Tuesday, February 17, 2026
E-PAPER
Homeబీజినెస్దిగుమతుల గుదిబండ

దిగుమతుల గుదిబండ

- Advertisement -

జనవరిలో 19 శాతం పెరుగుదల
34.68 బిలియన్‌ డాలర్లకు వాణిజ్య లోటు
ఎగుమతులు అంతంతే..

ముంబయి : భారత ఉత్పత్తులు విదేశీ మార్కెట్ల లో వెలవెలపోతోన్నాయి. ఈ ఏడాది జనవరిలో సరుకుల ఎగుమతులు అంతంత మాత్రంగానే నమోదు కాగా.. దిగుమతులు అమాంతం పెరిగాయి. దీంతో వాణిజ్యలోటు ఏకంగా 34.08 బిలియన్‌ డాలర్లు ఎగిసింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.3 లక్షల కోట్లకు సమానం. ఎగుమతుల కంటే ఈ మొత్తం విలువ చేసే దిగుమతులను అదనంగా నమోదు కావడం తీవ్ర ఆందోళకరం. రాయిటర్స్‌ లాంటి అంతర్జాతీయ ఎజెన్సీలు 26 బిలియన్లు కంటే తక్కువ లోటు ఉండొచ్చని అంచనా వేయగా.. వాస్తవ గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తోన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థకు వాణిజ్య పరంగా జనవరి నెల గట్టి ఎదురుదెబ్బనే అని పేర్కొంటున్నారు. సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రధానంగా బంగారం, వెండి దిగుమతులు అదుపులేకుండా పెరగడమే ఈ భారీ లోటుకు కారణమైంది. మరోవైపు ఎగుమతుల్లో పురోగతి లేకపోవడం లోటును అమాంతం పెంచింది. బంగారం, వెండి రవాణా భారీగా పెరగడంతో దిగుమతుల విలువ 63.55 బిలియన్ల డాలర్ల నుంచి ఏకంగా 19 శాతం ఎగిసి 71.24 బిలియన్లకు పెరిగింది. ఈ పరిణామం దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎగుమతులు మాత్రం 0.6 శాతం పెరిగి 36.56 డాలర్లకు పరిమితమయ్యాయి. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు ఏర్పడుతుంది. వాణిజ్య కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి కాలంలో భారతదేశ ఎగుమతులు 2.22 శాతం పెరిగి 366.63 బిలియన్లకు చేరుకున్నాయని తెలిపారు.

పూర్తి ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సేవల ఎగుమతులు 860 బిలియన్లను దాటవచ్చు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, ప్రస్తుత లోటు పెరుగుదల ఆందోళనకరంగానే ఉంది. అమెరికా గతంలో విధించిన 50 శాతం భారీ సుంకాల ప్రభావం జనవరి వాణిజ్య గణాంకాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్‌ ప్రభుత్వం ఈ సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించినా.. దానికి ప్రతిగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్‌ తగ్గించుకోవాల్సి రావడం, అమెరికా వస్తువుల దిగుమతులను రెట్టింపు చేయాల్సి రావడం వంటి షరతులు భారత వాణిజ్య వ్యూహానికి సవాలుగా మారనున్నాయి. మార్చిలో జరగనున్న భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాతే ఈ సుంకాల తగ్గింపు పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది, అప్పటివరకు ఎగుమతిదారులు ఒత్తిడిని ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -