అఫ్గాన్‌తో భారత్ రెండో వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
వర్షం అంతరాయం కలిగించిన ధర్మశాల వన్డేలో శుభారంభం చేసిన టీమ్ ఇండియా.. నేడు లక్నోలో సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఓ విజయంపై కన్నేసిన అఫ్గనిస్తాన్ సిరీస్ పోరును ఆఖరు మ్యాచ్‌కు తీసుకెళ్లాలనే సంకల్పంతో కనిపిస్తోంది. భారత్, అఫ్గనిస్తాన్ రెండో వన్డే నేడు.
నవతెలంగాణ-లక్నో
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ మరో 17 మాసాల దూరంలో ఉంది. అయినా, భారత్ అప్పుడే ప్రపంచకప్ ప్రణాళికల్లో పడిపోయింది. ధర్మశాల వన్డేలో స్పిన్నర్ హర్ష్దూబె, పేసర్ గుర్నూర్ బరార్కు అరంగేట్ర అవకాశాలు అందించింది. ప్రపంచకప్ జట్టు కూర్పు దిశగా ఫోకస్ పెట్టింది. దీంతో అఫ్గనిస్తాన్‌తో నేడు రెండో వన్డే సైతం ఆ కోణంలోనే జరుగనుంది. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకునే అవకాశం లేకుండా.. ప్రపంచకప్ జట్టులో చోటుపై కన్నేసి భారత క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. ఇదే సమయంలో అఫ్గనిస్తాన్ సైతం వన్డే జట్టును నిర్మించేందుకు ఈ సిరీస్‌ను వాడుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. లక్నో ఎకానె స్టేడియంలో భారత్, అఫ్గనిస్తాన్ నేడు రెండో వన్డేలో తలపడనున్నాయి.
కుల్దీప్కు చోటు? : ధర్మశాల వన్డేలో యువ స్పిన్నర్ హర్ష్ దూబెకు అవకాశం ఇచ్చిన భారత్.. స్పిన్‌కు అనుకూలించే ఎకానె స్టేడియంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. పేసర్ ప్రసిద్ కృష్ణ స్తానంలో కుల్దీప్ బంతి అందుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. యువ బౌలర్లు గుర్నూర్ బరార్, హర్ష్ దూబెలు తొలి వన్డేలో మూడేసి వికెట్లు పడగొట్టారు. నేటి మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరిపై మంచి అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ భారీ ఇన్నింగ్స్‌లపై కన్నేశారు. శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ ఫామ్ కొనసాగిస్తే భారత్ భారీ స్కోరు చేయటం ఖాయం. ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌తో జట్టు సమతూకం మెరుగైంది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ బృందానికి సారథ్యం వహించనున్నాడు.
విజయమే లక్ష్యంగా : అఫ్గనిస్తాన్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ వైట్‌బాల్ ఫార్మాట్లో ప్రమాదకర హిట్టర్. 48 బంతుల్లోనే సెంచరీ సాధించిన గుర్బాజ్‌కు రెహమత్ షా, ఇబ్రహీం జద్రాన్ సైతం జతకలిస్తే అఫ్గనిస్తాన్ ఆతిథ్య జట్టుకు గట్టి పోటీ ఇవ్వగలదు. జియార్ రెహమాన్, మహ్మద్ సలీమ్, రషీద్ ఖాన్, ఘజన్ఫార్లతో కూడిన బౌలింగ్ లైనప్ భారత బ్యారట్లకు సవాల్ విసిరేందుకు ఎదురుచూస్తోంది.



