నవతెలంగాణ-సిర్పూర్(టి)
రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే ఇప్పుడు అతని మెడకు ఉరితాడులా మారుతున్నాయి. వ్యవసాయాన్ని సులభతరం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం, రైతుల జీవితాలను మరింత సంక్లిష్టం చేసే విధంగా ఫెర్టిలైజర్ (యూరియా) బుకింగ్ యాప్‌ను తీసుకురావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ అనిశ్చితులతో అల్లాడుతున్న రైతాంగంపై మరో భారాన్ని మోపినట్టైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే నిర్ణయాలకు శ్రీకారం చుట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా పంపిణీని యాప్‌కు అనుసంధానం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరక్షరాస్యులు, వృద్ధ రైతులు, స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు ఈ విధానంతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ వ్యవసాయ శాఖ మాత్రం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. యాప్ ద్వారా యూరియా పొందాలంటే రైతులు మూడు దశల్లో బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం తెలియని రైతులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అంతేకాకుండా ఎకరానికి కేవలం మూడు బస్తాల యూరియానే కేటాయించడం కూడా రైతుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
మరోవైపు యాప్‌లో యూరియా బుకింగ్ చేయాలంటే రైతు పట్టా పాస్‌బుక్ నంబర్‌కు ఆధార్ నంబర్, ఆధార్‌కు మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలని నిబంధన విధించారు. ఈ లింకులు లేకపోతే లేదా వివరాల్లో చిన్నపాటి పొరపాట్లు ఉన్నా రైతులు యాప్‌లో నమోదు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ రోజులు తిరగాల్సి వస్తోంది. ఎరువులు పొందడం కంటే రికార్డులు సరిచేసుకోవడమే పెద్ద సమస్యగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భూమి తమ పేరుపై లేకపోవడంతో యాప్‌లో నమోదు చేసుకోవడం, బుకింగ్ పొందడం వారికి కష్టసాధ్యంగా మారింది. దీంతో వారు తప్పనిసరిగా మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతులకు నేరుగా ఎరువులు అందించాల్సిన వ్యవస్థ, దళారుల ప్రోత్సాహానికి మార్గం సుగమం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“యాప్ ఉందంటే యూరియా అందుబాటులోకి వస్తుందా?” అన్నది రైతుల ప్రశ్న. గోదాముల్లో సరిపడా ఎరువులు లేకపోతే యాప్ ద్వారా బుకింగ్ చేసినా ప్రయోజనం ఏమిటని వారు నిలదీస్తున్నారు. గతంలో అనేక ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం రాత్రింబవళ్లు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఈ దుస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే కాదా అని ప్రశ్నిస్తున్నారు.
వ్యవసాయం చేయాలా? లేక యాప్‌ల గురించి నేర్చుకోవాలా? అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఒకవైపు వాతావరణ శాఖ వర్షాభావ హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు ఎరువుల కోసం రైతులు మొబైల్ ఫోన్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి దురదృష్టకరం. వ్యవసాయ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, సాంకేతిక అడ్డంకులతో రైతును మరింత ఇబ్బందులకు గురిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా అమలు చేయడం కూడా సమంజసం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అమలుదారుగా మాత్రమే వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.
ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు మోపుకోవడం కొత్తేమీ కాదు. రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంలో ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కానీ నష్టపోయేది మాత్రం రైతే. రైతు సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నాయి.
రైతు వ్యతిరేక చట్టాలు, కార్పొరేట్ అనుకూల విధానాల అమలులో చూపుతున్న ఆసక్తి, రైతు సంక్షేమం విషయంలో కనిపించడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు నిజంగా రైతు పక్షాన ఉంటే, ముందుగా యూరియా యాప్ వంటి ఇబ్బందికర విధానాలను సమీక్షించి, కౌలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచి, రైతుకు సులభంగా చేరే విధానాలు అమలు చేయాలి. రైతాంగాన్ని నట్టేట ముంచే నిర్ణయాలు కాకుండా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే చర్యలు అవసరం. రైతు బతికితేనే దేశం బతుకుతుందన్న సత్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. భవిష్యత్తులో ఈ యాప్‌ను ఎత్తివేయాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి రాకముందే ప్రభుత్వాలు ఈ విధానాన్ని పునఃసమీక్షించి, యాప్‌ను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.



