపారు. పెన్షన్లు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్, తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్, వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్, ఎంఈవో బుధారపు శ్రీనివాస్, వైద్యాధికారి డాక్టర్ నందనా దేవి, ఆయా శాఖల ఏఈలు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.



