Thursday, June 11, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యా విధానంపై మేనిఫెస్టోను విడుదల చేయనున్న కాక్రోచ్ జనతా పార్టీ

విద్యా విధానంపై మేనిఫెస్టోను విడుదల చేయనున్న కాక్రోచ్ జనతా పార్టీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తాము విద్యా విధానానికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం వెల్లడించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను నివారించడం, పరీక్షా ఫలితాలను సకాలంలో ప్రకటించడం, నియామకాలు, ప్రవేశ పరీక్షల్లో పారదర్శకతను మెరుగుపరచడం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, పరీక్షల నిర్వహణలో జాప్యం, అవకతవకల కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ఈ మ్యానిఫెస్టో దృష్టి సారిస్తుందని అన్నారు. పరీక్షల్లో అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో నేడు పూణెలో దేశవ్యాప్త నిరసనను ప్రారంభించనున్నట్లు సిజెపి ప్రకటించిన సంగతి తెలిసిందే.

సావిత్రిబాయి పూలె పూణె యూనివర్శిటీ ప్రాంగణంలో సాయంత్రం శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, ఈ నిరసనలో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ కూడా పాల్గొంటారని దీప్కే తెలిపారు. ఈ నిరసన శాంతియుతంగా, రాజ్యాంగ పరిధికి లోబడి ఉంటుందని అన్నారు. నేడు పూణెలో దేశవ్యాప్త నిరసనను ప్రారంభించి, జైపూర్, లక్నో, అమృత్ సర్, బెంగళూరు వంటి నగరాల మీదుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లి, చివరగా జూన్ 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ లో సమావేశమవుతామని అన్నారు. కోటిమందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడానికి కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తాము వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు.

ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే చర్చలు జరపడానికి బదులుగా ప్రభుత్వం సిజెపి సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తోందని మండిపడ్డారు. సిజెపి దేశానికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తోందని, ప్రభుత్వం యువతను విస్మరించలేదని అన్నారు. తమని నకిలీ అని ముద్ర వేయడానికి బదులుగా, దేశంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని కేంద్రానికి సూచించారు. ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జూన్ 6న సిజెపి నిరసన చేపట్టింది. పోటీ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలపై జవాబుదారీ తనాన్ని కోరారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రవిద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -