Saturday, February 14, 2026
E-PAPER
Homeఆటలుకంగారూను కొట్టేశారు

కంగారూను కొట్టేశారు

- Advertisement -

ఆసీస్‌పై జింబాబ్వే సంచలన విజయం

టీ20 ప్రపంచకప్‌లో అతిపెద్ద సంచలనం. గ్రూప్‌ దశ మ్యాచ్‌ల్లో అగ్రజట్లకు పసికూనలు గట్టి పోటీ ఇస్తూ వస్తుండగా.. శుక్రవారం ఏకంగా మాజీ చాంపియన్‌, అగ్రజట్టు ఆస్ట్రేలియాకు దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. పసికూన జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన జింబాబ్వే.. గ్రూప్‌-బి సూపర్‌8 సమీకరణాలను ఆసక్తికరం చేసింది. గ్రూప్‌ దశలో జింబాబ్వేకు ఇది వరుసగా రెండో విజయం.

కొలంబో (శ్రీలంక) : 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించని జింబాబ్వే.. 2026 టీ20 ప్రపంచకప్‌లో ప్రపంచ క్రికెట్‌ మరిచిపోలేని సంచలన విజయం సాధించింది. ఐసీసీ టోర్నమెంట్లతో అత్యంత నిలకడగా రాణించే అగ్రజట్టు ఆస్ట్రేలియాను జింబాబ్వే మట్టి కరిపించింది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజరబాని (4/17) నాలుగు వికెట్లు, బ్రాడ్‌ ఎవాన్స్‌ (3/23) మూడు వికెట్ల ప్రదర్శనతో విజృంభించటంతో 170 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ తరఫున మాట్‌ రెన్షా (65, 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (31, 32 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) పోరాడినా.. కంగారూలకు గర్వభంగం తప్పలేదు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రయాన్‌ బెనెట్‌ (64, 56 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో మెరువగా.. మరువాని (35, 21 బంతుల్లో 7 ఫోర్లు), రియాన్‌ (35, 30 బంతుల్లో 4 ఫోర్లు), సికిందర్‌ రజా (25 నాటౌట్‌, 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. 4 వికెట్లతో ఆసీస్‌ను కకావికలం చేసిన బ్లెస్సింగ్‌ ముజరబాని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలో జరిగిన గ్రూప్‌-డి మ్యాచ్‌లో కెనడాపై యుఏఈ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత కెనడా 150/7 పరుగులు చేయగా.. యుఏఈ 19.4 ఓవర్లలో 151/5 పరుగులు చేసింది.

అయ్యో… ఆసీస్‌!
మాజీ చాంపియన్‌, అగ్రజట్టు ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను గ్రూప్‌ దశ నుంచే ముగించే ప్రమాదంలో పడింది. జింబాబ్వే నిర్దేశించిన 170 పరుగుల ఊరించే లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆస్ట్రేలియా విఫలమైంది. 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. 23 పరుగుల తేడాతో ఊహించని ఓటమి చవిచూసింది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. పవర్‌ప్లేలోనే ఆస్ట్రేలియా కోరలు పీకేసింది. జోశ్‌ ఇంగ్లిశ్‌ (8), కామెరూన్‌ గ్రీన్‌ (0), టిమ్‌ డెవిడ్‌ (0), ట్రావిశ్‌ హెడ్‌ (17)లను ముజరబాని, ఎవాన్స్‌లు వెనక్కి పంపారు. కొత్త బంతితో ఆసీస్‌ శిబిరంలో కంగారూ పుట్టించారు. 29/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న ఆసీస్‌ను మాట్‌ రెన్షా (65), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (31) జోడీ నిలబెట్టే ప్రయత్నం చేసింది.

ఐదో వికెట్‌కు 59 బంతుల్లో 77 పరుగులు జోడించిన రెన్షా, మాక్స్‌వెల్‌లు ఆసీస్‌ను ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. కానీ, మాక్స్‌వెల్‌ వికెట్‌తో ఆసీస్‌ పతనం వేగవంతమైంది. మార్కస్‌ స్టోయినిస్‌ (6), బెన్‌ (6), ఆడం జంపా (2), మాథ్యూ కుహ్నేమాన్‌ (0)లు ఒత్తిడిలో చిత్తయ్యారు. మాట్‌ రెన్షా అర్థ సెంచరీతో పోరాడినా మరో ఎండ్‌ నుంచి సహకారం దక్కలేదు. నాథన్‌ ఎలిస్‌ (7 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. 19.3 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 146 పరుగులకే కుప్పకూలింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఓ పసికూన చేతిలో పరాజయం పాలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -