Sunday, June 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపుష్కర ప్రచారం-పొంచిన ప్రమాదం

పుష్కర ప్రచారం-పొంచిన ప్రమాదం

- Advertisement -

భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించి కొనసాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనే మోత మొగిపోతున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోడీ దేశంలోనే గాక ప్రపంచంలోనే సాటిలేని నాయకుడనీ, 21వ శతాబ్దం ఆయనదేనని మొన్న ఎన్డీయే సమావేశంలో పొగిడేశారు. బడామీడియాలో చాలామంది వ్యాఖ్యాతలు తమ శక్తిని బట్టి మోడీ భజనలో మునిగితేలుతున్నారు. గూగుల్ సెర్చి కొడితే తొంభై శాతం కీర్తనలో తప్ప విమర్శనాత్మక రచనలు కనిపిస్తే ఒట్టు. ఆఖరుకు ఎఐ, చాట్ జీపీటీ వంటివి కూడా అదే పాట.. ఎన్నికల్లో గెలిచి మధ్యలో అంతరాయం లేకుండా అతి ఎక్కువకాలం పాలించినవారి వివరాలు బట్టి ఈలెక్క వేసినట్టు గూగుల్ సెర్చి ఎఐ చెబుతుంది. ఆ సెర్చి ప్రకారమైతే మోడీ ప్రధానిగా 4400 రోజులు పూర్తి చేశారని మాత్రమే గాక గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన 4600 రోజులు కూడా కలిపి దేశంలోనే అత్యధిక పాలనాకాలం గల నేతగా తొమ్మిది వేల రోజులు లెక్క చూపిస్తున్నది. ఇలా రెండు కలిపి చూపడం ఎంతవరకు సమంజసమనేది ఒకటైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ నేరుగా ఎన్నికల్లో గెలవలేదని కూడా చెప్పుకోవాలి మరి. గుజరాత్ మారణకాండ నేపథ్యంలో మొదటి దఫానే ఆయన సభను అర్థంతరంగా రద్దుచేసి ఎన్నికలకు వెళ్లారని అందరికీ తెలుసు. అయినా అవన్నీ మాకు అవసరమేమిటి? మోడీనే హయ్యెస్ట్.

జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగష్టు 15 నుంచి 6130 రోజులు నిరాఘాటంగా పాలించారు. 1964లో పదవిలో వుండగానే కన్ను మూశారు. ఇందిరాగాంధీ ఒక విరామంతో 5831 రోజులు పాలించారు. సిక్కు ఉగ్రవాది హత్యకేసు చేయడం వల్ల ఆమె పదవీ కాలం ముగిసింది. కాకపోతే ఎమర్జన్సీ తర్వాత 1977-80 మధ్య ఇందిరాగాంధీ ఓడిపోయారు. అయినా మొత్తం రోజులు లెక్కవేస్తే మోడీకి చెబుతున్న దాని కంటే వేయి రోజులు ఎక్కవ. ఏపీలో చంద్రబాబు 2004, 2009, 2019 మూడుసార్లు ఓడిపోయారు. అయినా స్కోరు మాత్రం అత్యధిక కాలం అని చెబుతూనే వున్నాం కదా.నెహ్రూ ఇందిరలకు అది వర్తించదా?1947లో ఎన్నికైన ప్రధాని కాదనేది మరింత తప్పు వాదన. వాస్తవం దేశానికి స్వాతంత్రంపై చర్చలు మొదలైనాక బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద 1946 జులై ఆగష్టులో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 296 స్థానాలకు రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. ఇందులో 208 కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. ముస్లిం లీగ్ 73 స్థానాలను తెచ్చుకుంది. మరో 93 స్వదేశీ సంస్థానాధీశులకు కేటాయించారు. దేశ విభజన, స్వాతంత్రానంతరం నెహ్రూను ప్రధానిని చేయడం ఈ బలాన్ని బట్టి తప్ప ఏదో నియామకం కాదు, పైగా 1949లో రాజ్యాంగ పరిషత్తును తాత్కాలిక పార్లమెంటుగా నిర్ణయించారు.1952 ఎన్నికలకు కూడా ఆ రాజ్యాంగమే పునాది. నెహ్రూ స్వాతంత్రోద్యమ అత్యున్నత నేతలలో ఒకరుగా వున్నారు గనక ఇది మామూలు ఎన్నికకంటే ఎక్కువే. మోడీ గొప్ప కోసం ఆ అయిదేళ్లు తుడిచేసే ఆయనే గొప్ప అని టముకు వేసుకుంటున్నారు.

