Tuesday, February 17, 2026
E-PAPER
Homeబీజినెస్మూడో నెలలోనూ పెరిగిన టోకు ధరలు

మూడో నెలలోనూ పెరిగిన టోకు ధరలు

- Advertisement -

జనవరిలో 1.81 శాతానికి చేరిక
న్యూఢిల్లీ : దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) వరుసగా మూడో నెలలోనూ పెరిగింది. కేంద్ర పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నెలలో టోకు ద్రవ్యోల్బణం 1.81 శాతానికి చేరింది. ప్రధానంగా ఆహార పదార్థాలు, ఆహారేతర వస్తువులు, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంతక్రితం డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ 0.83 శాతంగా ఉంది. డిసెంబర్‌లో మైనస్‌ 0.43 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం.. జనవరిలో ఒక్కసారిగా 1.55 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా కూరగాయల ధరలు ఎగిసిపడ్డాయి. డిసెంబర్‌లో మైనస్‌ 3.50 శాతంగా ఉన్న కూరగాయల ధరలు అమాంతం జనవరిలో 6.78 శాతం ప్రియమయ్యాయి. ప్రాథమిక లోహాలు, వస్త్రాలు, ఇతర తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడంతో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 1.82 శాతం నుంచి 2.86 శాతానికి పెరిగింది.

ఆహారేతర వస్తువులు..
అహారేతర వస్తువుల ద్రవ్యోల్బణం జనవరిలో అత్యధికంగా 7.58 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం నెలలో ఇది కేవలం 2.95 శాతంగా ఉండటం విశేషం. కాగా.. ఇంధనం, విద్యుత్‌ రంగం సూచీ మాత్రం డిసెంబర్‌లో మైనస్‌ 2.31 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం జనవరిలో మరింత తగ్గి మైనస్‌ 4.01 శాతానికి చేరాయి. గత వారం విడుదలైన గణాంకాల ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా జనవరిలో స్వల్పంగా పెరిగి 2.75 శాతానికి చేరింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధానంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆధారంగానే వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ధరలు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో జరిగిన సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. ముందుముందు ఆహార పదార్థాల ధరలు మరింత పెరిగితే.. ఆర్బీఐ తన పరపతి విధానంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -