నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఆగిపోయింది. అందుకు కోర్టు స్టేనే కారణం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఉద్రిక్తతల నడుమే ఓటింగ్ జరగింది. ఈ క్రమంలో 15 ఓట్లతో చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. ముందు నుండి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సోమవారం వివిధ కారణాలతో వాయిదా పడ్డా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారం కూడా అత్యంత రసవత్తరంగా సాగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు.. చేతులెత్తి చైర్మన్‌ను ఎన్నుకోవాలని సూచించారు.
అయితే దీనికి కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రహస్యంగా ఓటింగ్ నిర్వహించాలని గొడవకు దిగారు. మరోవైపు, ఎన్నికల నియమావళి ప్రకారమే ఓటింగ్ జరగాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య అరుపులు, కేకలతో సభ మారుమోగింది. ఈ క్రమంలో ఉద్రిక్తత పెరిగి కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, రిటర్నింగ్ అధికారి పట్టుదలతో ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు.
చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 15 ఓట్లతో బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల భాస్కర్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఆర్ఎస్ ప్యానల్ ఈ స్థానాన్ని కూడా దక్కించుకోవడం విశేషం. కాగా ఎవరూ ఉహించని రీతిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. దీంతో వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ శుక్రవారం కి వాయిదా పడింది.