కంగుతిన్న బీజేపీ కవరప్
వాస్తవానికి 2024లో మోడీ బీజేపీ స్వంతంగా మెజార్టీ తెచ్చుకోలేక పోయారు. టీడీపీ- జేడీయుల ప్రధాన మద్దతుపైనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. నాలుగు వందల స్థానాలు వచ్చేస్తాయని కోతలు కోసి 240 దగ్గరే ఆగిపోవడం శృంభంగమైంది. అప్పటినుంచి కొత్త కవరప్ థియరీలు పెరిగాయి. ఈ అవిన్యాసం ఎన్నికల ఫలితాలు రాకముందే మొదలైంది. రాబోయే వందరోజులలో ఏం చేయాలనేది ముందే గత ప్రభు త్వమే చర్చకు పెట్టడం అంతకుముందు ఎన్నడూ జరగలేదు. మూడు కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణం, యువతకు సహాయపడేందుకు రెండు లక్షల కోట్ల సహాయం, గ్రామాలకు రోడ్లు, గిరిజిన ప్రాంతాల అభివృద్ధి, కొత్త పెన్షన్‌ పథకం, 11లక్షల మంది మహిళలను లక్షాదికారి దీదీలను చేయడం.. రైతులకు సహాయం ఇలా చాలా జాబితా చదివారు. నిజానికి ఇందులో చాలా భాగం గతంలో అమలు కానివీ, స్పష్టత లేనివే. నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కడా లేనంత రికార్డు స్థాయిలో వుంటే వారి పేరిట కార్పొ రేట్లకు నెల జీతం జమచేయడం ఓ విపరీత విధానం. విదేశాంగ విధానం లోనూ గొప్ప ఫలితాలు సాధించినట్టు చెప్పుకున్నారు. ఇవన్నీ 2024 దెబ్బను మరపించేందుకు పడిన తంటాలే, మామూలుగా గెలిచే అవకాశం లేదు గనకే సర్ తతంగంతో రాష్ట్రాలలో కృత్రిమంగా గెలిచే ప్రయత్నాలు అవసరమై నాయి. జమిలి ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వి భజన వంటివన్నీ ఆ కొనసాగింపే. వీటివల్ల ఏదో విధంగా రాష్ట్రాలలో తిష్టవేసినా ట్రంప్, నెతన్యాహూ ఇరాన్‌పై దురాక్రమణకు పాల్పడటంతో పరిస్థితి మొత్తం తలకిందులై పోయింది. మోడీ విశ్వగురు గొప్పలు కుప్పకూలాయి.

