– నూతన పసుపు వంగడాల సృష్టిపై పరిశీలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని అమెరికాకు చెందిన అలబామా యూనివర్సిటీ శాస్త్రవేత్త ల బృందం సభ్యులు సోమవారం సందర్శించారు. అలబామా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా అమెరికా శాస్త్రవేత్తల బృందానికి పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పరిశోధన కేంద్రంలో నూతన పసుపు వంగడాలపై జరుగుతున్న వివిధ పరిశోధనల గురించి వివరించారు.
ఇప్పటివరకు పశువు పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో తయారుచేసిన నూతన పసుపు వంగడాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పసుపు పంట సాగులో నూతన సాంకేతికతలు, వ్యాధి నివారణ చర్యలు, మార్కెట్ అవకాశాలపై పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అమెరికా శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. పశువు పరిశోధన కేంద్రంలో నూతన వంగడాల సృష్టికోసం జరుగుతున్న పరిశోధనల పట్ల అమెరికా శాస్త్రవేత్తల బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యాన యూనివర్సిటీ డైరెక్టర్, కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు విద్య, సూపరిండెంటెంట్ ముఖేష్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



