Friday, April 17, 2026
E-PAPER
Homeఆటలుకోల్‌కతా ఆటతీరు మారేనా..?

కోల్‌కతా ఆటతీరు మారేనా..?

- Advertisement -

– మూడుసార్లు ఛాంపియన్‌
– ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన
– ఐదు మ్యాచుల్లో గెలుపు నిల్‌
కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కెకెఆర్‌)కు అభిమాన గణం ఎక్కువే. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ యాజమాన్యంలోని కెకెఆర్‌ ఆడే మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే అభిమానులతో స్టేడియాలు నిండిపోతాయి. 2012, 2014, 2024లలో టైటిల్స్‌ కైవసం చేసుకున్న కోల్‌కతా.. గత, ఈ సీజన్‌లో ఘోర వైఫల్యాలతో పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టని కెకెఆర్‌.. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్క విజయాన్నీ అందుకోలేదు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి టోర్నీ నుంచి తప్పుకొన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కేమరూన్‌ గ్రీన్‌, ఫిన్‌ అలెన్‌ ఫామ్‌ లేమితో బాధపడుతున్నాడు. ఫినిషింగ్‌ కింగ్‌ రింకు సింగ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. 2024లో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో టైటిల్‌ కొట్టిన కెకెఆర్‌.. ఆ తర్వాత ఏడాది అతడిని విడుదల చేసి ఘోర తప్పిదం చేసింది. ఈ క్రమంలో 2025లో సారథ్య పగ్గాలు అందుకున్న అజింక్య రహానేకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి వెంటాడుతున్నాయి. వరుస ఓటములతో ఇప్పటికే విమర్శల పాలైన రహానే ఆశించిన స్థాయిలో బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. 2024లో 8వ స్థానానికే పరిమితమైన కెకెఆర్‌.. ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లోనూ గెలిచిన దాఖలాలు లేవు. నాలుగు మ్యాచుల్లో పరాజయాల్ని చవిచూడగా.. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 32 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. దీంతో జట్టు వ్యూహాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌ వేలంలోనే అత్యధిక ధర పలికిన ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ కామెరూన్‌ గ్రీన్‌ ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. సీఎస్కేపై అతడు డకౌట్‌ అయిన నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కెకెఆర్‌ యాజమాన్యానికి గట్టి హెచ్చరిక జారీ చేశాడు.

బ్యాటింగ్‌ లైనప్‌ మారాలి
కేకేఆర్‌ జట్టు కూర్పు, బ్యాటింగ్‌ లైనప్‌ మారాల్సిన సమయం ఆసన్నమైంది. 2022, 2023లో 7వ స్థానానికే పరిమితమైన కెకెఆర్‌.. ఆ తర్వాత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచినా.. 2025లో 8వ స్థానంలో నిలిచి పలు విమర్శలను ఎదుర్కొంది. టి20 ప్రపంచకప్‌లో రాణించిన న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌.. ఐపిఎల్‌లో నిరాశపరుస్తున్నాడు. ఆల్‌రౌండర్లు నరైన్‌, గ్రీన్‌తోపాటు మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కూడా విఫలమౌతున్నాడు. బ్యాటర్లకు స్వర్గధామమైన పిచ్‌లపై కూడా కెకెఆర్‌ బ్యాటర్లు విఫలమవుతున్నారు. దీంతో ఈ సీజన్‌లో కెకెఆర్‌ ప్లే-ఆఫ్‌కు చేరడం కష్టమేనని సగటు అభిమానులు భావిస్తున్నారు. కేకేఆర్‌ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 17న అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

అజింక్య రహానేకు జరిమానా
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ అజింక్య రహానే జరిమానాకు గురయ్యాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అతడు జరిమానా వేటు పడింది. ఈ సీజన్‌లో కోల్‌కతా ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమి పాలైంది. చెన్నైతో మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రహానేకు రూ.12 లక్షల జరిమానా వేసినట్లు ఐపిఎల్‌ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 కింద తొలిసారి నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -