కంపెనీల ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యం
ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో
ప్రజలపై ఆర్థిక భారం
మోడీ సర్కారుపై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ : దేశంలో క్యాన్సర్ ఔషధాల కొరతను నివారించడంలో చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వ… పేద, మధ్యతరగతి క్యాన్సర్ రోగులకు పిడుగులాంటి వార్తను చెప్పింది. క్యాన్సర్ చికిత్సకు వాడే కీలకమైన ఔషధాల ధరలను 50 శాతం మేర పెంచింది. క్యాన్సర్ మందుల ధరలు తక్కువగా ఉండటంతో తయారీ కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించాయనీ, దీంతో దేశంలో మందుల కొరత ఏర్పడిందని వివరించిన సంబంధిత వర్గాలు… ఈ క్రమంలోనే ఔషధాల ధరలను పెంచుతున్నట్టు తెలిపాయి. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల గురించి ఆలోచించకుండా.. కంపెనీల ప్రయోజనాలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పెరిగిన నిత్యావసరాలు, మండుతున్న గ్యాస్, పెట్రో ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులకు.. ఈ ఔషధ ధరల పెంపు మరో భారంగా మారబోతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
ఔషధాల ధరల పెంపు ఇలా..
క్యాన్సర్ చికిత్సలో కీలకంగా వినియోగించే కార్బోప్లాటిన్, సిస్‌ప్లేటిన్ ఇంజెక్షన్ గరిష్ఠ ధరలను 50 శాతం మేర పెంచుతూ నేషనల్ ఫార్యాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) గురువారం నిర్ణయించింది. వీటితో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ-టెటానస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లతో పాటు చిన్నారులకు ఇచ్చే మూడు కీలక వ్యాక్సిన్ల ధరలను కూడా పెంచింది. ఎన్‌పీపీఏ తాజా నిర్ణయంతో కార్బోప్లాటిన్ 10 ఎంజీ/ఎంఎల్ ఇంజెక్షన్ గరిష్ఠ ధర మిల్లీ లీటర్‌కు రూ. 60.49 నుంచి రూ. 90.74కు పెరగ్గా, సిస్‌ప్లేటిన్ 1 ఎంజీ/ఎంఎల్ ఇంజెక్షన్ ధర మిల్లీ లీటర్‌కు రూ. 7.26 నుంచి రూ. 10.89కు పెరిగింది. సవరించిన ధరల అనంతరం యాంటీ-టెటానస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ 250ఐయూ ఇంజక్షన్ వయల్ ధర రూ.1,912.02కు, 500 ఐయూ వయల్ ధర రూ.2,881.19కు పెరిగింది. దేశంలో ఔషధాల కొరత ఏర్పడకుండా నివారించడానికి ఈ ధరలు పెంచినట్టు ప్రభుత్వం తెలిపింది. గరిష్ఠ ధరలను 50 శాతం వరకు పెంచేందుకు తనకు ఉన్న అసాధారణ అధికారాన్ని వినియోగించుకుని ఎన్‌పీపీఏ రెండు మొదటి శ్రేణి క్యాన్సర్ మందుల ధరలను అనూహ్యంగా పెంచినట్టు వివరించింది. ఔషధాల ముడిసరుకుల ధరలు ఎక్కువగా పెరగడం వల్ల, కంపెనీలు క్యాన్సర్ ఔషధాల తయారీని తగ్గించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఔషధాల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే మందుల ధరలను పెంచినట్టు పేర్కొన్నాయి.
‘కేంద్రానికి లోపించిన చిత్తశుద్ధి’
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 12 ఏండ్ల పాలనలో నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగాయనీ, పెట్రోల్-డీజిల్ రేట్లు డబుల్ అయ్యాయని దేశంలోని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రాణాధారమైన క్యాన్సర్ మందుల రేట్లను కూడా పెంచడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కంపెనీలకు రాయితీలు ప్రకటించి.. సామాన్యులపై భారం పడకుండా చూడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.



