Tuesday, June 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదోపిడీకి మారుపేరు ప్రయివేటు బడి

దోపిడీకి మారుపేరు ప్రయివేటు బడి

- Advertisement -

నిబంధనలు బేఖాతరు
ఇష్టారాజ్యంగా వసూళ్లు

ట్యూషన్ ఫీజుకే పరిమితం
కావాల్సిన స్కూళ్లు
అన్నీ తమ వద్దే కొనాలని కండీషన్లు
టీచర్లకు అరకొర జీతాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బడి అంటే పాఠాలు చెప్పేది. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది. కానీ ఇప్పుడు ఆ బడి మాత్రం దోపిడీకి మారుపేరుగా తయార య్యింది. ప్రభుత్వ ఊదాసీనతనే ఊతంగా మార్చుకున్న ప్రయివేటు స్కూళ్లు పెద్ద వ్యాపార సామ్రాజ్యాలుగా మారిపోయాయి. ఈ దోపిడీకి విద్యార్థుల తల్లిదండ్రులు బలవుతున్నారు. నిబంధనలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫల మైంది. అందరికి విద్యను అందించేందుకు, వీలుగా పట్టణ ప్రాంతాల్లో సేవ చేసేందుకు ప్రయివేటు బడులకు ఇచ్చిన అనుమతులు వ్యాపారంగా మారి…. బడులు దోపిడీ కేంద్రాలుగా రూపుదాల్చాయని విమర్శలు వస్తున్నాయి. ప్రతి ప్రయివేటు స్కూళ్లో ఫీజుల రూపంలో తీసుకునే దాంట్లో 50 శాతం ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. 40 శాతం పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు పెట్టాలి. మరో 10 శాతం నిర్వహణ కోసం వెచ్చించాలనీ, ప్రయివేటు పాఠశాలల ఏర్పాటు లాభాల కోసం కాదని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను దాదాపు ప్రయివేటు పాఠశాలలన్ని ఉల్లంఘిస్తూనే ఉ్నాయన్న సంగతి జగమెరిగిన సత్యం. అయినప్పటికీ అధికార యంత్రాంగంలో ఉలుకు పలుకు ఉండటం లేదు.

విద్యా కమిషన్ అధ్యయనం చేసి వెల్లడించిన గణాంకాల మేరకు, రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి 76,35,115 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 49,53,535 మంది (65 శాతం) ప్రయివేటు స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్నారు. కేవలం 26,81,580 మంది (35 శాతం) మంది మాత్రమే ప్రభుత్వ (ఎయిడెడ్ తో కలిపి) బడుల్లో ఉన్నారు. అంటే మూడింట రెండొం తుల మంది విద్యార్థులున్న ప్రయివేటు బడుల పట్ల ప్రభుత్వం ఎలాంటి నిఘా, పర్యవేక్షణ పెట్టాలో అర్థమవుతున్నది. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని నిబంధనలు చెబుతుంటే చివరకు టిఫిన్ బాక్స్ కూడా తమ వద్దే కొనాలని కండీషన్లు పెడుతూ ఏకంగా స్కూళ్లలోనే స్టోర్లు తెరిచి దోచుకుంటున్నాయి. మరోవైపు ఉపాధ్యాయుల దోపిడీకి మారుపేరు ప్రయివేటు బడి శ్రమను కూడా వదలడం లేదు. నిబంధనల మేరకు 50 శాతం జీతాలు చెల్లించాల్సిన యాజమాన్యాలు 15 నుంచి 20 శాతం వరకు చెల్లించి మిగిలిన సొమ్మును నొక్కేస్తున్నాయి. అర్హతలు, అనుభవం ఉన్న వారిని నియమించుకోవడం లేదు. అతి తక్కువ జీతాలకు వచ్చే వారిని రిక్రూట్ చేసుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ బడుల్లో పాఠాలు చెప్పేందుకు బీ.ఈడీ, టెట్ అర్హతలు తప్పనిసరి చూస్తూ డీయస్సీలో పోటీ పడి వచ్చిన వారితో భర్తీ చేస్తున్నారు.

ప్రయివేటు బడుల్లోనూ విద్యాశాఖ పర్యవేక్షణలో నియామకాలు జరిగితే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. అలా జరిగితే అర్హత, అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అవకాశాలు వస్తాయి. అదే సమయంలో టీచర్ల వేతనాలను తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటే శ్రమదోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశముందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.ప్రయివేటు పాఠశాలలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఏ మాత్రం ఫలితం సాధించినా దానికి పెద్ద ఎత్తున అత్యధిక మార్కులు, నెంబర్ వన్ ర్యాంకులంటూ ఊదరగొట్టేస్తున్నాయి. ఈ ప్రచారంలో దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులు, పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు కార్పొరేట్ బడుల్లో చదివే పిల్లల్లో చదువు కంటే ఇతర వ్యాపకాలు పెరిగిపోతూ మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోతున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్య కొనుగోలు సరుకుగా మారడంతో అక్కడ చదివే పిల్లల్లోనూ సామాజిక అవగాహన ఉండటం లేదనీ, తమను ఇతరుల కంటే ఎక్కువగా ఊహించుకునే ధోరణి పెరిగిపోవడం సమాజ శ్రేయస్సుకు ప్రమాదకరమని చెబుతున్నారు. పిల్లలందరికి కామన్ విద్యా విధానం ఉండాలని ఒకవైపు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తుంటే, మరో వైపు ప్రభుత్వం రకరకాల పేర్లతో సేవ పేరుతో ఇచ్చే అనుమతులను చదువును అమ్ముకునేందుకు యాజమాన్యాలు ఉపయోగించుకుంటున్నాయి.

గతంతో పోలిస్తే పట్టణీకరణ పెరిగిపోయింది. సేవలరంగంపై ఆధారపడి జీవించే కుటుంబాల సంఖ్య పెరిగింది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. పట్టణాలు, నగరాల్లో జనాభా విస్తరించింది. అదే స్థాయిలో పెరిగిన పిల్లల సంఖ్యకు తగినట్టు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులోకి రాలేదు. దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రయివేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా శాఖోపశాఖలుగా విస్తరించాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లో వందల సంఖ్యలో కొత్తగా ప్రభుత్వ స్కూళ్లు పెట్టినా పిల్లలు వచ్చి చేరే అవకాశముంది. జవహర్ నగర్ లో బడి ఈడు పిల్లలు ఎంతో మంది ఉన్నా అక్కడ సరిపడా ప్రభుత్వ బడులు లేకపోవడం, ప్రయివేటు ఫీజుల దోపిడీని తట్టుకునే శక్తి లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ కు పంపించడమే మాన్పించారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి పరిస్థితే నగరంలోని పలు బస్తీలు, మురికివాడల్లో కనిపిస్తున్నది. ప్రయివేటు ఫీజుల దోపిడీ నుంచి తమను కాపాడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -