ఒక అందమైన అరణ్యంలో ఉన్న సెలయేరులో బుజ్జి అనే ఓ చిన్న తాబేలు ఉండేది. అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద బిలంలో ముంగిస, చెట్టు మీద ఒక కోతి ఉన్నాయి. బుజ్జి ఎప్పుడూ వారిద్దరినీ చూసి ‘అబ్బా! వీరి జీవితం ఎంత బాగుంది! వీరు అన్ని విధాలుగా నా కన్నా గొప్పగా ఉన్నారు. అందుకే చాలా సంతోషంగా ఉన్నారు.’ అని బాధపడుతూ ఉంటుంది. ఒక రోజు బుజ్జి వేగంగా పరిగెత్తుతున్న ముంగిసను చూసింది. ‘అబ్బా! ఈ ముంగిస అన్ని చోట్లకు ఎంత వేగంగా వెళ్లగలుగుతుంది. మరి నేనెందుకు అలా వెళ్లలేను? ఒకసారి నేను కూడా అలా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను’ గట్టిగా అనుకుంది.
కానీ బుజ్జి ఎంత ప్రయత్నించినా, ముంగిసలా వేగంగా పరిగెత్తలేకపోయింది. అప్పుడు బుజ్జిని చూసి ముంగిస హేళనగా నవ్వుతుంది. దానితో బుజ్జి మనసు నొచ్చుకుంది. మరోరోజు ఒక ఎత్తైన చెట్టుపై నుండి గంతులు వేసే కోతిని చూసి ‘ఆహా! ఈ కోతి ఎంత చురుకుగా గంతులు వేస్తుంది! నేను కూడా అలా ఎగరాలని’ బుజ్జి ఆశపడుతుంది. కానీ దాని చిన్న కాళ్లు, బరువైన డిప్ప సహకరించకపోవడంతో ఎగరలేకపోయింది. అదంతా కోతి చూసి నాలా ఎగరడం నీ వల్ల ఎప్పటికీ కాదని వెక్కిరించడంతో బుజ్జి చిన్నబుచ్చుకుంది. ఒక రోజు అడవిలో భయంకరమైన వర్షం పడింది. సెలయేరు పొంగి అడవిలోని చాలా ప్రదేశాలు నీటిలో మునిగిపోయాయి.
ముంగిస ఉండే బిలం నీటితో నిండిపోవడంతో అది భయపడిపోయింది. కోతి చెట్టుకొమ్మల్లో ఇరుక్కుపోయింది. అడవిలోని అన్ని జంతువులు భయంతో ఎక్కడికి పోవాలో తెలియక అల్లాడుతున్నాయి. బుజ్జి నీటిలో ఈదటం రాక భయపడుతున్న ముంగిసను చూసింది. వెంటనే ఈదుతూ అక్కడకు వెళ్లి తన డిప్ప పైన ముంగిసను ఎక్కించుకుని కొంచెం ఎత్తైన ప్రదేశానికి భద్రంగా తీసుకెళ్లి అక్కడ దింపింది. తరువాత బుజ్జి తిరిగి నీటిలో ఈదుతూ కోతి ఉన్న చెట్టు వద్దకు వచ్చింది. అక్కడ చెట్టు మీద నుండి రాలిపోయిన పళ్ళను నీళ్లలో కొట్టుకుపోకుండా ఆపింది.
”కోతి బావా! నీ కోసం ఆహారం దాచాను కిందకు దిగి తీసుకుని వెళ్ళు” అని చెప్పింది.
వర్షం ఆగిన తరువాత కోతి కిందకు వచ్చింది. అంతలో ముంగిస కూడా అక్కడకు వచ్చింది.
”నేస్తమా! నీవు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలు. మేము నిన్ను వెక్కిరించినా నువ్వు మాత్రం మాకు సహాయం చేసావు” అంది కోతి.
”అవును నేస్తమా! నువ్వు నిదానంగా నడుస్తావని మేము ఎగతాళి చేసినా ఆపదలో నువ్వే రక్షంచావు. నీ శరీరం పైన డిప్ప ఉండటం వల్ల అది రక్షణకవచంలాగా నిన్ను కాపాడింది.” అంది ముంగిస.
బుజ్జి మొదటిసారిగా తనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించింది.
”బుజ్జీ! ఎవరి ప్రత్యేకత వారిదే! ఒకరిని చూసి నిరాశ చెందకూడదు. నీలో ఉన్న ప్రత్యేక శక్తులను మేము కూడా ఇప్పుడే తెలుసుకున్నాము. ఇంకెప్పుడూ నిన్ను ఎగతాళి చేయము” అంది కోతి.
‘నిజమే! ఇతరులలో లేనివి మనలో ఉంటాయి అలాగే మనలో ఉన్నవి ఇతరులకు ఉండవు. ఎవరి గొప్ప వారిదే!’ సంతప్తిగా అనుకుంది బుజ్జి.
కె.సుమలత, 9492656255