అప్పుడే మొదలు…
తమ సంస్థకు ఎవరూ దేవుడు కాదనీ, ఎప్పుడూ ఒకరినే తాము నెత్తిన పెట్టుకోమని కూడా మోహన్ భగవత్ వంటి వారు ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్యాపదేశంగా మోడీకి సంకేతాలు పంపారు. ఆరెస్సెస్ వారికి ప్రాథమికంగా తృధికారం చలాయించడం, మతతత్వ ఎజెండా చలామణి చేయడం ముఖ్యం. ఏదో విధంగా తమ అసంతృప్తినీ కొరతనూ బయట పెట్టడానికి అదే సమయంలో తమ మద్య ఏదో తేడా వుందనే భ్రమ కలిగించడానికి చాలా మాట్లాడారు. నాగపూర్‌కు అంటే ఆరెస్సెస్ కేంద్ర స్థానానికి ఇష్టుడైన మాజీ బీజేపీ అధ్యక్షుడు, మూడో దఫా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒకడుగు ముందుకేసి తనకు ఒకసారి ప్రధాని పదవి ఆఫర్ వచ్చినట్టు బహిరంగంగా ప్రకటించారు. ప్రతిపక్షాలు ఆ ఆఫర్ ఇచ్చాయట. మోడీ నాయకత్వాన్ని ఎందుకు వదలిపెడతాను అని ఆయన అన్నప్పటికీ ఈ విషయం బయట పెట్టడంలోనే అసలు వ్యూహం వుంది. ఇదేగాక మూడో సారి ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడటం, కంగనా రనౌత్, బ్రిజ్‌భూషన్ దర్శన్ సింగ్‌తో సహా పలువురు ఆంక్షలకు గురి కావడంలో అసహనం ప్రతిబింబించింది. రాహుల్‌గాంధీని దేశంలోనే మొదటి టెర్రరిస్టు అని కేంద్రమంత్రి రణనీత్‌సింగ్ బిట్టూ దూషించారు. ‘ఇలాగే మాట్లాడితే మీ నానమ్మ గతే మీకు పడుతుందని’ మరో నేత బెదిరించారు. సీనియర్ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాహుల్‌పై తిట్లు కురిపించి కృతజ్ఞత చాటుకున్నారు. ప్రతిపక్ష కూటమిపైన రోజూ నిందా రోపణలు చేయడం మూడో దఫాపాలనలో బీజేపీకి నిత్యకృత్యమైపోయింది.

మరోవైపున మోడీ 3.0 ప్రభుత్వం పరిస్థితులకు తగినట్టు మారిందని ముందుకు పోతోందని ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్ పత్రిక అప్పట్లో బాక్స్ కథనం ప్రచురించింది. పున:శక్తివంతం కావటం, మరింతగా నిలదొక్కుకోవడం జరుగుతుందంటూ ఆ కథనం మొదలైంది. భాగస్వామ్యపక్షాల ప్రయోజ నాలకు చోటు కల్పించేందుకు ఒక కొత్త రాజకీయ ప్రక్రియను రూపొం దించుకోవాల్సి వచ్చినా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో విజయాలు సాధిం చడం ద్వారా బీజేపీ తన ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుకోగలిగిందని చెప్పింది.ఇప్పట్లా 12 ఏళ్లదాకా ఆగకుండానే ఆర్ జగన్నాథన్(స్పాన్సర్డ్ గా కనిపించే ‘స్వరాజ్య’ సంపాదకుడు) పదకొండేండ్లలో 11 మార్పుల జాబితా ఇచ్చేశారు. దేశంలో మతపరమైన అస్తిత్వాన్ని నెలకొల్పడం, మైనార్టీలు ప్రతిపక్షం వైపు మొగ్గ కుండా చూడటం మోడీ ఘనతని పొగిడారు. మొదటిసారిగా బీజేపీ ఒక రాజకీయపార్టీని కార్పొరేట్ పద్ధతిలో నడప వచ్చునని అగ్ర నాయకుడు సీఈఓలాగా ఉంటే కార్యకర్తలు ఉద్యోగులుగా కనిపిస్తున్నారని వర్ణించారు. పైనుంచి కిందకు ప్రమోషన్లతో వినియోగ సరుకుల(ఎఫ్‌ఎంసిజి) తరహాలో రాజకీయం నడపవచ్చునని అర్థమైందట. మోడీకి అనుకూలంగా పది అంశాలు చెప్పిన జగన్నాథన్ ఆఖరులో మాత్రం ఉద్యోగాల కల్పన అనే అతి ప్రధానమైన జాతీయ సవాలు మోడీ పాలనలో అలాగే ఉండిపోయిందని ఒప్పుకోక తప్పలేదు. సరిగ్గా ఇదే ఇప్పుడు గుదిబండగా మారుతున్నది. నిరుద్యోగ బొద్దింకల నిరసనలు కుదిపేస్తున్నాయి.

పెనుదాడికి సంకేతం..
ఈ సమయంలో ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, పార్లమెంటు సహా అన్నీ సంఘర్షణకు గురవుతున్నాయి. వీటిని ప్రత్యర్థులపైనే గాక ఎన్‌డిఎ భాగస్వాములపైనే ప్రయోగించడం చూస్తున్నాం. బీహార్‌లో నితీశ్‌బాబు ఇంటిదారి పట్టేశారు. పవన్ ఎంతగా వత్తాసు పలికినా తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా ప్రకటించారు. స్వంత బలం పెంచు కోవడం తప్ప ప్రాంతీయ పార్టీలపై ఆధారపడబోమన్నారు. ఇప్పుడు చంద్రబాబు మినహా పెద్దరాష్ట్రాలలో బీజేపీయేతర ముఖ్యమంత్రు లెవరూ ఇప్పటి ఎన్‌డిఎలో లేరు. ఆయన స్థానంలో వస్తాడంటున్న లోకేశ్‌పై ఇప్పటికే మోడీ బహిరంగంగా ప్రత్యేకాసక్తి చూపిస్తున్నారు. ఎన్‌సిపి, శివసేన, జెడిఎస్, ఆప్ సహా పలు ప్రాంతీయ పార్టీలను బీజేపీ చీల్చింది. తృణమూల్ ముక్కలైపోవడం, పెద్ద సంఖ్యలో ఎంపీలు వచ్చి ఎన్‌డిఎను బలపర్చడం కూడా ఈ రాజకీయ మాయాజాలంలో భాగమే. మొన్నటి నిటి ఆయోగ్ సమావేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశాలు జరిపి కలసి పనిచేయాలని కోరడంలోనూ సంకేతాలున్నాయి. రేవంత్ రెడ్డి తమతో చేతులు కలుపుతారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తుంటే బీఆర్‌ఎస్ దెప్పిపొడుస్తున్నది. ఆ స్థాయిలో సిఎంఓ ఖండన‌లివ్వడం లేదు. పదవిలోని ఒక ముఖ్యమంత్రి తేలిగ్గా అటు చేరిపోతారనే ప్రచారం నమ్మశక్యం కాకున్నా సందేహాలు సాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనక కాంగ్రెస్ నేతలే వున్నారన్న ఆరోపణ దుమారం రేపింది.

విచిత్రంగా మరోవైపున కాంగ్రెస్ నుంచి గతంలో విడిపోయిన ఎన్‌సిపి, తృణమూల్ వంటివి మళ్లీ విలీనం అవుతాయనే ప్రచారాలూ వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో వైసీపీ పేరు కూడా వినిపిస్తున్నా ఆ అవకాశం వుండదనే అభిప్రాయం బలంగా వుంది. పైగా జగన్ పిఎతో సహా అతి సన్నిహితులపైనా లిక్కర్ కుంభకోణంలో దాడులు అరెస్టులు జరుగుతున్నాయి, ఇవి ఆయన దాకా రావచ్చనే కథనాలూ వున్నాయి. పినరాయి విజయన్ వంటి నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడుతున్నది, ఏమైనా జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఏదైనా జరగొచ్చనే అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. కీలక మైన నియోజకవర్గ పునర్విభజన ఎజెండాను మరోసారి ముందుకు తెస్తున్న మోడీ సర్కారు దేశ రాజకీయ చిత్రపటాన్నే గాక రాజ్యాంగ లక్షణాలను కూడా మార్చేసే ప్రయత్నం జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు, వందే మాతరం పూర్తిగా పాడాలని ఆదేశాలు ఇచ్చినట్టే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అంటూ ఇప్పడు అధికారిక ప్రకటనలు విడుదల చేస్తున్నది. జనాభా కమిషన్ పేరిట మతాలవారిగా దాడి తీవ్రం చేస్తున్నది. కనుక ఈ పుష్కర ప్రధాని సందడి వెనక ప్రమాదకరమైన వ్యూహాత్మక దాడులు పొంచి వుంటా యనేది నిస్సందేహం. వంతపాడే అవకాశ వాదులను కూడా అవి వదలి పెట్టకపోవచ్చు.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -