బుకింగ్‌కు ‘ముహూర్తం’.. క్షణాల్లో స్టాక్ మాయం
ఉదయం 6, మధ్యాహ్నం 3 గంటలకు స్లాట్ ఓపెన్
మిస్సయితే తర్వాతి రోజు వరకు ఎదురుచూపులే
బుక్‌చేసి 24 గంటల్లో తీసుకోకుంటే ‘క్యాన్సిల్’
రైతులను తీవ్ర ఇక్కట్లు పెడుతున్న యూరియా యాప్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేసేం దుకు యాప్‌ను తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్నప్ప టికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. యాప్‌లో స్టాక్ వివరాలు ఎప్ప్పుడు రిలీజ్ చేసేవారో ఇంతకు ముందు సమాచారం లేకుండే. ప్రస్తుతం ‘ముహూర్తం’ ఫిక్స్ చేశారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు స్టాక్ వివరాలు అప్‌డేట్ చేస్తున్నారు. అప్‌డేట్ చేసిన ఒక రెండు నిమిషాల్లోనే యూరియా ఖాళీ అవుతుంది. ఆ సమయంలో ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా రాకున్నా, టెక్నికల్ ఇష్యూ వచ్చినా, సర్వర్ సమస్య వచ్చి బుక్ కాకున్నా మరుసటి రోజు వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వైపు వర్షం లేదన్న బాధ కంటే కూడా యూరియా దక్కుతుందో లేదో అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దాంతో యాప్‌ను రద్దు చేసి గతంలో మాదిరిగా ఆధార్ కార్డు లింకుతో యూరియా ఇవ్వాలని, మక్క పంటకు యూరియా పరిమితి పెంచి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5,58,077 ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వనుండగా..
అందులో వరి 4,38,521 ఎకరాల విస్తీర్ణంలో పండించనున్నట్టు వ్యవ సాయ శాఖ అంచనా వేసింది. ఇందుకుగాను 80,857 మెట్రిక్ టన్నుల యూరియాకు ఇండెంట్ పెట్టారు. అదే విధంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 5,59,290 ఎకరాల విస్తీర్ణానికి గాను 3,20,000 ఎకరాల్లో వరి సాగవ నుండగా.. 50,079 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుంది. ప్రస్తుతం ఫర్టిలైజర్ యాప్ బుకింగ్ ద్వారానే రైతులకు యూరియా సరఫరా చేస్తున్నారు. ఒక ఎకరా ఉన్న వారికి రెండు బస్తాలు, మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు రెండు విడుతల్లో, ఐదు ఎకరాల వరకు మూడు సార్లు, ఐదు ఎకరాలు పైబడి విస్తీర్ణం కలిగిన వారికి నాలుగు విడతల్లో యూరియాను అందించేలా యాప్‌ను రూపొందించారు. ఒక్క ఫేజ్‌లో పొందిన రైతులకు 15 రోజుల తర్వాతనే మరోసారి యూరియా బుక్ కానుంది.
యాప్ బుకింగ్‌కు ఇబ్బందులు
యాప్‌లో యూరియా బుక్ చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో పలువురి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. సొసైటీలకు, ప్రయివేటు డీలర్‌లకు వచ్చిన స్టాక్‌ను ఆన్‌లైన్ లో ఎంట్రీ చేయగా.. బుకింగ్ చేసుకునేందుకు ఉదయం 6, మధ్యాహ్నం 3 గంటలకు స్లాట్ ఓపెన్ చేస్తు న్నారు. అదే సమయంలో ఏకకాలంలో పెద్దమొత్తంలో రైతులు యాప్‌ను ఓపెన్ చేస్తుండటంతో సర్వర్ సమస్యలు నెలకొంటున్నాయి. నెట్ సిగ్నల్ కొద్దిగా తక్కువగా ఉన్నా బుకింగ్ కావడం లేదు. స్మార్ట్ ఫోన్ లేని రైతులైతే ఇతరులను బతిమిలాడు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత చేసి చూస్తే తీరా ఒకటి రెండు నిమిషాల్లో బుకింగ్ క్లోజ్ అయి స్టాక్ వివరాలు ‘జీరో’ చూపిస్తున్నాయి. దీంతో తర్వాతి రోజు ఫోన్‌లతో యుద్ధం చేయాల్సి వస్తుంది. బుక్ అయిన తర్వాత అనివార్య కారణాల వల్ల 24 గంటల్లో తీసుకోకపోతే క్యాన్సిల్ చేస్తుండటంతో మరోసారి ‘యాప్ యుద్ధానికి’ సిద్ధమవ్వా ల్సిన పరిస్థితి నెలకొంది. సొంతూరులో స్టాక్ లేకుంటే ఇతర గ్రామాల్లో బుక్ అయితే అనేక వ్యయప్రయాసాలకోర్చి ట్రాన్స్‌ఫోర్ట్ ఛార్జీలు వెచ్చించాల్సి రావడంతో పాటు ఒక రోజు పని కోల్పోతున్నట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. అనేక అపసోపాలు పడి బుక్ చేసుకున్నా యూరియా తీసుకునే క్రమంలో సొసైటీలు, డీలర్లు రైతులకు వచ్చిన ఐడీని ఎంట్రీ చేయడంతో పాటు డీబీటీ మిషిన్‌లో సంబంధిత రైతు ఆధార్, ఓటీపీ ఎంట్రీ చేయాలి. అక్కడ సర్వస్ సమస్య వచ్చి నిలిచిపోయి 24 గంటల్లో యూరియా తీసుకోకుంటే బుకింగ్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి నెలకొంది.
యూరియా లిమిట్ పెంచాలని డిమాండ్
యూరియా అందుబాటులో ఉందని చెబుతున్న అధికారులు.. తమకు సరిపడా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎకరానికి రెండు బస్తాల చొప్ప్పున ఇస్తున్నారని.. వరికి సరిపోతుంది కాని మొక్కజొన్నకు సరిపోదని రైతులు పేర్కొంటున్నారు. మొక్కజొన్న అడుగుబాగాన వేసేందుకు చేతుతో వేస్తే ఒక్క విడుతకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు వినియోగించాల్సి వస్తుందని.. కావున ఎకరాకు నాలుగు బస్తాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతులకు అందుబాటులో యూరియా
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉంది. యాప్ ద్వారా ఇప్పటి వరకు లక్షా 39 వేల మంది రైతులకు 3.78 లక్షల బస్తాల యూరియా ఎరువు పంపిణీ చేశాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏఈవోలను అందుబాటులో ఉంచాం. యూరియా బుకింగ్ కు యాప్ లో ఇబ్బందులు ఉంటే ఏఈవోలను సంప్రదించండి. యాప్ బుకింగ్ గతంలో రెండు నిమిషాల్లో పూర్తయి నా ప్రస్తుతం ఒక్క రోజు వరకు కూడా స్టాక్ అందు బాటులో చూపిస్తుంది. ఇండెంట్ పెట్టిన ప్రకారం సొసైటీలకు, ప్రయివేటు డీలర్‌లకు యూరియా సరఫరా చేస్తున్నాం.
వీరస్వామి. నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి
సిగ్నల్ ఉంటే జీరో స్టాక్
యూరియా బుకింగ్ కోసం తెల్లవారకముందే ఫోన్లతో యుద్ధం చేయాల్సి వస్తుంది. స్టాక్ ఉంటే సిగ్నల్ ఉండదు.. సిగ్నల్ వచ్చే లోగా స్టాక్ జీరో అవుతుంది. మా చుట్టుపక్కల లేకుంటే ఎంత దూరమున్నా యూరియా కోసం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. డీలర్ షాప్‌లను వెతుక్కుంటూ వెళ్తున్నాం. అన్నం పెట్టే రైతులకు ఇన్ని గోసలు పెట్టొద్దు. రైతుల కష్టాన్ని చిన్నచూపు చూడొద్దు.
నాగం పరంధాములు. ఎల్లారెడ్డి



