Tuesday, June 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆ ముగ్గురే..

ఆ ముగ్గురే..

- Advertisement -


కేసీఆర్‌, కేటీఆర్ ఆడిస్తున్నారు
, కిషన్‌‌రెడ్డి ఆడుతున్నారు
మెట్రో ఫేజ్‌-2కు మోకాల‌డ్డుతున్నది వారే..
రైల్వే లోన్ రాకుండా కుట్రలు చేస్తున్నారు
ఎన్‌ఓసీ ఇప్పిస్తారో లేదో తేల్చి చెప్పాలి : కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డిపై సీఎం రేవంత్‌‌రెడ్డి ఫైర్‌

న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్
కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్‌-2ను అడ్డుకుంటున్న‌ది ముమ్మాటికీ ఆయ‌నేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్‌), ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) చెప్పిన‌ట్టుగా కిషన్‌‌రెడ్డి న‌డుచుకుంటూ ఉద్దేశ‌పూర్వ‌ కంగా రాష్ర్టాభివృద్ధికి మోకాలడ్డుతున్నారని విమర్శించారు. కేటీఆర్ చీటి రాసిస్తున్నారు.. దాంట్లో ఉన్న‌దాన్నే కేంద్ర మంత్రి అమ‌లు చేసి చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓట్ల‌ను గంప‌గుత్త‌గా బీజేపీకి వేయించారు, ఆ కృత‌జ్ఞ‌త తీర్చుకునే ప‌నిలో భాగంగానే కిష‌న్ రెడ్డి.. కేసీఆర్‌, కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లో మెట్రో ఫేజ్‌-2ను అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. కేంద్ర మంత్రులు అశ్వ‌నీ వైష్ణ‌వ్‌, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌తో మంత‌నాలు సాగించ‌టం ద్వారా ఇండియ‌న్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేష‌న్ (ఐ.ఆర్‌.ఎఫ్‌.సీ) నుంచి హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2కు లోన్ రాకుండా మోకాల‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించి ఎన్‌వోసీ ఇప్పిస్తారా? లేదా? అంటూ కిష‌న్‌రెడ్డిని సూటిగా ప్ర‌శ్నించారు.

సోమ‌వారం హైద‌రాబాద్‌లోని స‌చివాల‌యంలో మంత్రులు శ్రీధ‌ర్‌బాబు, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీత‌క్క‌, వాకిటి శ్రీహ‌రి, అజారుద్దీన్‌, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు న‌వీన్ యాద‌వ్‌, శ్రీగ‌ణేష్ త‌దిత‌రుల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కిష‌న్ రెడ్డిపై తన‌కు గౌరవం ఉంది… అదే స‌మ‌యంలో ఆయనపై అసహనం కూడా ఉంద‌న్నారు. హైద‌రాబాద్ మెట్రో రైల్ పుట్టు పూర్వోత్త‌రాల‌ను 2004 నుంచి సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. అంతర్జాతీయ నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఉమ్మ‌డి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ హయాంలో ఆనాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి జైపాల్ రెడ్డి హైదరాబాద్ కు మెట్రో ప్రాజెక్టు తీసుకొచ్చారని వివ‌రించారు. వైఎస్ మరణానంతరం రోశయ్య హయాంలో మొదటిదశ మెట్రో కోసం ఒప్పందాలు జరిగాయ‌ని తెలిపారు. ఆ క్ర‌మంలో 2017 నాటికి మెట్రో మొదటి దశ పూర్తి చేయాలనేదే లక్ష్యంగా ప్రాజెక్టు మొదలైందని అన్నారు. కానీ తెలంగాణ వ‌చ్చాక చారిత్రక కట్టడాల సాకుతో మెట్రో మొదటి దశను అడ్డుకున్నారని బీఆర్ ఎస్ స‌ర్కారును ఉద్దేశించి విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ చర్యలతో మెట్రో మొదటి దశ మూడేళ్లు ఆలస్యమైంద‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అంచ‌నాలు రూ.22 వేల కోట్లకు చేరాయ‌ని తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యం కావ‌టంతోపాటు కోవిడ్ ప్రభావంతో మెట్రో ప్రాజెక్టును చేప‌ట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిందని వివ‌రించారు. మ‌రోవైపు ప‌దేండ్ల‌పాటు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ మెట్రో విస్తరణపై దృష్టి సారించ‌లేద‌ని సీఎం విమ‌ర్శించారు. బీఆర్ ఎస్ నేత‌లు త‌మ ఆస్తులు పెంచుకునేందుకు తప్ప ప్రజల కోసం ఆలోచించలేదని దుయ్య‌బ‌ట్టారు. దీంతో ఢిల్లీ త‌ర్వాత రెండో స్థానంలో ఉన్న హైద‌రాబాద్ మెట్రో ఆ త‌ర్వాత తొమ్మిదో స్థానానికి పడిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణకు నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. ఆ మేర‌కు ఫేజ్ -2 కోసం ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తిచేశామని గుర్తు చేశారు. అయితే ఫేజ్-1 ను నిర్మాణాన్ని చేప‌ట్టిన ఎల్ అండ్ టీ తోనే ఫేజ్ -2ను నిర్మించాల్సి ఉంటుందని కేంద్రం నిబంధన పెట్టిందనీ, దీనికి ఎల్ అండ్ టీ అంగీకరించలేదని తెలిపారు.

గత నష్టాలతోనే సతమతమవుతున్న తమకు ఫేజ్ -2 నిర్మించడం కష్టమంటూ ఆ సంస్థ‌ తేల్చి చెప్పిందన్నారు. రూ.30 వేల కోట్ల ఆస్తి సృష్టించినా ఏటా 400 కోట్లు నష్టం వస్తుందంటూ ఆ సంస్థ ప్ర‌తినిధులు ఆందోళ‌న వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. అందుకే ఫేజ్ -2 నిర్మాణంలో భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టంగా చెప్పార‌ని పేర్కొన్నారు. భవిష్యత్ లో ప్రాజెక్టు నిర్వహణకు కూడా ఒప్పుకోమంటూ ఆ సంస్థ తిరస్కరించింద‌ని వివ‌రించారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు, స‌మాలోచ‌న‌లు జ‌రిపామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే దీనికి ఏకైక పరిష్కారంటూ కేంద్రం స్ప‌ష్టం చేసింద‌న్నారు. దీంతో రూ.30 వేల కోట్ల ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తిని 15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింద‌న్నారు. ఇందుకోసం 8.25 శాతం వడ్డీకి 13,600 కోట్లను ఎల్ అండ్ టీ మెట్రోపై రుణం తెచ్చుకుందన్నారు. ఆ లోన్ ను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామ‌ని తెలిపారు. ఐ.ఆర్‌.ఎఫ్‌.సీ ద్వారా తక్కువ వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడానికి వెసులుబాటు క‌ల్పించాలంటూ కోరామ‌ని చెప్పారు. గ‌తంలో బీఆర్ ఎస్ స‌ర్కారుకు పీ.ఎఫ్‌.సీ, ఆర్‌.ఈ.సీ ద్వారా ప‌దేండ్ల‌లో రూ.3.15 ల‌క్ష‌ల కోట్ల‌ను ఎలాంటి గ్యారెంటీ లేకుండా, మూడో కంటికి తెలియ‌కుండా కేంద్రం అప్పుగా ఇప్పించింద‌ని వివ‌రించారు. అప్పుడు 9 నుంచి 11.5 శాతం కేసీఆర్ అప్పులు తెచ్చార‌ని గుర్తు చేశారు. కానీ త‌మ ప్ర‌భుత్వం మాత్రం ఐ.ఆర్‌.ఎఫ్‌.సీని ఒప్పించి మ‌రీ నాలుగు శాతం వ‌డ్డీకి జ‌పాన్ సంస్థ ద్వారా రూ.13,600 కోట్ల‌ను అప్పుగా తీసుకున్నామ‌ని వివ‌రించారు. ఇది ఐ.ఆర్‌.ఎఫ్‌.సీ. నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ కావాల్సి ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున బాకీ ఉన్న రూ.1,400 కోట్ల‌ను కూడా చెల్లించామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇక లోన్ వ‌చ్చిన‌ట్టే అని భావిస్తున్న త‌రుణంలో కిష‌న్ రెడ్డి దాన్ని అడ్డుకున్నారంటూ సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మే 20న ఆయ‌న కేంద్ర‌మంత్రి ఖ‌ట్ట‌ర్‌ను, 21న అశ్వినీ వైష్ణవ్ ను క‌లిసి లోన్ ఇవ్వొద్దంటూ చెప్పారని విమ‌ర్శించారు. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాతే తాము కిష‌న్ రెడ్డి వెంట ప‌డుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. వాస్త‌వానికి ఫేజ్‌-2కు సంబంధించి సోమ‌వార‌మే నిధులు విడుద‌ల కావాల్సి ఉంద‌ని, కానీ కిష‌న్ రెడ్డి అడ్డుప‌డ‌టం వ‌ల్ల అవి ఆగిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందువ‌ల్ల వాటిని ఇప్పించాల్సిన బాధ్య‌త ఆయ‌న‌దేన‌ని అన్నారు. ఒక‌వేళ ఫేజ్‌-2లో కేంద్రం భాగ‌స్వామ్యం కావ‌టం క‌ష్ట‌మ‌నుకుంటే ఆ 50 శాతం వాటా అవ‌స‌రం లేకుండా త‌మ ప్ర‌భుత్వ‌మే దాన్ని భ‌రించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామ‌ని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉండి, తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కిష‌న్ రెడ్డే ఫేజ్‌-2కు ఎన్‌.వో.సీ. ఇప్పంచాల‌ని సీఎం డిమాండ్ చేశారు. ఫేజ్‌-2 చేప‌ట్ట‌బోయే ప్రాంతానికంతా బీజేపీ ఎంపీలు, బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని గుర్తు చేశారు. అందువ‌ల్ల అది పూర్త‌యితే వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జ‌ల‌కే మేలు క‌లుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. అయినా కిష‌న్ రెడ్డి ఎందుకు బాధ్య‌త తీసుకోవ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు.

వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టు ప‌నుల్లో వేగం పుంజుకోగానే కిష‌న్ రెడ్డి వెళ్లి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిశారు.. దాంతో ఆ పనులు మంద‌గించాయ‌ని సీఎం పేర్కొన్నారు. ఇదే త‌ర‌హాలో జపాన్ సంస్థ ఇప్పటికే నిధులను ఐ.ఆర్‌.ఎఫ్‌.సీకి విడుదల చేసింది.. కానీ అక్క‌డి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ డబ్బులకు వడ్డీ ఎవరు కట్టాలని కిషన్ రెడ్డిని ప్ర‌శ్నించారు.
రిజర్వు బ్యాంకును ఒప్పించిన లెటర్ కూడా తీసుకెళ్లి కేంద్రానికి ఇచ్చామ‌ని, అయినా అయినా లోన్ రాకుండా అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. దీనిపై కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా లేదా? అని నిల‌దీశారు. తీసుకోక‌పోతే ఎన్‌.వో.సీ. ఇచ్చి మీ భాగస్వామ్యం వదులుకుంటారా? అని ప్ర‌శ్నించారు. అలా చేస్తే త‌మ ప్ర‌భుత్వ‌మే మెట్రో ఫేజ్-2ను పూర్తి చేస్తుంద‌ని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ అహ్మదాబాద్, ఉత్తర ప్రదేశ్, వైజాగ్ కు కూడా మెట్రోను మంజూరు చేసింద‌ని, కానీ తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శి స్తోంద‌ని విమ‌ర్శించారు. రాజకీయాల కోసం తాను మాట్లాడటంలేదని, మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకొని, మెట్రో ఫేజ్ 2 ను పూర్తి చేసుకోవడమే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -